పార్సిల్లో కొండ చిలువ
చెన్నై : తైవాన్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలించిన కొండ చిలువను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కంలో అంతర్జాతీయ తపాలా శాఖ పనిచేస్తోంది. ఇక్కడ నుంచి విదేశాలకు పంపే వస్తువులను సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పంపుతారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చే తపాలా కవర్లను కూడా తనిఖీ చేసి బట్వాడా చేస్తారు.
ఈ నేపథ్యంలో చెన్నై కేకేనగర్లో గల సంతోష్ అనే అతనికి గృహోపకరణ వస్తువులు గల అట్టపెట్టెల పార్సిల్ తైవాన్ నుంచి తపాలా శాఖ కార్యలయానికి మంగళవారం వచ్చింది. దాన్ని స్కాన్ చేసి చూడగా అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అట్టపెట్టలను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
దాంతో తపాలా విభాగ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో అట్టపెట్టెలను తెరిచి చూడగా అడుగు పొడవు కొండ చిలువ ఉండడంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. దీంతో కొండచిలువ పిల్లను తైవాన్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. వెంటనే వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి కొండ చిలువను అప్పగించారు.