మరో 3 ప్లాంట్లలో మొబైల్స్ తయారీ
⇒ సామర్థ్యం నెలకు 20 లక్షల యూనిట్లకు
⇒ వీడియోకాన్ మొబైల్స్ హెడ్ జెరాల్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ కంపెనీ వీడియోకాన్ సెల్ఫోన్ల తయారీని విస్తరిస్తోంది. హైదరాబాద్, కోల్‌కత, మధురై ప్లాంట్లలో మొబైల్స్ తయారీ లైన్స్‌ను రూ.180 కోట్లతో ఏర్పాటు చేస్తోంది. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఈ ప్లాంట్లలో సెల్ఫోన్ల తయారీ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంపెనీ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ప్లాంట్లలో మొబైల్స్‌ను రూపొందిస్తోంది.
ఈ ఏడాది చివరికల్లా అయిదు ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 20 లక్షల యూనిట్లకు చేరుతుందని వీడియోకాన్ మొబైల్ ఫోన్స్ విభాగం బిజినెస్ హెడ్ జెరాల్డ్ చగాస్ పెరీరా ఆదివారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘మొబైల్స్‌కు ప్రత్యేక ప్లాంట్లు పెట్టబోం. ఉపకరణాల తయారీకై సంస్థకు దేశవ్యాప్తంగా 17 ప్లాంట్లున్నాయి. దశలవారీగా వీటిలో మొబైల్స్ తయారీ లైన్స్‌ను నెలకొల్పుతాం. ఏడు దేశీయ సెల్‌ఫోన్ బ్రాండ్లకు ఫోన్లను తయారు చేస్తున్నాం’ అని వివరించారు. ఫీచర్ ఫోన్లకై 35 శాతం విడిభాగాలను భారత్‌లో తయారు చేస్తున్నామని చెప్పారు. చార్జర్లు, బ్యాటరీ సెల్స్ ఇక్కడే ఉత్పత్తి చేస్తామన్నారు. పరిస్థితులు అనుకూలించగానే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని పెరీరా తెలిపారు. మేక్ ఇన్ ఇండియా తొలి అక్టాకోర్ ఫోన్ జడ్55 డాష్ రూ.7,500లకే వచ్చే నెలలో రానుంది.