breaking news
tsunami zone
-
సునామీలు రావడానికి గల 4 కారణాలు!
వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలుంటాయి. భూకంపాలు: ఎక్కుసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాల్లో కదలికలు సంభవిస్తుంటాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. మంచుపర్వతాలు విరగడం సముద్రం మధ్యలో ఉండే కొండచరియలు విరిగిపడటం, భారీ మంచుపర్వతాలు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. 1980ల్లో ఫ్రాన్స్‌లో సముద్ర తీరంలో రన్‌వే నిర్మిస్తుండగా, సముద్రంలో మంచుపర్వతం విరిగింది. దీంతో థేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. అగ్నిపర్వతాలు పేలడం సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. గ్రహశకలాలు పడటం అప్పుడప్పుడు భూమిపైకి గ్రహశకలాలు, ఉల్కలు రావడం తెలిసిందే. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలాకాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు, ఉల్కలు సముద్రంలో కూలినా సునామీ అలలు వస్తాయి. ఇలా జరగడం అత్యంత అరుదు. సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది? సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతీసారీ ఇలాగే జరగదు. ప్రతీ అలకూ రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో, సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశలవారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగసిపడుతుంది. తీరానికి వచ్చే అల ముందుగా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేది అయితే సముద్రం వెనక్కు వెళ్లదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీదపడుతుంది. అదే తీరానికి వచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్లడాన్ని గమనిస్తే అక్కడే చూస్తూ నిల్చోకుండా వెంటనే పరుగెత్తుతూ వెనక్కు వచ్చేయాలి. అక్కడే ఎందుకు ? జకార్తా: ఇండోనేసియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కవగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఇండోనేసియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేసియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. యురేసియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో–ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేసియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల ‘డేంజర్ జోన్’లో ఉంటున్నారు. 10 అత్యంత భీకర సునామీలు సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేసియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టం ఆధారంగా చరిత్రలో నమోదైన 10 అత్యంత భీకర సునామీల వివరాలిలా ఉన్నాయి. 1. సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. 2.ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పడుతుందని అప్పట్లో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. 3.లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 4. క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 5.ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 6.నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 7.సాంక్రికు, జపాన్, 1896 జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 8.ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 9.రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10. ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. సునామీ నుంచి ఇలా తప్పించుకోవచ్చు! సునామీల సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సెంట్రల్ అమెరికా సెస్మలాజికల్ సెంటర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సునామీ వచ్చేముందు ఏర్పడే పరిస్థితులపై తీరప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండాలని వ్యాఖ్యానించారు. సాధారణంగా తీరప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడు భారీ రాకాసి అలలతో సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు. అలాగే సునామీ వచ్చేముందు సముద్రంలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. ఒకవేళ మీరు తీరప్రాంతంలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. è భూకంపం రాగానే కంగారుపడకుండా సురక్షితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ► అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎత్తైన ప్రాంతం, లేదా ఎత్తైన భవనం పైకి చేరుకోండి. ఈ ప్రాంతం లేదా భవనం సముద్రమట్టం కంటే 30 మీటర్ల ఎత్తులో ఉండేలా చూసుకోండి. ► సముద్రంలో నీరు వెనక్కు వెళుతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా వచ్చేయండి. ► ఒకవేళ తీరప్రాంతాల్లో ఎత్తైన భవనాలు లేకుంటే అటవీ ప్రాంతంలోకి వెళ్లాలి. ► సునామీల ప్రభావంతో నదులు సైతం కొన్ని కిలోమీటర్ల మేర ► వెనక్కు చొచ్చుకొస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాగులు, వంకలకు దూరంగా ఉండండి. ► అధికారులు చెప్పేవరకూ తిరిగి ప్రభావిత ప్రాంతాలకు రాకండి. ఇది క్రకటోవా పిల్లనే... జకర్తా: ఇండోనేసియన్ భాషలో ఆనక్ అంటే బిడ్డ, శిశువు అని అర్థం. క్రకటోవా అనే మరో అగ్నిపర్వతం నుండి ఏర్పడింది కాబట్టి దీనిని ఆనక్ క్రకటోవా అని పిలుస్తారు. సుండా జలసంధిలోనే క్రకటోవా అగ్నిపర్వతం ఉండేది. 1883లో అది పేలి ఏకంగా 36 వేల మంది చనిపోయారు. ఆ అగ్నిపర్వతం అవశేషాల నుంచే మళ్లీ 1928లో ఆనక్ క్రకటోవా ఏర్పడింది. అందుకే దీనిని పిల్ల క్రకటోవా అంటారు. ఇక్కడ మనుషులెవరూ నివసించకపోయినప్పటికీ ఇదో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ‘ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతంలో మార్పుల కారణంగానే సముద్రంలో భూ పొరలు స్థానభ్రంశం చెందాయి. ఇది సరిగ్గా పున్నమి నాడు జరగడంతో ఈ భారీ విధ్వంసం సంభవించింది’ అని ఇండోనేసియా జాతీయ విపత్తు స్పందన దళం అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచే అగ్నిపర్వతం అప్పుడుప్పుడు లావాను, బూడిదను వెదజల్లుతోంది. భారీ మొత్తంలో బూడిద ఆకాశంలోకి వెళ్లడం కనిపిస్తుండేది. అక్టోబర్ నెలలో లావా ఎగిరొచ్చి ఓ టూరిస్ట్ బోట్‌కు అతి సమీపంలో పడింది. అగ్నిపర్వతం తీరానికి సమీపంలోనే ఉండటంతో ఇప్పుడు చాలా తొందరగా అలలు వచ్చి తీరప్రాంతాలపై విరుచుకుపడ్డాయని ‘ది ఓపెన్ యూ నివర్సిటీ’ ప్రొఫెసర్ డేవిడ్ రోథరీ తెలిపారు. తీరానికి దగ్గర్లో ఉన్నందునే సునామీ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే పరికరాలు సముద్రంలో ఉంటాయనీ, ఇలాంటి పరికరం అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నప్పటికీ.. అగ్నిపర్వతం కూడా తీరానికి దగ్గర్లోనే ఉండటంతో పరికరం నుంచి వచ్చిన సంకేతాలను అందుకునేలోపే భారీ అలలు ఎగసిపడ్డాయని డేవిడ్ వివరించారు. రెండు మూడేళ్లకోసారి ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ చిన్నగా పేలుతూనే ఉందని ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఇప్పుడు కూడా అగ్నిపర్వతం పేలుడు తీవ్రత చాలా తక్కువగానే ఉంటుందనీ, అయితే అప్పుడే భూ ఫలకలు కదలడం వంటి చర్యల కారణంగా సునామీ సంభవించి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఇండోనేసియాలో దాదాపు 130 వరకు క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే దీన్ని పసిఫిక్‌లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. -
చైనా మెగా ప్రాజెక్టుకు పాక్‌లోనే పెనుముప్పు!
హంగ్ కాంగ్ : బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనాలోని జిన్జియాంగ్ నుంచి పాక్‌లోని గ్వదార్ పోర్టు గుండా ఈ ప్రాజెక్టు మార్గం వెళ్తోంది. అయితే గ్వదార్ వద్ద దీనికి పెను ముప్పు పొంచి ఉన్నట్లు వారు చెబుతున్నారు. ‘చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హంగ్ కాంగ్’కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యాంగ్ హంగ్ఫెంగ్ ఈ తీర ప్రాంతంపై మూడు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్వదార్ చాలా ప్రమాదకరమైన ప్రాంతం అని ఆయన చెబుతున్నారు. మక్రాన్ ట్రెంచ్‌కు సమీపంలో ఉన్న గ్వదార్ పోర్టు గతంలో పెను భూకంపంతో సర్వనాశనం అయ్యింది. 1945లో రిక్చర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో పెను భూకంపం ఇక్కడ సంభవించింది. సునామీ దాటికి ఇరాన్, పాక్, ఒమన్, ఇండియా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ ప్రకృతి విలయంలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం గుండానే చైనా మెగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 40 ఏళ్లపాటు చైనా ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంది. అంతేకాదు ఇక్కడ ఓ నేవల్ బేస్‌ను నెలకొల్పాలన్న ఆలోచనలో డ్రాగన్ కంట్రీ ఉండగా.. భారత్ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు రవాణా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నది చైనా లక్ష్యం. కానీ, ఇప్పుడు భూకంపం, సునామీ ప్రభావితమైన ఈ ప్రాంతం వల్ల ప్రాజెక్టుపైనే కాకుండా.. పాక్-చైనాలోని తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ అంశాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజింగ్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
'దెయ్యాలు మా కార్లలో రోజూ ఎక్కుతాయి'!
