breaking news
veternary centre
-
ఆబోతు రంకేస్తోంది!
నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రం రంకేస్తోంది. మేలు రకం ఆబోతుల నుంచి నాణ్యమైన వీర్యాన్ని సేకరిస్తూ ఏటా లక్ష్యాన్ని సాధిస్తోంది. అంతరిస్తున్న అరుదైనపశుజాతులను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రపోషిస్తోంది. ఏటా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు డోస్‌ల వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఎక్కడ లేని విధంగా 10 జాతుల పశువుల వీర్యాన్ని సేకరించి, భద్రపరిచి అవసరమైన జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తూ అరుదైన గుర్తింపు పొందిన నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రంపై ప్రత్యేక కథనం సాక్షి, కర్నూలు : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల ఘనీకృత వీర్య కేంద్రంలో పలు జాతుల పశువుల నుంచి వీర్యాన్ని సేకరిస్తున్నారు. పట్టణంలోని కడప–కర్నూలు జాతీయ రహదారి పక్కన నూనెపల్లెలోని 15.27 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పశు గణనాభివృద్ధి సంస్థ, ఘనీకృత వీర్యకేంద్రం ఉంది. 1976 డిసెంబర్ 7న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, సిబ్బంది పని చేస్తున్నారు. ఘనీకృత వీర్య కేంద్రానికి చెందిన భవనాలు ఐదు ఎకరాల్లో ఉండగా, మిగతా 10.27 ఎకరాల్లో ఆబోతులకు అవసరమైన సూపర్ నేపియర్, కాకిజొన్న, గనిగడ్డి లాంటి నాణ్యమైన పశుగ్రాసాన్ని సాగు చేస్తున్నారు. వీర్య నాశికలను సరైన సమయంలో ఉత్పత్తి చేసి సరఫరా చేయడం. నిరంతరం వీర్య నాణ్యతను పరిశీలిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించిన మినిమం స్ట్రాడెడ్స్ ప్రొటోకాల్‌ను పాటించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం. 1982లో ఘనీకృత పశువీర్యాన్ని నంద్యాలలోనే ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఉన్న ఆబోతులను బయోసెక్యూలర్ జోన్లో ఉంచి వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేసి ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి చేసిన వీర్యనాశికలు మన రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా తమిళనాడు, తెలంగాణ, కేరళ, కలకత్తా, భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. 2000లో ఈ కేంద్రం అభివృద్ధి చెందడంతో ఆంధప్రదేశ్ పశుగణనాభివృద్ధి సంస్థలో చేర్చారు. నాణ్యమైన వీర్య ఉత్పత్తి ఇలా.. ఒక్కొక్క వీర్యనాశికలో 0.25 ఎం.ఎల్. వీర్యం ఉంటుంది. అందులో దాదాపుగా 2కోట్ల వీర్యకణాలు ఉంటాయి. వీర్యాన్ని సేకరించిన తర్వాత దానిని పరీక్షించి భద్రపరుస్తారు. ఉత్పత్తి చేసిన వీర్యంతో పశువుకు గర్భదారణ చేసిన అనంతరం పశువు అనారోగ్యానికి గురి కాకుండా చూస్తారు. వీర్యంలో నిర్దేశించిన కణాల శాతం కచ్చితంగా ఉండేలా చూస్తారు. అనంతరం ఈ వీర్యాన్ని విశాఖపట్నంలోని ఆండ్రాలజీ ల్యాబోరేటరీకి పంపి నాణ్యతను పరీక్షించి అనంతరం ఇక్కడ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు సరఫరా చేస్తారు. సంస్థ సాధించిన విజయాలు.. 2007లో మానిటరింగ్ యూనిట్‌చే నాణ్యమైన వీర్యాన్ని ఉత్పత్తి చేయడంలో ఏ–గ్రేడ్ సాధించింది. 2010లో బీ–గ్రేడ్‌ను సాధించింది. 2013లో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ వారు నంద్యాల ఘనీకృత వీర్యకేంద్రానికి ఏ–గ్రేడ్ రెండవ సారి ప్రదానం చేశారు. ఈ సంవత్సరంలోనే నంద్యాల నుంచి జేకే ట్రస్ట్ ద్వారా అదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని బాసరా, తమిళనాడు రాష్ట్రాలకు వీర్యనాశికులు సరఫరా చేసింది. 2016–17లో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ నుంచి మూడవసారి నాణ్యమైన వీర్య ఉత్పత్తిలో ఏ–గ్రేడు సాధించింది. -
శిథిలావస్థలో పశువైద్య ఉపకేంద్రం
ఆందోళన చెందుతున్న సిబ్బంది పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి అలాగే సిబ్బంది కొరతతో అందని పశువైద్యసేవలు న్యాల్కల్: పశు సంవర్థక శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్న ఒకటి రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మంజూరైన భవనాల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నత్తనడకన కొనసాగుతుండడంతో ఇటు అధికారులు, అటు రైతులు, పశు పోషణాదారులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్దంగా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది భయాందోళన చేందుతున్నారు. మంజూరైన భవనాల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి తోడు వైద్యులు, సిబ్బంది కోరత కారణంగా పశువులకు సరైన వైద్యం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని న్యాల్కల్, మిర్జాపూర్(బి)లో పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. న్యాల్కల్ పశు వైద్య కేంద్రం పరిధిలో డప్పూర్, చాల్కి, న్యాల్కల్, మిర్జాపూర్(బి) పశు వైద్య కేంద్రం పరిధిలో హద్నూర్, మెటల్‌కుంట, మిర్జాపూర్(బి)లలో పశు వైద్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాల్కి, హద్నూర్, మెటల్‌కుంట పశు వైద్య ఉప కేంద్రాల భవనాలు శిథిలాస్థకు చేరుకున్నాయి. చాల్కిలోని పశు వైద్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకొని పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయని గ్రామంలో నిర్వహించిన పలు సమావేశాల్లో గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. ముఖ్యంగా వర్షాలకు పైకప్పు పెచ్చులూడి కింద పడుతుండడంతో ఎప్పుడూ ఏ ప్రమాదం జరుగుతుందోని వైద్య సిబ్బంది ఆందోళన చెందుత్నున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వం చాల్కికి నూతన భవనాన్ని మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం భవన నిర్మాణ కోసం రూ.5.40 లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర పనులు ప్రారంభించాడు. రెండున్నర ఏళ్లు గడిచినా నిర్మాణ పనులు పూర్తికాలేదు. నిధులు సరిపోకపోవడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ఇటు వైద్య సిబ్బంది అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హద్నూర్లో కూడా పశు వైద్య కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. భవనం కురుస్తుండటంతో మందులు భద్రపరచలేకపోతున్నామని సిబ్బంది విచారం వ్యక్తంచేశారు. అలాగే మెటల్కుంటలో సొంత భవనం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలో ఒక గదిని పశు వైద్యశాల కింద ఉపయోగించుకుంటున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న భవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న భవనం నిర్మాణ పనులను పూర్తి చేయించి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల రైతులు, పశుపోషణాదారులు కోరుతున్నారు. సిబ్బంది కోరతతో అందని వైద్యసేవలు పశు వైద్య కేంద్రాలతో పాటు ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కోరతతో పశువులకు సక్రమంగా వైద్యం అందడం లేదని రైతులు, పశుపోషణాదారులు ఆరోపిస్తున్నారు. మండలంలో మొత్తం 39 గ్రామాలుండగా ఆస్పత్రులు మాత్రం ఆరు మాత్రమే ఉన్నాయి. అందులోనూ సిబ్బంది కోరత తీవ్రంగా ఉంది. ఇద్దరు డాక్టర్లు ఉండవలసి ఉండగా కేవలం ఒక డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. న్యాల్కల్లో ఉన్న ఒక్క డాక్టర్‌ను ఇతర ప్రాంతాల అదనపు బాధ్యతలను అప్పగించడంతో పశువులకు సరైన వైద్య అందడం లేదని రైతులు, పశు పోషణాదారులు ఆరోపిస్తున్నారు. అలాగే చాల్కిలో వైద్య సిబ్బంది సమయానికి రాకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి పశువులకు చికిత్స చేయించాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని మరికొన్ని పశు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో తగిన వైద్య సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడూ మూసే ఉంటుంది గ్రామ సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఆస్పత్రి ఎప్పుడూ మూసే ఉంటుంది. సిబ్బంది సక్రమంగా రాకపోవడంతో చిన్న చిన్న జబ్బులు వచ్చినా పశువులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళుతున్నాం. కొత్తగా కట్టిన దవాఖాన కూడా చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. - సద్దాం, పశుపోషణాదారుడు, చాల్కి భవనం నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం చాలా రోజుల నుంచి పూర్తి కాలేదు. ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని భవనం పనులు త్వరగా పూర్తి చేయించాలి. - జైపాల్‌రెడ్డి, రైతు, చాల్కి నిధులకు అనుగుణంగా పనులు చేపట్టలేదు చాల్కి ఉపకేంద్ర భవన నిర్మానాణికి ప్రభుత్వం రూ. 5.40 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులకు అనుగుణంగా భవనం పనులు చేపట్టలేదు. పైగా నిధులు సరిపోకపోవడంతో పనులు మధ్యలోనే ఆపివేశారు. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. న్యాల్కల్లో ఉన్న డాక్టర్‌కు అదనపు బాద్యతలు అప్పగించారు. కొత్త డాక్టర్‌ను నియమించి న్యాల్కల్లో పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. - సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జహీరాబాద్