breaking news
Telugus
-
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
డెట్రాయిట్లో వనభోజనాల సందడి
డెట్రాయిట్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దాదాపు 300 తెలుగు కుటుంబాలు కలిసి వనభోజనాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడ ఎండాకాలం ప్రారంభం కావడంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చిఅందరూ కలిసి ఒకేచోట చేరి సేద తీరారు. ఫర్మింగ్టన్ హిల్స్‌లోని షియావసి పార్క్‌లో వివిధ రంగాలకి చెందిన తెలుగు వారు కలిసి హాయిగా గడిపారు. ప్రత్యేకమైన వంటకాలు, ఆటలు, పాటలతో ఉషారుగా గడిపారు. వివిధప్రాంతాల్లో ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకే చోట కలిశారు. అందరు తెలుగు వాళ్లు ఒకే చోట చేరి ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించినందుకు టీడీఎఫ్‌కు వనభోజనాలకు వచ్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సోనియాగాంధీని తెలుగుజాతి క్షమించదు
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొరిటెపాడు(గుంటూరు) : స్వార్ధ రాజకీయాలకోసం విచక్షణా రహితంగా రాష్ట్రాన్ని విభజించిన సోనియాగాంధీని తెలుగుజాతి క్షమించదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియాగాంధీ ఈ 10 నెలల కాలంలో ఎక్కడ ఉన్నారో తెలియదని, నేడు తెలుగు ప్రజలపై మొసలి కన్నీరు కార్చడం దుర్మార్గమన్నారు. నాడు విభజన చట్టంలో ఏపీకి ఎలాంటి హామీలు ప్రకటించకుండా నేడు తెలుగు ప్రజలపై ప్రేమ ఒలకబోయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్గాకూడా గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు సేకరణ చేపట్టడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ నెల 21వ తేదీన తుళ్లూరు మండలం అనంతవరంలో పంచాంగ శ్రవణం ఉగాది వేడుకలు జరపనున్నట్లు చెప్పారు. కవులు, రచయితలను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు తెలిపారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగదని స్పష్టం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎ.ఎస్.రామకృష్ణను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలను వ్యతిరేకించిన వీరప్పమొయిలీని పార్లమెంట్ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, జి.వి.ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, మద్ధాళి గిరిధర్, దాసరి రాజామాష్టారు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
తెలుగుజాతికి బహుమతి
‘అందమైన వర్ణాల పర్వం సంక్రాంతి. ఇది పాడిపంటల పండుగ. మనుషుల మధ్య అనుబంధాలను పెనవేసే సంక్రాంతి.. తెలుగుజాతికి లభించిన గొప్ప బహుమతి..’ అంటున్నారు నాటక రంగ రారాజు చాట్ల శ్రీరాములు. మంగళవారం రవీంద్రభారతిలో ‘సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం’ నిర్వహించిన సందర్భంగా ఆయన సాక్షి సిటీప్లస్‌తో సంక్రాంతి గురించి పంచుకున్న అనుభూతులు.. ..:: కోన సుధాకరరెడ్డి సంక్రాంతి మూడు రోజుల పండుగ. ఆ రోజులు తలుచుకుంటేనే అద్వితీయమైన అనుభూతి.. పండక్కి వారం ముందు నుంచే పల్లెలు కళకళలాడేవి. పిల్లలకైతే ఇది కొత్త బట్టల పండుగ. భోగి మంటల కోసం చేసే ఏర్పాట్లు మరువలేనివి. కొన్ని ప్రాంతాల్లో భోగి మంటల్లో వేసే కలప కోసం ముందు రోజు రాత్రంతా యువత చేసే హంగామా భలే ఉండేది. సంక్రాంతి అలంకరణ ప్రధానమైన పండుగ. లోగిళ్లలో రంగవల్లులు.. ఇళ్లకు మామిడాకుల, బంతిపూల తోరణాలు.. ముంగిట ధాన్యరాశులు..