ఈవ్టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి..
మీరట్(యూపీ): ఓ బాలికను కాపాడబోయిన జవానును ఈవ్‌టీజర్లు బలి తీసుకున్నారు. మీరట్‌లో ఈవ్టీజర్ల దాడిలో గురువారం తీవ్రంగా గాయపడిన వేదమిత్ర చౌధరీ(35) అనే జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మీరట్‌లోని హర్దేవ్నగర్, రోహ్తా రోడ్డులో గల ఓ పాల బూత్ యజమాని కూతురిని పలువురు యువకులు వేధిస్తుండగా అక్కడికి పాలకోసం వెళ్లిన జవాను వారిని వారించారు.
బాలికను కాపాడేందుకు యువకుల్లో ఒకడిపై చేయి కూడా చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తన స్నేహితులను పిలవడంతో వారు కర్రలు, ఆయుధాలతో వచ్చి చౌధరిని తీవ్రంగా గాయపర్చారు. చౌధరీ నగరంలోని గోపాల్ విహార్‌లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇతరుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.