'2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్దే గెలుపు'
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీదే గెలుపునని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాట చెబుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా సమీక్షలనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా 20 జిల్లాల ఏర్పాటుకు ఆయన సూత్రపాయ అంగీకారం తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాలు కానున్నాయి.
ప్రతి జిల్లాలో సగటున మూడు లక్షల కుటుంబాలు ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరిగిందని సీఎం చెప్పారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల జిల్లాల ఏర్పాటుపై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. దసరా పండుగ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉంటే ఆ మూడు ప్రాంతాల ప్రజలు బాధల్లో ఉండటం మంచిదికాదన్నారు. ఈ మూడు జిల్లాలను ఏయే మండలాలతో ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వివిధ జిల్లాలకు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్నపేరును పరిశీలించడంతో పాటు వికారాబాద్ జిల్లాను ఆ పేరునే కొనసాగిస్తామన్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాలు కరీంనగర్లోనే ఉంచడంతో పాటు ఖమ్మం జిల్లాలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిపాదిత జనగామ జిల్లాలో కొత్తగా స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్, ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా గాదిగూడ, సిరికొండ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.