రంగులద్దుకున్న ఎడ్లబండ్లు.. ఎన్నని చెప్పాలి?. తెలవారుతూనే మేల్కొలుపు సంక్రాంతికి ముప్ఫై రోజుల ముందే నెల పడతారు. ఆ నెల రోజులూ ఉదయం, సాయంత్రం హరిదాసు కీర్తనలు పాడుతూ ఇంటింటికీ వస్తాడు. ప్రత్యేకించి పండుగ మూడు రోజుల్లో బుడబుక్కల వాళ్లు, గంగిరెద్దుల వాళ్లు, కొమ్మదాసులు, జంగమదేవరలు వచ్చి వెళ్తూనే ఉంటారు. భోగినాడు తెల్లవారుజామున 3 గంటలకే పల్లెలు మేల్కొనేవి. ప్రతి ఇంటి ముంగిట కల్లాపుల చప్పుళ్లు.. వాటిపై ముగ్గులేసే పడుచులు.. పట్టులంగాలు, ఓణీల వయ్యారం.. ఆలయాల్లో దైవ దర్శనం.. ఇంటికొచ్చాక పిండివంటల ఘుమఘుమలు.. మధ్యాహ్నం పంటపొలాల్లో హాయిగా పిల్లాపాపలతో కాలక్షేపం.. సాయంత్రానికి డూ డూ బసవన్నల విన్యాసాలు.. సామాజిక పర్వం తెలుగు పండుగ లన్నీ ఆనందోత్సాహాలను పంచేవే. సంక్రాంతి మరీను. రైతు తనకు చేతికందిన పంట నుంచి కొంత ఫలాన్ని తన వద్ద పని చేసేవారికి పంచేవాడు. పండుగ పిండివంటలు సైతం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ విధంగా ఇది సామాజిక పర్వం. హరికథలు, తోలుబొమ్మలాటలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడాలు.. ఇవన్నీ సామూహిక ఆనందాన్ని పంచేవి. అప్పుడు మనిషి సంఘజీవి. ఇప్పుడు వ్యక్తిగత జీవి. నా జీవితంలో ఎన్నో సంక్రాంతుల్ని చూసిన కళ్లతో చెబుతున్నాను. ఈనాడు పల్లెల్లోనూ ఆ క్రాంతి లేదు. ఇక పట్టణాల్లో సరేసరి. ఏనాటికైనా.. అమెరికాలో చూశాను.. అక్కడి తెలుగు వారు పండుగ పూట సంప్రదాయ వస్త్రధారణలో శుచిగా కనిపిస్తారు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతారు. పండుగలు, పర్వాలను శాస్త్రోక్తంగా జరుపుకొంటారు. పిల్లలకు పట్టుబట్టి తెలుగు నేర్పుతున్నారు. మనం.. ఈ గడ్డపై పుట్టి మన సంప్రదాయాలను మనమే పలుచన చేసుకుంటున్నామేమో అనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదనంలోని తియ్యదనం ఏనాటికీ తగ్గదు. మన సంస్కృతి.. అందులోని పండుగలు, పర్వాల ప్రాబల్యం అటువంటిది. అవి మనకు శక్తిని, యుక్తిని, వికాసాన్ని ఇస్తాయి. మేం నాటకాల ద్వారా ఇదే ప్రజలకు తెలియజేస్తున్నాం. మన సంస్కృతి- సంప్రదాయాలపై మక్కువ పెంచేందుకు కృషి చేస్తున్నాం. -
కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారు
-
తెలుగువారిని రప్పించండి: కేసీఆర్, బాబు
హైదరాబాద్: భారీ వర్షాలు వరదలతో జమ్మూకాశ్మీర్ అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు రప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమయాత్తమయ్యాయి. అందుకు సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలని ఇరు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. దాంతో జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న ఇరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 36 మంది ఎన్ఐటీ విద్యార్థులు ఇప్పటికే లేహ్ నుంచి ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఢిల్లీలోని ఉన్నతాధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు.