breaking news
Uddanam farmers
-
ఊపిరి పీల్చుకుంటున్న ఉద్దానం
-
ఉద్దానం పెద్ద కొడుకు
సాక్షి, ఇచ్ఛాపురం: ఒకటా రెండా వందల ఏళ్లుగా ఉద్దానం కడుపు నింపుతోంది. రాకాసి గాలులకు ఎన్నిసార్లు తలలు తెగి పడినా మళ్లీ తన వాళ్ల కోసం నిటారుగా నిలబడింది. కమ్మ నుంచి కాయ వరకు, వేరు నుంచి పువ్వు వరకు అన్నింటినీ రైతు కోసమే ధారబోసింది. రహస్యం తెలుసుకుని మసలుకున్న వాడి పాలిట కల్ప తరువుగా నిలిచింది. అందుకే దేవుడంతటి వాడే దాసోహమైపోయాడు. మానవమాత్రుడేపాటి. కొబ్బరి అందరికీ ఓ పంట. కానీ ఉద్దానానికి మాత్రం ఆత్మబంధువు. ఇక్కడి వారికి అది కేవలం చెట్టు కాదు.. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు. ఉద్దానం పల్లెలు పచ్చగా ఉన్నాయంటే అది కొబ్బరి చలవే. రేపు (సెప్టెంబర్ 2) అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం. ఈ సందర్భంగా నారికేళం చేసే మేలు గురించి తెలుసుకుందాం. దాని మహత్తును గమనించి తరిద్దాం. పల్లె పచ్చగా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా ఉద్దానం పేరు పొందింది. విస్తారంగా పరచుకున్న కొబ్బరి తోటలు ఈ ప్రాంతాన్ని పచ్చగా చూస్తున్నాయి. జిల్లాలో కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాలతో పాటు వజ్రపుకొత్తూరు, మందస, పలాస, రణస్థలం, లావేరు మండలాల్లో 17,540 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. జిల్లాలో వేల మంది రైతులు, వ్యాపారులు, కార్మికులకు ప్రత్యక్షంగా, అంతకు రెండు రెట్లు మందికి పరోక్షంగా బతుకునిస్తోంది. కొబ్బరి వల్ల రైతులు ఉత్పత్తుల తయారీ, అంతర పంటల పెంపకానికి కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), క్వాయర్ అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ పలు రాయితీలు అందిస్తున్నాయి. 106 రకాలు చేయవచ్చు.. కొబ్బరి నుంచి 106 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రతినిధులు చెబుతున్నారు. రైతులు కనీసం 16 రకాల ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవచ్చంటున్నారు. జిల్లాలో సుమారు 50 వేల మంది రైతులు, 50 వేల మంది వ్యాపారులు, కార్మికులు, కూలీలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. కొబ్బరిపై ఇంత మంది జీవనోపాధి పొందుతున్న నేపథ్యంలో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా జిల్లాలో కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటుకు సుమారు రూ.350 కోట్లు ప్రతిపాదించారు. అందులో కేవలం కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం కొబ్బరిని పండించే ఏడు మండలాల్లో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లతో ప్రాజెక్ట్ తయారు చేశారు. త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఎండు కొబ్బరి: వంటలకు ఎక్కువగా వినియోగిస్తారు. ముఖ్యంగా కేకులు, కొబ్బరి నూనె తయారీతో పాటు బయోడీజిల్ తయారీకి సైతం దీన్ని వాడుతుంటారు. కొబ్బరి చిప్స్: అందరూ ఇష్టపడే పొటాటో చిప్స్లానే కొబ్బరి నుంచి చిప్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. ఇదింకా కాస్త ఫేమస్ కావాల్సి ఉంది. కొబ్బరి పాలు: వంటలతో పాటు టీ, కాఫీలను కూడా తయారు చేయవచ్చు. కొబ్బరి పాలు శీతలీకరణలో మిల్లింగ్ చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తయారు చేస్తారు. కొబ్బరి క్రీమ్: దీన్ని కేకులు, వివిధ రకాల వంట తయారీకి