breaking news
Vietnamese woman
-
జ్ఞానదక్షిణ.. గ్రేట్ జర్నీ
‘భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’ మనం అందరమూ ఈ ప్రతిజ్ఞ చేసినవాళ్లమే. పెద్దయ్యి చదువులలోని సారమెల్ల గ్రహించడంతోపాటు బతుకు పాఠాలు నేర్చుకోవడంలో మునిగిపోయిన క్షణం నుంచి ప్రతినబూనడానికి బిగించిన పిడికిలి ఎప్పుడు సడలిందో మనకు గమనింపు కూడా ఉండదు. దేశాన్ని ప్రేమించడం, దేశం లో అందరినీ సహోదరులుగా భావించడం... ఈ రెండూ జీవితపు సోపానపటంలో ఇమడని అంశాలుగా మారిపోతున్నాయి కూడా. అభ్యున్నతి బాటలో ఎదగడం కోసం మన మనసు పరిధిని కుదించుకుంటూ పోతున్నాం. మనం ఇలా ఉంటే... చదువుకోవడానికి మనదేశానికి వచ్చిన వియత్నాం మహిళ తనదేశంతో సమానంగా మనదేశాన్ని కూడా ప్రేమిస్తోంది. పేదవాళ్లకు ఆహారధాన్యాలను, ఆత్మీయతను పంచుతోంది. ‘‘కోవిడ్ 19తో ప్రపంచం కుదేలయిపోతోంది. మా దేశంలో మేమంతా సంఘటితమై కరోనాతో పోరాడుతున్నాం. భారతదేశం చేస్తున్న పోరాటంలో మా వంతుగా ఓ చిన్న సహాయం మాత్రమే’’ అన్నారు ఫామ్ థి లెన్. ఆమె గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వియత్నాం వాసులను అనుసంధానం చేస్తున్నారీమె. ప్రేమ... పంచితే పెరుగుతుంది ‘‘మాకు చదువు చెప్పిన దేశం మాకు పరాయి దేశం ఎలా అవుతుంది? ఈ దేశంలో ఉన్న పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అసహాయ మహిళలకు కరోనా పోరాటంలో అండగా నిలవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందనుకుంటున్నాం. కరుణ, పరస్పర ప్రేమ స్ఫూర్తితో ఈ పని మొదలు పెట్టాం. ప్రభుత్వాలు ఆదుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ మాకు చేతనైనంత మందిని కలిసి ‘భయపడవద్దు. కరోనాను జయించగలుగుతాం’ అని ధైర్యం చెప్తున్నాం. వృద్ధులు, పేదవాళ్లు మేము ఆత్మీయంగా చెప్పే మాట కోసమే ఎక్కువ ఆర్తిగా ఉంటున్నారు. మా ఈ చిన్న సహాయం మనుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సంఘీభావాన్ని పెంచుతుంది. ఈ బంధం కొనసాగాలి. మనిషి జీవన ప్రయాణంలో ఇలాంటి ఎన్ని మహమ్మారులు ఎదురైనా ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ కష్టం నుంచి ఇండియా త్వరగా గట్టెక్కాలని మా వియత్నాం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించగలుగుతున్నాం. కోవిడ్ రాక ముందు కూడా నిరుపేదలకు ఆహార ధాన్యాలు, దుప్పట్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. నార్త్ ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాల కల్పన, బుద్ధగయ దగ్గర ఆహారధాన్యాల పంపిణీ వంటి పనులను సమన్వయం చేస్తున్నాం. నాకు జ్ఞానమిచ్చిన దేశానికి చెల్లించుకుంటున్న గురుదక్షిణ ఇది’’ అన్నారు ఫామ్ థి లెన్. మహమ్మారితో పోరాటం పీహెచ్డీ తర్వాత పుస్తకాలు రాయడం మీద దృష్టిపెడతానని చెప్తున్న ఫామ్ థి లెన్... ఆధ్యాత్మికత నిండిన శాంతికాముక ప్రపంచసాధన కోసం శాంతి బోధనకు అంకితమవుతానని చెప్పారు. వీలయినంత మందిని కలిసి బాధల నుంచి విముక్తి పొందడానికి అవసరమైన మనోధైర్యాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘మానవత్వంతో చేతులు కలిపితే మహమ్మారిని జయించగలుగుతాం. శాంతి సంతోషాలతో జీవించగలుగుతాం’’ అన్నారు ఫామ్ థి లెన్. నాగార్జునుడు నడిచిన నేల ఫామ్ థి లెన్ 1973 జూన్లో సౌత్ వియత్నాంలోని బీయిన్ హోవా పట్టణలో పుట్టారు, ఏడుగురు సంతానంలో ఆమె ఆరవ వారు. ఆమె తండ్రి సైనికుడు. వియత్నాం స్వేచ్ఛకోసం యుద్ధం చేశారు. తల్లి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సమాజంలోని పీడిత మహిళల కోసం సేవలందించేవారు. ఫామ్ థి లెన్ 24 ఏళ్ల వయసు లో సన్యాసినిగా మారారు. ఐదేళ్ల కిందట పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆమె ఇండియాకి వచ్చారు. విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చినప్పుడు ఇండియానే ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉందన్నారామె. ‘ఇది అహింసను పాటించిన గాంధీజీ దేశం. శూన్యవాదాన్ని బోధించిన నాగార్జునుడు నడిచిన నేల. అంతకంటే ప్రధానంగా సర్వ మానవాళి స్వేచ్ఛ, శాంతికోసం పాటుపడిన బుద్ధుడి ప్రదేశం’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి -
ఆమె విడుదల.. పంది మాంసంతో విందు
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న వియత్నాం మహిళ డొయన్ థి హ్యుంగ్(30)కు విముక్తి లభించింది. రెండేళ్లుగా మలేసియా జైల్లో ఉన్న డొయన్ శుక్రవారం విడుదలైనట్టు ఆమె తరపు న్యాయవాది దాతుక్ నారన్ సింగ్ తెలిపారు. 2017, ఫిబ్రవరి 13న కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జాంగ్ నామ్ హత్యకు గురయ్యారు. ఆయన ముఖ్యంపై ప్రమాదకరమైన వీఎక్స్ అనే రసాయన ద్రవ పదార్థాన్ని చిమ్మడంతో నామ్ మృతి చెందారు. ఈ కేసులో డొయన్తో పాటు ఇండోనేసియాకు చెందిన మరో మహిళ సితీ ఐశ్యాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై మోపిన హత్యారోపణలను మలేసియా న్యాయాధికారులు ఉపసంహరించడంతో మార్చి నెలలో జైలు నుంచి సితీ ఐశ్యా విడుదలయ్యారు. కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో వీరు పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని డిఫెన్స్ లాయర్లు వాదించారు. కిమ్ ముఖ్యంపై చిమ్మింది విష పదార్థమని నిందితురాళ్లకు తెలియదని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన డొయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పుత్రజయకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం విమానంలో వియత్నాం రాజధాని హనోయ్కు ఆమెను పంపించనున్నారు. విమానం ఎక్కే ముందు డొయన్.. విలేకరుల సమావేశం నిర్వహిస్తారని ఆమె తరపు న్యాయవాది నారన్ సింగ్ తెలిపారు. డొయన్కు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, సోదరుడు హనోయ్ విమానాశ్రయానికి వస్తారని వెల్లడించారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత గతంలో మాదిరిగానే నటన, సింగింగ్ కెరీర్ను ఆమె కొనసాగిస్తుందన్నారు. డొయన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల తనతో పాటు, తమ గ్రామం కూడా ఎంతో సంతోషంగా ఉందని ఆమె తండ్రి రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్లో చెప్పారు. డొయన్ రాకను పురస్కరించుకుని ఆదివారం తమ గ్రామంలో పార్టీ ఏర్పాటు చేశామని, పందులను కోసి విందు భోజనం పెడతామని.. ఎవరైనా పార్టీకి రావొచ్చని అన్నారు. తన కూతురికి వేయించిన చేపలు అంటే ఇష్టమని తెలిపారు. -
డబ్బు కోసం ఎంత పని చేసింది!
హనోయ్: బీమా సొమ్ము కోసం వియత్నాంలో ఓ మహిళ ఎవరూ చేయని పని చేసింది. ఆమె చేసిన దుష్కృత్యం బట్టబయలై ఆమె చిక్కుల్లో పడిందని అధికారిక మీడియా వెల్లడించింది. రైలు ప్రమాదంలో తన ఎడమ చేయి, కాలు తెగిపోయాయని 'ఎట్టీఎన్' అనే 30 ఏళ్ల మహిళ బీమా సంస్థను ఆశ్రయించింది. రైలు ప్రమాదం నుంచి 'డీ' అనే స్నేహితుడు కాపాడని తెలిపింది. తనకు పరిహారంగా దాదాపు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని బీమా సంస్థను కోరింది. అయితే బీమా సొమ్ము కోసం ఆమే తన చేయి, కాలు తీయించేసుకుందని తెలిసి అంతా అవాక్కయ్యారు. తన స్నేహితుడికి రూ.లక్షన్నర ఇస్తానని ఆశ చూపి ఈ అఘాయిత్యం చేయించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. హనోయ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె చేయి, కాలు అతికించే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. డబ్బు కోసం సిగ్గుమాలిన పనికి పాల్పడిన 'ఎట్టీఎన్' చేయి, కాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం మోసాలకు పాల్పడేవారికి ఈ ఉదంతం హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.