breaking news
Thagarapuvalasa
-
ప్రియుడి మోజులో.. ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి.. అర్ధరాత్రి వేళ
సాక్షి, విశాఖపట్నం(తగరపువలస): వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. మృతదేహాన్ని దహనం చేసి, వేరే మహిళతో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకు యత్నించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. హతుడు పైడిరాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలందపేటకు చెందిన గురప్ప, పోలమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. భర్త చనిపోయిన తరువాత పోలమ్మ తగరపువలస మార్కెట్లో దుంపలు అమ్మి పిల్లల్ని పోషించింది. వలందపేటలో జి+2 ఇల్లు ఉంది. మూడో కుమారుడైన పైడిరాజు, జ్యోతి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉంటున్నారు. పైడిరాజు (34) టైల్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జ్యోతి ఎనిమిదో తరగతి వరకు చదివింది. జ్యోతికి విశాఖ అప్పుఘర్ ప్రాంతానికి చెందిన నూకరాజు అలియాస్ శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉంది. గత డిసెంబరు 29వ తేదీ రాత్రి పైడిరాజు ఇంట్లో హత్యకు గురయ్యాడు. ఈ హత్యను జ్యోతి, నూకరాజు చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూకరాజు కజిన్ భూలోక వీరికి సహకరించినట్టు సమాచారం. దీనిపై భీమిలి సీఐ కె.లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి.. ఎంవీపీ కాలనీలో గల సీబీఐ కార్యాలయంలో తనకు ఉద్యోగం లభించిందని జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది. అక్కడే అద్దె ఇంట్లో ప్రియుడు నూకరాజుతో కలిసి నివాసముంటూ రాకపోకలు సాగించేది. గత నెల 29వ తేదీ రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పైడిరాజుకు పెట్టింది. స్పృహ తప్పిన తరువాత తల వెనుక భాగంపై మారణాయుధంతో కొట్టడంతో చనిపోయాడు. అర్ధరాత్రి వేళ ప్రియుడు, అతని కజిన్ భూలోక సాయంతో మృతదేహాన్ని మూటకట్టి వాహనంలో ఎంవీపీ కాలనీలోని వారు అద్దెకు ఉంటున్న ఇంటికి తరలించారు. 30న పెదజాలారిపేట శ్మశానవాటికలో దహనం చేశారు. అదే రోజు రాత్రి తన భర్త ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని జ్యోతి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నూకరాజు మెట్లమార్గంలో రక్తపు మరకలు కడుగుతూ.. పైడిరాజు హత్యకు గురైన తరువాత 30వ తేదీ వేకువజామున 4 గంటలకు జ్యోతి మెట్ల మార్గంలో రక్తపు మరకలు కడిగినట్టు బంధువులు తెలిపారు. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు వారి ఇంటి నుంచి మూట పట్టుకుని వెళ్లడం కూడా చూశామంటున్నారు. జ్యోతి మాత్రం పైడిరాజు మరో మహిళతో వెళ్లిపోయాడని ఇంట్లోవారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా దివ్య అనే మహిళతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి పైడిరాజు కోసం చూడవద్దని చెప్పించింది. 8వ తరగతి చదువుకున్న జ్యోతికి సీబీఐ కార్యాలయంలో ఉద్యోగం లభించడంపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు సీబీఐ కార్యాలయంలో సంప్రదించారు. జ్యోతి తమ వద్ద ఉద్యోగం చేయలేదని వారు తెలిపారు. దీంతో జ్యోతిపై బంధువులు భీమిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పైడిరాజు అదృశ్యం వెనుక జ్యోతి పాత్రపై పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. బుధవారం జ్యోతిని, నూకరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి సహకరించిన భూలోకను కూడా భీమిలి స్టేషన్‌కు తరలించారని సమాచారం. వలందపేట గ్రామస్తుల ఆగ్రహం జ్యోతి, నూకరాజు పోలీసుల అదుపులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న హతుడు పైడిరాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున గురువారం ఉదయం భీమిలి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పైడిరాజు హత్యకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. దీంతో పోలీసులు నిందితులను తీసుకొని పైడిరాజు మృతదేహాన్ని దహనం చేసిన ప్రదేశంతో పాటు ఎంవీపీ కాలనీలో వీరు ఉంటున్న అద్దె ఇంటిని పరిశీలించారు. -
ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
తగరపువలస (విశాఖపట్నం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన విశాఖ జిల్లా తగరపువలసలోని చిట్టివలస కొండపేటలో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లారీ డ్రైవర్ కె.శ్రీనివాస్(25) ఇంటి పక్కన ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్లు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేసింది. ఇది గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.