breaking news
unsung heroes
-
వీర వనితలకు వందనం
75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల ‘అమృత మహోత్సవం’ అజ్ఞాత వీర వనితల చరిత్రను వెలికి తెస్తోంది. దేశం కోసం వీరోచిత పోరాటం చేసి జీవితాలు త్యాగం చేసిన, ప్రాణాలు అర్పించిన మహిళలు కొందరు వెలుగుకు నోచుకోలేదు. అలాంటి 20 మంది వీర వనితల సచిత్ర కథలను కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ‘అమర చిత్ర కథ’ సంస్థతో కలిసి ‘ఇండియాస్ విమెన్ అన్సంగ్ హీరోస్’ పేరుతో రెండు రోజుల క్రితం వెలువరించింది. మాతంగిని అజ్రా, గులాబ్ కౌర్, చాకలి ఐలమ్మ, రాణి అబ్బక్క తదితరులను ఇప్పుడు దేశంలోని బాలలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో దొరల మీద తిరగబడింది చాకలి ఐలమ్మ. తాను కౌలుకు తీసుకున్న 40 ఎకరాల పొలాన్ని తిరిగి దొరలు హస్తగతం చేసుకోవాలనుకుంటే తాను దున్నుకుంటున్న భూమి తనదే అని తిరగబడింది ఆమె. పట్వారీలు, దొరలు ఆమెపై ఎన్నో విధాలుగా దాష్టీకాలు చేశారు. దొంగ కేసులు పెట్టారు. ఇంటికి నిప్పంటించారు. అయినా చెక్కు చెదరక నిలిచి ప్రజలలో దొర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించింది. నిజాం కాలంలో తెలంగాణ రైతాంగ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఐలమ్మ కథ ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు. ఇక మీదట దేశమంతా చదువుకునేలా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘ఇండియాస్ విమెన్ అన్సంగ్ హీరోస్’ పుస్తకం ద్వారా బొమ్మలతో ఆబాల గోపాలం చదువుకునేలా తీసుకు వచ్చింది. ఐలమ్మే కాదు ఐలమ్మ వంటి మొత్తం 20 మంది వీర వనితలు దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం వివిధ సందర్భాల్లో చేసిన వీరోచిత పోరాటాన్ని భావితరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో బాలల కథలు విస్తృతంగా వెలువరించే ‘అమర చిత్ర కథ’ సంస్థతో కలిసి కేంద్రప్రభుత్వం ఈ పుస్తకం తెచ్చింది. వీరిలోని చాలామంది కథలు ఇంతకు మునుపు చరిత్ర గ్రంథాలకు కానీ పాఠ్యపుస్తకాలకు కాని ఎక్కనివి. ఉదాహరణకు 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారిపై గొప్పగా పోరాడిన తుళు ప్రాంతపు (తీర కర్ణాటక) రాణి అబ్బక్క కథ ఈ పుస్తకంలో ఉంది. గోవాను హస్తగతం చేసుకున్న పోర్చుగీసు వారు దక్షిణం వైపుగా తమ కన్ను వేసి మంగళూరువైపు ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. ఆ ప్రాంతానికి రాణిగా ఉన్న అబ్బక్క కేరళ రాజుల సహాయంతో సేనలను ఏర్పాటు చేసి పోర్చుగీసు వారిని సమర్థంగా ఎదుర్కొంది. కాని పోర్చుగీసు వారు బలపడి చివరకు అబ్బక్కను అరెస్టు చేశారు. అబ్బక్క ఎటువంటి క్షమాపణను కోరక రోషంతో జైలులోనే ఉంటూ అక్కడే మరణించింది. కర్నాటకలో అబ్బక్క గాథను నేటికీ యక్షగానంగా పాడతారు. ఆమె కథ ఈ పుస్తకంలో ఉంది. బెంగాల్లో బ్రిటిష్ కాలంలో మాతంగని హజ్రా ‘మహిళా గాంధీ’ అని ఖ్యాతి చెందింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆమె తములుక్ ప్రాంతంలో చురుకుగా పాల్గొంది. 12 ఏళ్లకే వితంతువు అయిన మాతంగని తెల్ల చీర ధరించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేది. క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలను ఏకం చేసి బ్రిటిష్ వారిని హడలు పుట్టించింది. 1942 సెప్టెంబర్ 29న ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఊరేగింపు తీస్తుండగా తములుక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా బ్రిటిష్ సైనికులు ఆమెను కాల్చి చంపారు. పిరికి పందలే ఈ పని చేయగలరు. కాని మాతంగని హజ్రా స్ఫూర్తి మరణం లేకుండా నేటికీ కొనసాగుతోంది. ఆమె కథ ఈ పుస్తకంలో ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన బిష్ని దేవి షా కథ కూడా ఈ పుస్తకంలో ఉంది. ఆమె కూడా చిన్న వయసులోనే వితంతువు అయ్యింది. అయితే తల్లిదండ్రులు కాని, అత్తమామలు కాని ఆమెను ఆదరించలేదు. ఆ సమయంలోనే గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమం లో పాల్గొంది ఆమె. ఉత్తరాఖండ్ నుంచి బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి జైలుకు పంపిన మొదటి మహిళగా ఆమె చరిత్రకెక్కింది. ‘జైలును శ్రీకృష్ణుడి జన్మస్థానంగా భావించి చింతించకుండా ఉండండి’ అని ఆమె పిలుపు ఇచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన వేలూ నాచియార్, సరోజిని నాయుడు కుమార్తె పద్మజా నాయుడు, ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నుంచి బ్రిటిష్ వారిపై తిరగబడిన దుర్గావతి దేవి, స్వాతంత్య్ర సమరయోధురాలిగా దేశంలో తొలి మహిళా సి.ఎంగా ఖ్యాతి చెందిన సుచేత క్రిపలానీ, పంజాబ్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా పోరు జరిపిన గులాబ్ కౌర్.... తదితర మొత్తం 20 మంది వీరవనితల కథలు ఈ పుస్తకంలో సచిత్రంగా ఉన్నాయి. అమరచిత్ర కథ యాప్‌లో ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు. దాచేస్తే దాగనిది చరిత్ర. స్వాతంత్య్ర పోరాటంలో ముందు వరస నాయకులతో పాటు దేశ వ్యాప్తంగా ఎందరో స్త్రీలు– అన్ని మతాల నుంచి గొప్ప పోరాటాలు చేశారు. వారి గురించి ఇప్పుడిప్పుడు ఇలా అన్వేషణ సాగుతోంది. తెలుస్తున్నది కొద్దిమంది. తెలియాల్సింది ఎంతమందో. అలాంటి అందరి కథలు వెలికి రావాలి. -
పేపర్ బాయ్స్‌కి ఆనంద్ మహీంద్రా సెల్యూట్
ముంబై : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోడ్డు, రైలు సేవలతో పాటు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ముంబైలో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పేపర్ బాయ్స్ తెరవెనుక నిజమైన హీరోలుగా నిలిచారని ఆయన అన్నారు. వారికి సెల్యూట్ చేస్తూ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేశారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రైలు పట్టాలపైకి పూర్తిగా నీరు చేరింది. కానీ న్యూస్ పేపర్ మాత్రం రోజు వచ్చే సమయానికే మా ఇంటికి వచ్చింది. అది కూడా పొడిగా(ఏ మాత్రం తడవకుండా). ఇందుకు కారణం తెరవెనుక ఉన్న నిజమైన హీరోలు. కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. మనల్ని సాధారణ రోజులుగా అనుభూతికి గురిచేసిన వారికి సెల్యూట్ చేస్తున్నట్టు’ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అలాగే తన ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్‌ను పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. న్యూస్ పేపర్ బాయ్స్, మిల్క్ మ్యాన్, కూరగాయల అమ్మేవారు నిజమైన హీరోలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. Mumbai Airport runway shut, schools closed, train stations flooded, but the newspapers arrived in my house on time & dry! I have to salute those quiet, unsung heroes who brave torrential rain just so we can experience a ‘normal day.’ 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/iUhKMRSRFi — anand mahindra (@anandmahindra) July 2, 2019 -
రాష్ట్రపతి ప్రణబ్‌కు రానా లేఖ
ముంబై: దేశం కోసం ప్రాణత్యాగం చేసి మరుగున పడి పోయిన సైనికుల గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సినీ నటుడు దగ్గుబాటి రానా తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘ది ఘాజీ అటాక్’ సినిమాలో రానా లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో నటించారు. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధం సందర్భంగా భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ లో కమాండర్ అర్జున్ వర్మ కీలకపాత్ర పోషించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా అర్జున్ వర్మ 18 రోజులపాటు సముద్రగర్భంలోనే గడిపారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా తాము అనేక మంది సైనికాధికారులతో మాట్లాడామని.. ఈ సందర్భంగా వారు చెప్పిన వీరోచిత గాధలు దేశ పౌరులందరికీ తెలియాల్సిన ప్రాముఖ్యత కలిగినవని రానా చెప్పారు. సరిహద్దుల్లో ఉంటూ దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న వీర సైనికుల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో రాష్ట్రపతి ప్రణబ్‌ను కోరానని ముంబైలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్- పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన సబ్మెరీన్ పీఎన్ఎస్ ఘాజీని భారత నేవీ ఎలా ముంచేసిందనే ఇతి వృత్తంగా ‘ఘాజీ’ సినిమా తీశారు. ఈ సినిమాలో అతుల్ కుల్కర్ణి, కేకే మీనన్, తాప్సీ పొన్ను, దివంగత ఓంపురి తదితరులు నటించారు.