breaking news
Uttarakhand election
-
జోషీమఠ్‌లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?
ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్, దసౌలి డెవలప్మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోషీమఠ్‌కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. -
ఉత్తరాఖండ్ పీఠం కొత్తవారికే?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ సీఎంగా ఎవరిని నియమిస్తుందనే దానిపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే నలుగురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలో చేరి విజయం సాధించటంతో వీరిలో ఒకరికి పగ్గాలు అప్పగిస్తారని చర్చ జరుగుతున్నా.. బీజేపీ అధిష్టానం వేరోలా ఆలోచిస్తోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయం అని చెబుతున్నప్పటికీ.. పార్టీకి విధేయులుగా ఉంటూ కేంద్రం ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్లగలరు అనుకునే వారికే పట్టంగట్టనున్నట్లు తెలుస్తోంది. ‘మోడీ హవాతోనే ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. అందుకే సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా.. వారు ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీలను పూర్తిచేసేవారు కావాలి. అందుకే సీనియారిటీ, పాలనా అనుభవంతో సంబంధం లేకుండా సీఎం ఎంపిక జరుగుతుంది’ అని బీజేపీ సీనియర్ నేత (పేరు వెల్లడించేందుకు ఇష్టపడని) వెల్లడించారు. దీనికి తోడు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందికి పరిచయం లేనివారు, పత్రికల్లో ప్రముఖంగా నిలవని వారు సీఎం అయ్యే వీలుంది’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో.. తన పర్యవేక్షణలో పనిచేసే ఉత్తమమైన జట్టు (సీఎం, మంత్రులు)ను రాష్ట్రానికి ఇస్తానని తెలిపారు. -
అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయింది!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా తుడిచిపెట్టుకుపోయింది. సాయంత్రం నాలుగు గంటల వరకు అందించిన కౌంటింగ్ ఫలితాల ప్రకారం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 34 సీట్లు గెలుపొంది.. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చింది. మరో 23 స్థానాలు ఆ పార్టీ ఆధిక్యంలో ఉండటంతో భారీ మెజారిటీతో బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆ పార్టీ 10 స్థానాల్లో గెలుపొంది.. 4 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ పోటీచేసిన రెండుచోట్లా (హరిద్వార్ రూరల్, కిచ్చా) ఓడిపోవడం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. దీంతో రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదేనని, తన నాయకత్వ లోపం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రావత్ ప్రభుత్వం చాలావరకు వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ సర్కారుపై ప్రజావ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోవడంతో ఉత్తరాఖండ్‌లో బీజేపీ సునాయస విజయాన్ని సాధించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్!
ఉత్తరాఖండ్ ఎన్నికల సరళి బీజేపీకి స్వల్ప ఆధిక్యం! డెహ్రాడూన్ నుంచి కె. రామచంద్రమూర్తి: హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో విపక్ష బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ కొంత ఆధిక్యాన్ని సాధించే అవకాశముంది. 2012 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో అధికంగా నమోదైన 2 శాతం పోలింగ్ కమలదళానికి కలసిరావొచ్చు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 30కిపైగా సీట్లు సాధిస్తే అదంతా మోదీ చలవేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్‌లు చిన్న రాష్ట్రాలు కావడం, ఉత్తరప్రదేశ్ ఫలితం అనిశ్చితిలో ఉండడం, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ కూటమికి విజయావకాశాలు సన్నగిల్లడంతో ఉత్తరాఖండ్ ఒక్కటే బీజేపీకి ఆశాకిరణంగా మారింది. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రమన్న సంగతిని పట్టించుకోకుండా మోదీ ఏకంగా ఐదు సభల్లో ప్రచారం చేశారు. పార్టీ అధినేత అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేశారు. అయితే అంతర్గత కుమ్ములాటలు కాషాయదళాన్ని చీకాకు పెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గోడదూకి వచ్చిన 14 మందికి టికెట్లు ఇవ్వాల్సి రావడంతో చిచ్చు రాజుకుంది. రెబల్స్ పోటీకి దిగడం వీరి విజయానికి ప్రమాదంగా మారింది. బీజేపీ భవితవ్యాన్ని రెండు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశముందని ఓ స్థానిక టీవీ చానల్లో పనిచేసే సీనియర్ పాత్రికేయుడు అవికల్ థాపాలియాల్ చెప్పారు. మొదటి అంశం.. 12 మందికిపైగా రెబల్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేకపోయినా వారు బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశముంది. బీజేపీ ఈ తిరుగుబాటును ఎలా అధిగమించగలదు? రెండో అంశం.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం. క్లీన్ ఇమేజ్ ఉన్న బీసీ ఖండూరీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి పార్టీకి అనుకూలంగా మారేది. అయితే 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల గోదాలో దింపకూడదన్న పార్టీ నియమం ప్రకారం ఖండూరీపై పార్టీ నాయకత్వం మొగ్గుచూపలేదు. ఒంటరి యోధుడు రావత్.. కాంగ్రెస్ ప్రచారమంతా సీఎం హరీశ్ రావత్ చేతుల మీదుగానే సాగుతోంది. ప్రభుత్వ బాధ్యతలను, పార్టీ బాధ్యతలను ఆయనొక్కడే మోస్తూ బీజేపీకి దీటుగా ప్రచారం చేశారు. గత ఏడాది మార్చిలో ద్రవ్య బిల్లుకు సొంత పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే ఆయన రాష్ట్ర ప్రగతి కోసం కొంత శ్రమించారనే చెప్పాలి. అయితే మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవగలరో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. తమ పార్టీకి 45కు తగ్గకుండా సీట్లొస్తాయని రావత్ డెహ్రాడూన్‌లో ఈ పాత్రికేయుడితో ధీమాగా చెప్పారు. బీజేపీ తరఫున సీఎం రేసులో ఉన్న త్రివేంద్రసింగ్ రావత్ కూడా తమ పార్టీకి 35కుపైగా సీట్లు వస్తాయని అన్నారు. సీఎం సీటు చుట్టూ ఆ ఆరుగురు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ‘సీఎం’ రాజకీయాలు ఆరుగురి చుట్టే తిరుగుతున్నాయి. 2000లో రాష్ట్రం అవతరించినప్పుడు బయటి(హరియాణాలో జన్మించిన) వాడైన నిత్యానంద స్వామి.. వాజ్‌పేయి, అడ్వాణీల ఆశీర్వాదంతో సీఎం అయ్యారు. తర్వాత భగత్ సింగ్ కోషియారీ.. స్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరచి తాత్కాలిక సీఎం పగ్గాలు అందుకున్నారు. 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ సారథ్యంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ముఠాకక్షలు ఆయన్ను సీఎం పదవికి దూరం చేశాయి. ఎన్డీ తివారీ ఆ పీఠంపై అధిష్టించారు. రావత్ నుంచి తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటూనే హైకమాండ్ అండతో పూర్తికాలం(2002–2007) పదవిలో కొనసాగారు. 2007లో బీజేపీ విజయంతో సీఎం అయిన బీసీ ఖండూరీకీ స్వపక్షం నుంచి అసమ్మతి సెగ తగలింది. కోషియారి, రమేశ్ పోఖ్రియల్ నిశాంక్‌ల వ్యతిరేకత ఫలితంగా ఖండూరీ 2009లో గద్దె దిగారు. సీఎం పీఠమెక్కిన నిశాంక్ అవినీతి ఆరోపణల ఫలితంగా 2011లో పదవి కోల్పోగా, ఖండూరీ మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2012 ఎన్నికల్లో రావత్ కృషితో కాంగ్రెస్ గెలిచినా అధికారం మాత్రం విజయ్ బహుగుణకు దక్కింది. 2013 నాటి భారీ వరదల తర్వాత పరిస్థితిని చక్కదిద్దడంతో విఫలమయ్యాడంటూ అధిష్టానం ఆయన్ను తప్పించి రావత్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. 2016 మార్చిలో అసెంబ్లీలో ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరగ్గా బహుగుణ వర్గంలోని 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు. రావత్ బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పదవికి రెబల్స్ అనర్హులని సుప్రీం కోర్టు తేల్చడంతో మే నెలలో రావత్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు.