విద్యాలయాలా? బలిపీఠాలా?
డేట్లైన్ హైదరాబాద్
‘ఏమైనా నిజాయితీ ఉన్నట్టయితే ఆ విశ్వవిద్యాలయం పెద్దలు తమ క్యాంపస్‌ను సంస్కరించుకోవాలి. దళిత విద్యార్థులకు శత్రుదేశంలో సంచరి స్తున్నామన్న అనుభూతి కలగని స్నేహ వాతావరణం కల్పించాలి. ఇటు ఉద్యమకారులూ, పీడిత ప్రజల శ్రేయోభిలాషులూ పీడన నుండి పుట్టిన నిరసన తీసుకునే అన్ని రూపాలనూ అర్థం చేసుకునే దగ్గర ఆగిపోకుండా ఆ పీడనను అంతం చేసే దిశగా ప్రజలు నడవడానికి అవసరమైన విమర్శలనూ, సలహాలనూ నిర్మొహమాటంగా అందించడానికి సిద్ధపడాలి.’ ప్రముఖ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రీయవిశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) గురించి ఒక వ్యాసంలో రాసిన వాక్యాలివి. డాక్టర్ బాలగోపాల్ చేసిన సూచనను ఆ యూనివర్సిటీ పెద్దలు ఇన్నేళ్లయినా పాటించే ప్రయత్నం చెయ్యక పోగా ఇంకా ఇంకా అదే మార్గంలో వెళుతూ, మరింత దుర్మార్గంగా తయారయ్యారని ప్రస్తుత ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలోనూ ఇదే జరిగింది
2002లో హెచ్‌సీయూ యాజమాన్యం క్యాంపస్‌లో జరిగిన ఒక అల్లరి కారణంగా పది మంది రీసెర్చ్ స్కాలర్లను యూనివర్సిటీ నుంచి తొలగిం చింది. అంటే వారు ఇంకే ఇతర యూనివర్సిటీలోనూ చేరడానికీ, తమ చదువు పూర్తి చెయ్యడానికీ వీల్లేని శిక్ష. ఆ పదిమంది విద్యార్థుల భవిష్యత్తు ఏమయిందో, ఇప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో మనకు తెలియదు కానీ, ఇప్పుడా సంఘటన గురించి మాట్లాడుకోడానికి అనేక కారణాలున్నాయి. బాలగోపాల్ మాటలను గుర్తు చే సుకోడానికి కూడా. అప్పట్లో యూనివర్సిటీ నుంచి రస్టికేట్ అయిన పదిమందీ దళితులే, అంబేడ్కర్ విద్యార్థి సంఘం సభ్యులే కూడా.
ఆనాటి తగాదా అంతా యూనివర్సిటీలో మెస్ నిర్వహణ గురించి. చీఫ్ వార్డెన్‌గా వచ్చిన ఒక ప్రొఫెసర్ మెస్ కొనుగోళ్లను ఒక కాంట్రాక్టర్‌కు అప్ప గించాలని ప్రతిపాదించాడు. దానిని విద్యార్థులు, ముఖ్యంగా దళిత విద్యార్థులు వ్యతిరేకించారు. మెస్ బిల్లులు పెరుగుతాయనే కాకుండా, అప్పటి దాకా ఆ బాధ్యత దళిత విద్యార్థులే చూసుకుంటున్నారు. చీఫ్ వార్డెన్‌గా వచ్చి ఈ కొత్త ప్రతిపాదన తెచ్చిన ప్రొఫెసర్ పేరు అప్పారావు. ఆయన చేసిన నిర్వాకం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణలకు దారి తీసి, యాజమాన్యం 10 మంది దళిత విద్యార్థులను రస్టికేట్ చేసే దాకా వెళ్లింది.
బాలగోపాల్ కోరుకున్నట్టు విశ్వవిద్యాలయం పెద్దలు తమ క్యాంపస్నయితే సంస్కరించుకోలేదు కానీ, దళిత విద్యార్థులు తాము శత్రుదేశంలో సంచరి స్తున్నామన్న అనుభూతి అంతకు వంద రెట్లు ఎక్కువయ్యేటట్టు మాత్రం చెయ్యగలిగారు. ఆనాడు చీఫ్ వార్డెన్‌గా పది మంది దళిత విద్యార్థులు రస్టికేట్ కావడానికి బాధ్యుడయిన ప్రొఫెసర్ గారు ఈ రోజు అదే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా మరో అయిదుగురు దళిత విద్యార్థులను క్యాంపస్‌లోనే సంఘ బహిష్కరణకు గురిచేశారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ పద్నాలుగేళ్లుగా ఈ ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నది. ఈ యూనివర్సిటీలో ప్రస్తుత సంఘటన చూస్తుంటే ఇదే బాలగోపాల్ ఇంకోచోట చెప్పినట్టు ఇవి విజ్ఞాన కేంద్రాల్లాగా కాకుండా ఆధునిక అగ్రహారాల్లాగా కనిపిస్తాయి.
ఇది సంఘ బహిష్కారం కాదా?
ఇక ప్రస్తుతానికి వస్తే, హెచ్‌సీయూ యాజమాన్యం అయిదుగురు విద్యా ర్థులకు పదిహేనురోజుల క్రితం సంఘ బహిష్కారం విధించింది. ఈమాట వింతగా అనిపించవచ్చు. కానీ జరిగింది ఇదే. ఈ అయిదుగురు విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చు. కానీ హాస్టల్లో ఉండకూడదు. మెస్‌లో భోజనం చెయ్యకూడదు. లైబ్రరీకి వెళ్లకూడదు. విద్యార్థులెవరితోనూ మాట్లా డకూడదు. దీన్ని సంఘ బహిష్కారం అనకుంటే, మరేం అనాలో యూని వర్సిటీ పెద్దలు, ముఖ్యంగా వైస్ చాన్స్‌లర్ అప్పారావు చెప్పాలి.
రెండు వారాల పాటు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే వెలివాడ పేరిట ఒక గుడారం వేసుకుని గడిపిన ఆ విద్యార్థులలో రోహిత్ వేముల మొన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచానికి అద్భుతమయిన మేధావులను అందించాల్సిన విశ్వవిద్యాలయంలో వెలివాడ వెలియడం ఏ విలువలకు, సంస్కారానికి అద్దం పడుతుంది అనే మాట గురించి తరువాత మాట్లాడుకుందాం.
జరిగింది రెండు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ. యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను వ్యతిరేకించిన వర్గం విద్యార్థులకు, అది జాతివ్యతిరేక వైఖరి అని వాదించే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ. యాకూబ్ మెమెన్‌ను ఉరి తీయడం తప్పు అని నమ్మేవాళ్లు, వాదించే వాళ్లు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. దేశద్రోహులనే ముద్రవేస్తారని భయపడి అందరూ బయటపడకపోవచ్చు. ఈ ఘర్షణలో ఒక ఏబీవీపీ నాయకుడి మీద దాడి చేశారన్న అభియోగం ఈ దళిత విద్యార్థుల మీద ఉంది. యూనివర్సిటీ అధికారులు పద్నాలుగేళ్ల నాడే బాలగోపాల్ లాంటి పెద్దలు చెప్పిన మాటలను చెవికెక్కించుకుని ఉంటే ఒక అద్భుత విద్యా వంతుడయిన యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు.