టోక్యో: ఇషినోమాకి.. ఇది జపాన్ లో 2011లో 30 అడుగుల ఎత్తు సునామీ అలల తాకిడికి నిండా మునిగిపోయిన నగరం. వేల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలుకోల్పోయారు. సునామి సమయంలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లు కనిపించిన ఈ నగరం మళ్లీ ఊపిరి పోసుకొని మనుగడ ప్రారంభించింది. అయితే, ఆ నగరంలోని ట్యాక్సీ డ్రైవర్లను ఇప్పుడు ఒక సమస్య పట్టి పీడిస్తోంది. అదే దెయ్యాలు. అవును.. తాము అప్పుడప్పుడు మనుషులనుకొని దెయ్యాలను ఎక్కించుకొని తిరుగుతున్నామని ఇషినోమాకి పట్టణంలో ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు ఇవే మాటలు చెప్తున్నారు. దీంతో అసలు ఆ విషయం ఏమిటా అని సెండాయ్ లోని తోహోకు గాకిన్ అనే విశ్వవిద్యాలయం, కెనడాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం అధ్యయనకారులు ఆ ప్రాంతంలో పరిశోధనకు వెళ్లి ఇంటర్వ్యూలు చేశారు. అనేకమంది క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించారు. ఆ సమయంలో వారు చెప్పిన పలు సమాధానాలు అధ్యయనకారులను ఆశ్చర్య పరిచాయి. తాము కార్లలో వెళుతున్నప్పుడు నిజమైన వ్యక్తుల్లాగే కనిపించిన కొందరు ఆపి ఎక్కుతారని, ప్రయాణం మధ్యలో వెనుక సీట్లోకి చూస్తే కనిపించకుండా పోతారని, ఇలా జరగడం తమకు తరుచుగా ఎదురవుతున్న అనుభవాలు అని చెప్పారు. ఒక డ్రైవర్ అయితే 'నేనొకసారి ఒక మహిళను ఇషినోమాకి స్టేషన్లో ఎక్కించుకున్నాను. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా మినమిహామాకు వెళ్లాలని చెప్పింది. ఆ ప్రాంతం సునామి దెబ్బకు తుడిచిపెట్టుకు పోయింది కదా అని నేను ప్రశ్నించాను. ఆ మాట విని ఆమె అయితే, నేను చనిపోయానా? అని ప్రశ్నించింది. ఆ మాట విని భయంతో వెనక్కి తిరిగి చూశాను. ఆమె ఆ సీట్లో లేదు' అని చెప్పాడు. ఇక మరో డ్రైవర్.. 'నేను కారు ఎక్కిన మనిషి చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లాను. అతడు చెప్పిన చోటు రాగానే వెనక్కి తిరిగి చూశాను. కానీ, అతడు కనిపించలేదు' అని చెప్పాడు. ఇలా అంతా ఇలాంటి అనుభవాలే చెప్పుకొచ్చారు. అయితే, ఈ అధ్యయనం చేసిన వారు వారు చెప్తున్న దెయ్యాల అంశాలపై స్పందిస్తూ 2011, మార్చి 11న భూకంపం సంభవించి ఇషినోమాకిపై 30 అడుగుల ఎత్తు అలలతో సునామీ విరుచుపడిందని, ఆ దెబ్బతో దాదాపు 3,100మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించగా మరో 2,770 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ దృశ్యాలను స్వయంగా చూసిన వాళ్లలో ప్రస్తుతం డ్రైవర్లుగా పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు. ఆ సునామి వల్ల వారిలో ఏర్పడిన భయం ఓ రకమైన ఒత్తిడిగా మారి అవతలి వ్యక్తికి కనిపించనివి తమకే కనిపిస్తున్నట్లుగా భ్రమపడే ఓ వింత సమస్య నుంచి బాధపడుతున్నారని స్పష్టం చేశారు.