breaking news
UPA 2 last budget
-
బడ్జెట్-2014 ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం సోమవారం లోక్‌సభలో 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్య అంశాలు : * గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం *2013లో గ్లోబల్ జీడీపీ వృద్ధిరేటు: 3 శాతం *2013-14 ఆర్థిక లోటును 4.65 శాతానికి పరిమితి చేస్తాం *2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి: 263 మిలియన్ టన్నులు *కరెంట్ అకౌంట్ లోటు(సీఏడీ): 45 బిలియన్ డాలర్లు *ఆహార ద్రవ్యోల్బణమే పెద్ద సమస్య *ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్నాయి *ఇండియాకు రేటింగ్ డౌన్‌గ్రేడ్ భయం లేదు *ఈ ఏడాది 15 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు జమ అయ్యాయి *వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.7.35 లక్షల కోట్లు *గతంలో వ్యవసాయ రుణాల అంచనా: రూ.7 లక్షల కోట్లు *ఎగుమతుల లక్ష్యం: 326 బిలియన్ డాలర్లు (గతం కంటే 6.4 శాతం ఎక్కువ) *పెట్టుబడుల రేటు: 34.8 శాతం, సేవింగ్స్ రేటు: 30.1 శాతం *2013-14 జీడీపీ వృద్ధిరేటు అంచనా: 4.9 శాతం *జనవరి ఆఖరుకు కేబినెట్ ప్యానెల్ క్లియర్ చేసిన ప్రాజెక్టులు: 296 *మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పుంజుకోవడం లేదు *ఇన్ఫ్రా ప్రాజెక్టుల ఫండింగ్ నిబంధనల్ని సడలించాం *2013-14లో అదనంగా జమ కానున్న 29300 మెగావాట్ల విద్యుదుత్పత్తి *గడిచిన 9 క్వార్టర్లలో జీడీపీ వృద్ధిరేటు 7.9 నుంచి 4.4 శాతానికి పతనం *డిసెంబరు, మార్చి క్వార్టర్లలో 5.2 శాతం, 4.9 శాతం ఉంటుందని అంచనా *రూపాయి హెచ్చుతగ్గులను ప్రభుత్వం, ఆర్బీఐ, సెబీ నియంత్రించాయి *చక్కెరపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేశాం *నిర్మాణంలో 50 వేల మెగావాట్ల థర్మల్, జల విద్యుత్ ప్లాంట్లు *2013-14లో జాతీయ సోలార్ మిషన్ రెండో దశ మొదలైంది *విధానపరమైన నిర్ణయాల్లో నిష్క్రియాపరత్వం లేదు *వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లు ప్రారంభం *రూ.100 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఫండ్ *అభివృద్ధిలో యూపీఏకి సాటి వచ్చే ప్రభుత్వం లేదు *ఈశాన్య రాష్ట్రాల కోసం అదనంగా రూ.1200 కోట్ల కేటాయింపు *భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం *జాతీయ సోలార్ మిషన్ కింద 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులు *జనవరి నాటికి క్లియర్ చేసిన 296 ప్రాజెక్టుల విలువ: రూ.6.6 లక్షల కోట్లు *57 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశాం *బొగ్గు ఉత్పత్తి 554 మిలియన్ టన్నులకు పెరుగుతుంది *గడిచిన పదేళ్లలో సగటున బొగ్గు ఉత్పత్తి: 361 మిలియన్ టన్నులు *ప్రణాళిక వ్యయంలో మార్పు లేదు, రూ.5.55 లక్షల కోట్లే *2013-14లో ప్రణాళికేతర వ్యయం బడ్జెట్ అంచనాలను మించుతుంది *2014-15లో ప్రణాళికేతర వ్యయం : రూ.12.07 లక్షల కోట్లు *2014-15లో సబ్సిడీలు: రూ.2.65 లక్షల కోట్లు *2014-15లో ఫుడ్ సబ్సిడీ అంచనా: రూ.1.15 లక్షల కోట్లు *నిర్భయ ఫండ్‌కు అదనంగా రూ.1000 కోట్లు *2014-15లో ఇంధన సబ్సిడీ: రూ.65 వేల కోట్లు *ఈ ఏడాదికి చెందిన రూ.35 వేల కోట్ల ఇంధన సబ్సిడీని వచ్చే సంవత్సరానికి రోల్ ఓవర్ చేస్తాం *ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.33,725 కోట్లు * పీఎస్‌యూ బ్యాంకుల్లో క్యాపిటల్ పెట్టుబడి: రూ.11,200 కోట్లు *రక్షణ శాఖకు: రూ.2.24 లక్షల కోట్లు, గతంలో: రూ.2.04 లక్షల కోట్లు *2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం: రూ.8 లక్షల కోట్లు *మైనార్టీ వ్యవహారాల శాఖకు: రూ.3,711 కోట్లు *ట్యాక్స్ శ్లాబులో ఎలాంటి మార్పు లేదు *క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్లకు ఎక్సైజ్ సుంకం 2 శాతం తగ్గింపు *సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు *ఆటో రంగానికి ఊరట *ఎస్యూవీ వాహనా ఎక్సైజ్ సుంకం 30 నుంచి 24 శాతానికి తగ్గింపు *చిన్న కార్లపై ఎక్సైజ్ సుంకం 8 శాతానికి తగ్గింపు *పెద్ద, మధ్య తరహా కార్లపై ఎక్సైజ్ సుంకం 20 శాతానికి తగ్గింపు *2014-15లో రెవిన్యూ లోటు 3 శాతానికి తగ్గుతుంది *2014-15లో ద్రవ్యలోటు 4.1 శాతానికి తగ్గుతుంది *చిన్న కార్లపై 4 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు *రూ.5 లక్షల కారు రూ.20 వేల దాకా తగ్గే అవకాశం *రైస్ కంపెనీలకు సర్వీసు ట్యాక్స్ ఊరట *దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహిస్తాం *ఆహార సబ్సిడీ రూ.1.15 లక్షల కోట్లు *10 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ *రూ.2 లక్షల 24 వేల కోట్లకు చేరిన రక్షణ బడ్జెట్ *ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకరంగానే ఉంది *ఆహార ధాన్యాల ధరలు దిగివచ్చాయి *ఉత్పాదక రంగం ఇంకా పుంజుకోలేదు *దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకోసం ప్రత్యేక ఫండ్ *ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనాలను అధిగమించాయి *విదేశీ మారక నిల్వలు పెరిగాయి *ఆధార్ అమలుకు కట్టుబడి ఉన్నాం *సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆధార్ అవసరం *రక్షణ శాఖ కేటాయింపు రూ.2,24,000 కోట్లు 'రక్షణ ఉద్యోగులకు ఒక ర్యాంకు- ఒక పెన్షన్‌కు ఆమోదం '2014-15 ప్రణాళిక వ్యయం రూ.5,55,322 కోట్లు 'పాత విద్యరుణాల వడ్డీపై విద్యార్థులకు స్వల్ప ఊరట -
తగ్గనున్న కార్లు, బైకులు, మొబైల్ ఫోన్ల ధరలు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి చిదంబరం సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ నామ్‌కే వాస్తేగా ఉంది. ఒక్క ఆటో రంగం, ఎలక్ట్రానిక్ గూడ్స్ రంగాలకు కాస్త ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరత్రా ఎవరికీ సంతోషం కలిగించే వార్త బడ్జెట్లో లేదు. అదే సమయంలో బాధ పెట్టే నిర్ణయం కూడా లేకపోవడమే సంతోషాన్నిచ్చే అంశమే. కార్లు, బైకులు, స్కూటర్లు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించే నిర్ణయాలు చిదంబరం ప్రకటించారు. ఇతరత్రా నిర్ణయాలన్నీ కేటాయింపులే. కొన్ని కేటాయింపులు యథాతథంగా ఉండగా, మరికొన్ని రంగాలకు కేటాయింపులు పెంచారు. రక్షణ శాఖ బడ్జెట్‌ను 10 శాతం పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేకించి ఎలాంటి కేటాయింపు లేకపోవడం విశేషం. సీమాంధ్రను సంతృప్తి పరిచే నిర్ణయం ఏదైనా ఉంటుందేమోనన్న ఆలోచనను చిదంబరం అసలు పట్టించుకోలేదు. -
సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
-
సభ్యుల ఆందోళనల మధ్యే చిదంబరం బడ్జెట్
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్యే ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకు వెళ్లారు. సమైక్య నినాదాలతో హోరెత్తించటంతో స్పీకర్ మీరాకుమార్ జోక్యం చేసుకుని ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఆయన సభ్యుల గందరగోళం మధ్య బడ్జెట్‌ను ఎలా చదివేది అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్ నాథ్ జోక్యం చేసుకుని తమకు బాగానే వినబడుతోందని... బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరారు. దాంతో సభ్యుల ఆందోళన మధ్యే చిదంబరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. -
చిదంబరం రూటెటు!
ఎన్నికల ముందు వరాలు కురిపిస్తారా? కీలక ప్రకటనలేవీ ఉండకపోవచ్చంటున్న విశ్లేషకులు ద్రవ్యలోటు అదుపునకు కట్టుబడే అవకాశం... పరిశ్రమలు, సామాన్యులకు కొంత ఊరట కల్పించొచ్చని అంచనా ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల్లో తగ్గింపునకు చాన్స్ లోక్‌సభ ఎన్నికల ముంగిట.. యూపీఏ ప్రభుత్వం చివరి బడ్జెట్ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేడు 2014-15 ఏడాదికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు వరాలేమైనా కురిపిస్తారా? లేదంటే ద్రవ్యలోటు అదుపుతప్పకుండా చూస్తామన్న మాటకు కట్టుబడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలే కుంభకోణాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం ఇతరత్రా ఎడాపెడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యూపీఏ సర్కారు బడ్జెట్‌ను ఎన్నికల కోణంలోనే ఆవిష్కరించే అవకాశాలూ లేకపోలేదు. సంక్షేమ పథకాలకు భారీగానే నిధులను కుమ్మరించే ఆస్కారం ఉంది. అయితే, ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కీలక పాలసీ నిర్ణయాలకు ఆస్కారం తక్కువే. దీంతో నేరుగా ప్రజలకు లబ్ధిచేకూర్చే కొన్ని వరాలు, ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చేలా ప్రోత్సాహకాలు మాత్రమే ఉండొచ్చనే అంచనాలు ఎక్కువగా వినబడుతున్నాయి. జనరంజక బడ్జెట్లను ప్రవేశపెట్టడంలో దిట్టగా పేరొందిన చిదంబరం.. తన ఆఖరి బడ్జెట్ ఇన్నింగ్స్‌లోనూ మెప్పిస్తారా? లేదంటే ఉసూరుమనిపిస్తారా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్లో కీలకమైన పాలసీ నిర్ణయాలు, చర్యలను ఆశించనక్కర్లేదని ఎక్కువమంది విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. నేడు(సోమవారం) విత్తమంత్రి చిదంబరం... జూలై వరకూ ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి పార్లమెంట్ అనుమతి కోరుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత సంప్రదాయాల ప్రకారం చూస్తే.. మధ్యంతర బడ్జెట్లో ప్రత్యక్షపన్నుల్లో(ఆదాయపు పన్ను ఇతరత్రా) మార్పుచేర్పులు, విధానపరమైన ప్రకటనలేవీ ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రోత్సాహాలు మినహా ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికే చిదంబరం ప్రాధాన్యం ఇవ్వొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, సామాన్యులకు, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేలా కొన్ని ఊరట చర్యలు ఖాయమంటున్నారు. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులను సమీక్షించనున్నట్లు ఇప్పటికే చిదంబరం సంకేతాలివ్వడం తెలిసిందే. ప్రధానంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పారిశ్రామిక రంగాలు ఈ ప్రోత్సాహకాలను డిమాండ్ చేస్తుండటమే దీనికి కారణం. అయితే, ఇప్పుడు సుంకాలు, పన్నుల్లో చేసే మార్పులను... ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్/జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో మళ్లీ మార్చే అవకాశాలుం టాయి. దీంతో కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు మధ్యం తర బడ్జెట్లో చర్యలను అంతగా పట్టించుకోకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణలకు నో చాన్స్... కీలకమైన సంస్కరణల విషయంలో రాజకీయంగా ఏకాభిప్రాయం లేనందున వీటి జోలికి ప్రభుత్వం ఇక వెళ్లనట్టే. ప్రధానంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమాలో విదేశీ ప్రత్యక్ష పన్నుల(ఎఫ్‌డీఐ) పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రస్తుత యూపీఏ-2 సర్కారు ఇక పక్కనబెట్టేయనుంది. ‘ఆదాయపు పన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ చట్టాల్లో సవరణలను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశాల్లేవు. అయితే, చట్టసవరణలు అవసరం లేని ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. భవిష్యత్ దృక్కోణంతోనే ఎలాంటి చర్యలైనా చేపడతాం’ అని చిదంబరం ఇటీవలే వ్యాఖ్యానించారు. ఓటాన్ అకౌంట్ అంటే... సాధారణంగా లోక్‌సభ ఎన్నికల సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌నే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం జూన్ లేదా జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులు(వేతనాలు, నిర్వహణపరమైన ఖర్చులు, సంక్షేమ పథకాలకు వ్యయం ఇతరత్రా) యథాతథంగా కొనసాగాలంటే నిధుల కేటాయింపులకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. దీంతో వీటికి సంబంధించిన జమాఖర్చులతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంటే 3-4 నెలలకు మాత్రమే ఇది పరిమితమవుతుంది. తదుపరి వచ్చే కొత్త ప్రభుత్వం 2014-15 మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్థిస్థాయిలో బడ్జెట్‌ను తీసుకొస్తుంది. ‘సూపర్ రిచ్’ పన్ను కొనసాగిస్తారా? అత్యంత ధనిక(సూపర్ రిచ్) వర్గాలపై గత బడ్జెట్లో విధించిన పన్నును కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి చట్టసవరణ అవసరం కానుండటమే దీనికి కారణం. చిదంబరం మాటల ప్రకారం చట్టసవరణలేవీ లేకపోతే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. రూ. కోటికి మించి ఆదాయం ఆర్జించే సంపన్నులపై 10 శాతం సర్‌ఛార్జీ(సూపర్ రిచ్ ట్యాక్స్)ని విధిస్తూ 2013-14 బడ్జెట్లో చిదంబరం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.42,800 మందిని ఈ పన్ను చట్రంలోకి తీసుకొచ్చారు. సొంత డబ్బాకే పరిమితమా! ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ప్రస్తుత యూపీఏ-2 హయాంలో తాము సాధించిన ఘనతలు, చర్యలను ఊదరగొట్టేందుకు బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నప్పటికీ ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ల కట్టడికి తాము తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) మందగించడానికి కారణాలను, దీన్ని తిరిగి గాడిలోపెట్టేందుకు తాము చేపట్టిన చర్యలను కూడా ఆయన వివరించనున్నారు. జీడీపీ వృద్ధి రేటు గతేడాది దశాబ్దపు కనిష్టమైన 5 శాతానికి పడిపోగా... ఈ ఏడాది 4.9 శాతానికి పరిమితమవుతుందని ముందస్తు అంచనా. కాగా, ప్రస్తుత 2013-14లో ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేస్తామని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 2జీ స్పెక్ట్రం వేలం విజయంతో నిధులు భారీగానే(మార్చిలోగా కనీసం రూ.20 వేల కోట్లు ఖజానాకు వస్తాయని అంచనా) రానుండటంతో ద్రవ్యలోటు లక్ష్యానికి లోబడే ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక క్యాడ్ గత ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8%) ఎగబాకగా.. ఈ ఏడాది 2.5 శాతానికిలోపే పరిమితం కానుంది. బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల చూపు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. సోమవారం ప్రకటించనున్న ఓటాన్ అకౌంట్ స్వల్ప కాలానికి మార్కెట్ల ట్రెం డ్‌ను నిర్దేశిస్తుందని అంచనా వేశారు. దీంతోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కీలకంగా నిలవనున్నాయని చెప్పారు. ఇక అంతర్జాతీయ సంకేతాలకూ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు తెరలేవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్‌ను మార్కెట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. ద్రవ్యలోటు, తదితర పరిణామాలపై మార్కెట్లు తమదైన శైలిలో స్పందిస్తాయని విశ్లేషించారు. పరోక్ష పన్నులకు సంబంధించి ఏ రంగానికైనా ప్రోత్సాహకాలను కల్పిస్తే ఆ ప్రభావం మార్కెట్లపై ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్రవ్యలోటు ఎఫెక్ట్: ద్రవ్యలోటు అంశానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారని నిపుణులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2015)కి ప్రకటించే ద్రవ్యలోటు లక్ష్యం ఆధారంగా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలుంటాయని, దీంతో ఈ అంశం కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సమీప కాలంలో మార్కెట్లు పెరిగినప్పుడల్లా అమ్మకాలకు తెరలేచే అవకాశమున్నదని వివరించారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి 6,100 పాయింట్ల స్థాయి కీలకంకానుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అంచనా వేశారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్లు పుంజుకుంటాయని తెలిపారు.