ఏబీవీపీ నాయకుడి ఫిర్యాదును కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రం దాకా తీసుకుపోయి ఉండకపోతే, ఇది విద్యార్థి వర్గాల మధ్య జరిగే సాధారణ ఘర్షణగానే పరిగణించినా కూడా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఏబీవీపీ నాయకుడి ఫిర్యాదు మీద ఆయన కేంద్ర మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీకి రాసిన అధికారిక లేఖ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కాదు, దిగ్భ్రాంతి కలుగుతుంది. హెచ్‌సీయూ క్యాంపస్ ఇటీవలి కాలంలో కులతత్వవాదులకు, తీవ్రవాదులకు, జాతి వ్యతిరేక రాజకీయాలకు నిలయంగా మారిందని ఆయన స్మృతి ఇరానీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
క్యాంపస్ ఇట్లా మారింద నడానికి ఆయన ఇదే లేఖలో పేర్కొన్న ఉదంతం ఏమిటంటే, దళిత విద్యా ర్థులు తమ ఏబీవీపీ నాయకుడి మీద క్యాంపస్‌లో దాడి చెయ్యడం. యాకూబ్ మెమెన్ ఉరిని వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిరసనలు తెలిపితే దానికి అభ్యంతరం తెలిపినందుకు ఏబీవీపీ నాయకుడి మీద దాడి చేశారు కాబట్టి ఇది జాతి వ్యతిరేక, తీవ్రవాద, కులోన్మాద రాజకీయం అని కేంద్రమంత్రి మరో కేంద్రమంత్రికి రాసిన లేఖలో నిర్ధారించేస్తారు.
మంత్రుల వైఖరి సరికాదు
దత్తాత్రేయ ఆ లేఖ రాసి ఊరుకుంటే బాగుండేది. ఆయనో, ఆయన తరఫున ఆ పార్టీ నాయకులు మరొకరో కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ మీద ఎంత పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారో చెప్పడానికి యూనివర్సిటీ అధికారులకు ఆ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వరసగా వచ్చిన నాలుగు అధికారిక లేఖలు నిదర్శనంగా నిలుస్తాయి. ఏ ఆలోచనతో చేసినా కేంద్ర మంత్రుల ఇరువురి చర్య ఇవాళ భారతీయ జనతా పార్టీనీ, ఆ పార్టీ ప్రభుత్వాన్నీ బోనులో నిలబెట్టింది. దీంతో సహజంగానే రాజకీయ పార్టీలు అధికారపక్షాన్ని దోషిగా నిలబెట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం హెచ్‌సీయూ క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఇతర పార్టీల నాయకులు కూడా విద్యార్థులకు సంఘీభావంగా నిలబడనున్నట్టు వార్తలొస్తున్నాయి.
వ్యవస్థపైనే ఆగ్రహం
ఇక వెలివాడ వేసుకుని పక్షం రోజులుగా యూనివర్సిటీ యాజమాన్యం, బీజేపీ నాయకత్వం దుర్మార్గపు చర్యకు నిరసన తెలుపుతున్న రోహిత్ మిత్రులు మాత్రం మొత్తం సమాజంలోని అన్ని వర్గాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అద్భుతమయిన భవిష్యత్ కలిగిన సైన్స్ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకునే వరకూ తమను పట్టించుకోని రాజకీయ పార్టీలూ, వాటిలో ఉన్న దళిత నాయకులూ, దళిత సంఘాలూ, మీడియా పట్ల విద్యార్థుల్లో ఉన్న ఆగ్రహం ఒక్కసారి క్యాంపస్ వైపు వెళ్లి చూస్తే తెలుస్తుంది. రోహిత్ మృతదేహాన్ని తరలించడంలో, అంత్యక్రియలు హడావుడిగా జరిపించిన తీరు పట్ల కూడా విద్యార్థులు ఆగ్రహంతోనే ఉన్నారు.
నిజమే, ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే తప్ప మనమెవ్వరం కదలమా? వారి ఆగ్రహం ధర్మమే కదా! బాలగోపాల్ ఇప్పుడు లేరు. ఆయన ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడయినా యూనివర్సిటీ పెద్దలు అర్థం చేసుకుని, రాజకీయ పెద్దలు జొరబడకుండా చూసుకుని సంస్క రించుకుంటే మంచిది. మా ఆలోచనను వ్యతిరేకించే వాళ్లంతా దేశ ద్రోహులే అన్న ఆలోచన బీజేపీ పెద్దలు కూడా మానుకుంటే మంచిది. దళితులే కాదు, మనుషులెవరూ శత్రుదేశంలో సంచరిస్తున్నామన్న భీతికి లోనుకాకుండా ఉండే పరిస్థితి రావాలని కోరుకుందాం.
- దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com