వినియోగిస్తారు. కొబ్బరి తురుము: పంటలతో పాటు కొబ్బరి రకాల పచ్చళ్లలో దీన్ని అధికంగా వాడుతుంటారు. బేకరీల్లో బ్రెడ్లు, బన్స్‌తో తయారు చేసే రకరకాల ఆహారాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కేరళలో కొత్తగా కోకోనట్ కురికురీ స్వీట్, హాట్ రకాల్లో తయారీకి కొబ్బరి తరుములు అధికంగా వినియోగిస్తున్నారు. కోకో పికిల్: కొబ్బరితో తయారయ్యే పచ్చళ్లు, ఇవి కాకుండా కోకోనట్ క్రిస్పీ, కొబ్బరి డెసికేటెడ్ పౌడర్, కోకోనట్ క్యాండీ, కోకో మిల్క్ పౌడర్, కోకో సిరప్‌లను తయారు చేసి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంది. కొబ్బరి డొక్క: కొబ్బరిలో అత్యంత విలువైనది దీని నుంచి వచ్చే పీచు. పట్టుకు జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి డొక్కల నుంచి పీచు తయారు చేసే పరిశ్రమలు ఉన్నప్పటికీ పీచు నుంచి తాళ్లు, మ్యా ట్లు, ఫైబర్ మ్యాట్లు, కాయర్ జియోటెక్స్, గార్డెన్ ఆర్టికల్స్ (కుండీలు) తయారు చేసే పరిశ్రమలు లేకపోవడం మనకు కాస్త వెలితి. గతంలో కవిటి మండలం బొరివంక, మాణిక్యపురం, రాజపురంలో కంచిలి మండలం తలతంపర, సోంపేట మండలం బారువ గ్రామాల్లో క్వాయర్ ఉత్పత్తులు చేసే పరిశ్రమలు ఉండేవి. అవి ఇప్పుడు మూతపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. కంచిలి మండలం కొక్కిలి పుట్టుగ, మజ్జిపుట్టుగ, నాథపుట్టుగ, చంద్రుపుట్టుగ తదితర గ్రామాల్లో బెంతు ఒరియా తెగకు చెందిన కూలీలు చిన్పపాటి చక్రాలతో కొబ్బరి తాళ్లు అల్లుతుంటారు. ప్రస్తుతం కొబ్బరి పొట్టుకు సైతం మంచి డిమాండ్ పెరిగింది. నీటి నిల్వను ఎక్కువ కాలం ఉంచేందుకు వ్యవసాయంలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. కొబ్బరి నూనె: ఎండు కొబ్బరిని తరుమును వినియోగించి నూనె తయారు చేస్తారు. ఉద్దానం ప్రాంతాలలో ఎండు కొబ్బరి ముక్కల నుంచి నూనె తయారు చేసే మిల్లులు చాలా ఉన్నాయి. దీనిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అత్యంత విశిష్టమైంది. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎయిడ్స్ వంటి వ్యాధి గ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. అన్నీ విలువైనవే.. కొబ్బరి కాయ మాత్రమే కాదు చెట్టులో అన్ని భాగాలు విలువైనవే. కొబ్బరిలో బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వందశాతం ఆరోగ్యానికి ఉపయోగకరం. ముఖ్యంగా గుండె పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది. ఇక కొబ్బరి కమ్మ పశువుల ఆహారంగానూ, ఇళ్ల పైకప్పుగానూ, శుభకార్యాల సందర్భంలో పచ్చని పందిరిగా ఉపయోగపడుతుంది. ఇక కొబ్బరి ఈనెలలను పరిశీలిస్తే దీన్ని ఒక కుటీర పరిశ్రమగా చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి పంట పండిస్తున్న పల్లెల్లో ఈనెపుల్లల అమ్మకం ఒక ప్రధాన పరిశ్రమ. ఎండు,పచ్చి రకాలుగా వీటిని విక్రయిస్తారు. ఎండు ఈనెలు కమ్మల నుంచి తొలగించి కొంతకాలం ఎండలో ఆరగట్టి వీటిని కట్టలుగా కట్టి ప్రధానంగా ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఎండు ఈనెలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అదేవిధంగా పచ్చి ఈనెలు ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని ప్రధానంగా పైకప్పులకు ఊటబావుల్లో నీటి నిల్వ కోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీమ్ తయారీలో వినియోగిస్తున్నారు. చెట్టులోని భాగం బల్లలుగా ఇంటి కలపగా నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా కొబ్బరిలో ప్రతి భాగమూ ఉపయోగమే. ప్రభుత్వ సాయం ఇలా.. ఉద్దానం కొబ్బరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి. కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నడిచే ఉద్యానవన శాఖల సంయుక్త సహకారంతో ఎన్నో పథకాలు కొబ్బరిరైతులకు అందిస్తున్నాయి. కొబ్బరి రైతులకు వడ్డీ లేని రుణం లక్ష వరకు కాగా పంట రుణంగా(క్రాప్ లోన్) గరిష్టంగా రూ.1.60లక్ష స్వల్పవడ్డీకే అందిస్తున్నారు. దీంతో పాటు కిసాన్ గోల్డ్ కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద పెద్ద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాల పేరిట భారీ మొత్తంలో రుణాలు కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఉచిత పంటల బీమా పథకం అమలుచేశారు. దీనికింద కేంద్రప్రభుత్వం 50శాతం ప్రీమియం చెల్లిస్తే, రాష్ట్రప్రభుత్వం మిగిలిన 50 శాతం ప్రీమి యం చెల్లించేవిధంగా దీన్ని ఉచిత పంటల బీమా పథకంగా కొబ్బరికి అనువర్తింపజేస్తున్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ సౌ కర్యం 90 శాతం రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం సింహభాగం నిధులు మంజూరు చేస్తోంది. దీని కోసం రైతులకు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అందిస్తోంది. కొబ్బరి పునరుద్ధరణ పథకం, విస్తీర్ణ అభివృద్ధి పథకం వంటివి మేలు చేస్తున్నాయి. కొబ్బరి కల్లు (కల్పరసం): కొబ్బరి దశదిశ మార్చేది ఇదే. అతి విలువైన ఉత్పత్తి కొబ్బరి కల్లు (కల్పరసం)ను పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని రకాల పద్ధతులు వినియోగించి ఉత్పత్తి చేస్తారు. ఇలా చేయడం వల్ల కల్లు పులిసిపోకుండా (ఫెర్మంటేషన్ అవకుండా) ఉంటుంది. ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయం. కొబ్బరి పరిశ్రమలు నెలకొల్పుతాం కేవలం కొబ్బరిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవించే కుటుంబాలు జిల్లాలో వేలాదిగా ఉన్నా యి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ముందుగా నష్టపోయేది కొబ్బరి రైతులే. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుల కృషితో ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి క్షేత్రాన్ని నెలకొల్పేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. విలువ ఆధారిత ఉత్పత్తులపై డీసీఎంఎస్ దృష్టి సారించింది. కేంద్ర ఆత్మ నిర్భర్ స్కీమ్ ద్వారా కొబ్బరి రైతుల కలలను సాకారం కానున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పరిశ్రమను నెలకొల్పుతాం. – పిరియా సాయిరాజు, జిల్లా డీసీఎంఎస్ చైర్మన్, శ్రీకాకుళం -
‘ఎంత సాయం చేయడానికైనా సిద్ధం’
సాక్షి, శ్రీకాకుళం: తిత్లీ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన ఉద్దానం ప్రాంతం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం జరిగిన ఉద్దానం పునర్నిర్మాణం సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. తిత్లీ తుపానుతో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని వెల్లడించారు. -
అప్పుల సెగ.. దళారుల దగా
కవిటి : కోనసీమ తర్వాత అత్యధిక విస్తీర్ణంలో కొబ్బరి సాగు చేస్తున్న కవిటి ఉద్దానం రైతులు మూడు తుపాన్లు.. ఆరు గండాలతో కుదేలవుతున్నారు. దళారుల దగా కారణంగా పంటకు తగిన ఆదాయం లభించక అప్పులభారంతో కుంగిపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు వర్తించదని స్పష్టం కావడంతో బ్యాంకుల అప్పులు, వాటిపై వడ్డీలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అప్పు తీర్చమని బ్యాంకర్ల నుంచి తాఖీదులు అందుతుండటంతో లక్ష రుణానికి రూ. 10 వేలకు పైగా వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. రుణం తీరాలన్నా, రెన్యూవల్ చేయించుకోవాలన్నాకొబ్బరికాయల దిగుబడిపై వచ్చే ఆదాయమే ఆధారం. అయితే ధర గిట్టుబాటు కాని పరిస్థితుల్లో అనివార్యంగా ప్రైవేట్ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుందని దిగులు చెందుతున్నారు. 1998లో వచ్చిన సూపర్ సైక్లోన్, 2013లో వచ్చిన పై-లీన్, 2014లో వచ్చిన హూద్‌హుద్ తుపాన్లన్నీ కొబ్బరి రైతుల వెన్ను విరిచాయి. కష్టకాలంలో ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వాలు చేతులెత్తేయడం, ఇదే సమయంలో దిగుబడులు తగ్గిపోవడం, ధర రాకపోవడం రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. దిగుబడి లేదు.. ధరా రాదు వరుస తుపాన్లు, ఇతర వైపరీత్యాలతో కొబ్బరి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. అందిన కొద్దిపాటి పంటకైనా గిట్టుబాటు ధర వస్తుందనుకుంటే.. దళారులు, వ్యాపారులు కలిసి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. ప్రస్తుతం ఉద్దానంలో ఎకరాకు 4 నుంచి 5 పణాలు(400 కొబ్బరి కాయలు) చొప్పున సగటు దిగుబడి వస్తోంది. దీన్ని ప్రస్తుతం ఒడిశా వ్యాపారులు రు.8000 నుంచి రూ.8500 వరకు కొనుగోలు చేస్తున్నారు. డ్రిప్ పథకం ఉన్న తోటల్లో పండిన కొబ్బరికి మరో రు.600 వరకు అదనంగా చెల్లిస్తున్నారు. అయితే వీరికి ఒక పణం(80) కాయలకు ముదరాగా 5 కాయలు ఇవ్వాల్సి వస్తోంది. పణం ధర రూ.640 ఉంటే అందులో రు.40 ముదరా కింద వ్యాపారికి ఇచ్చేయాల్సి వస్తోంది. అ లెక్కన ఒక కాయ ధర ఎనిమిది రూపాయలు పడుతోంది. అదే కాయను బయట మార్కెట్లలోనూ, దేవాలయాల వద్ద రు.15 నుంచి రూ.18కి అమ్ముతున్నారు. ఇందులో దాదాపు సగమే రైతుకు అందుతోంది. మిగిలిన సగం వ్యాపారులు, దళారుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇదే కాకుండా 2వేల కాయలు రైతు నుంచి కొనాలంటే లారీ కాయలు(సైడ్) అనే పేరుతో వ్యాపారులు మరో 20 కాయలు వెనుకేసుకుంటారు. లారీ కాయలు ఏమిటి అంటే.. లోడ్‌తో లారీ బయలుదేరిన చోటు నుంచి గమ్యస్థానం చేరే వరకు ప్రతి సెంటర్లో దేవుడి పేరిట లారీ ఎదురుగా కొబ్బరికాయలు కొడతామని చెబుతారు. వాస్తవానికి లారీ లోడ్ అయిన తర్వాత బయలుదేరే సమయంలో మాత్రమే ఒక కాయ కొడతారు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో నీరందించే తోటల తోపాటు సాధారణ తోటల్లోని కాయ సైజు భారీగా, నాణ్యంగానే ఉంటున్నా వ్యాపారుల దందాతో రైతులు నష్టపోతున్నారు. ఈ రకంగా 50 పణాల దిగుబడి సాధించిన రైతు 200 కొబ్బరికాయలు..అంటే రూ.1600 ముదరాగా వదులుకోవాల్సి వస్తోంది. ఉద్దానం నుంచి రోజుకు ఐదారు లారీల కొబ్బరికాయలు ఒడిశాకు రవాణా అవుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ముదరా పేరుతోనే వ్యాపారులు రోజుకు రు.16వేల వరకు అప్పనంగా ఆర్జిస్తున్నారు. కాగా కొందరు దళారులు తాము ఇంకా తక్కువ ధరకు కాయలు ఇప్పిస్తామంటూ ఒడిశా వ్యాపారులను ఆకట్టుకొని రైతులకు తక్కువ ధర ముట్టజెబుతున్నారు. దీనిపై ప్రభుత్వపరంగా ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు దగాపడుతున్నారు.