breaking news
Swachh Bharat Mission (Grameen)
-
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో సిరిసిల్ల టాప్
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్ స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు. అద్భుతాన్ని ఆవిష్కరించారు: మంత్రి కేటీఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ –2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కోరారు. తాజా అవార్డుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం కారణంగానే ఇది సాధ్యమైందంటూ’కలెక్టర్ కూడా ట్వీట్ చేశారు. -
మిషన్ ‘స్వచ్ఛ గ్రామీణ్ భారత్’
* రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం * నాలుగేళ్లలో రూ. 3,661 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు * మార్గదర్శకాలను సిద్ధం చేసిన ఆర్డబ్ల్యూఎస్ఎస్ విభాగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చేందుకు ‘స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)’ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 75 శాతం నిధులు అందనుండగా, మిగిలిన 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బేస్‌లైన్ సర్వేను నిర్వహించిన గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య (ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అధికారులు కార్యక్రమ అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. గ్రామీణ తెలంగాణలో మొత్తం 45 లక్షల కుటుంబాలు ఉండగా ఇందులో సుమారు 33.34 లక్ష ల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని తేలింది. ఇందులో సుమారు 29.29 లక్షల పేద కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకునేందుకు యూనిట్‌కు రూ. 12,500 చొప్పున ప్రోత్సాహకాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వచ్చే నాలుగేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3,671 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఆయా గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని సంపూర్ణంగా ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది. మార్గదర్శకాలు ఇలా.. * అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక ఉప కమిటీగా గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో గ్రామంలోని ప్రతి వార్డు నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. 50 శాతం మంది పేద మహిళలను సభ్యులుగా నియమించాలి. * జిల్లా కమిటీ నుంచి నేరుగా సొమ్మును జమ చేసే విధంగా ప్రతి గ్రామ కమిటీకి బ్యాంకు ఖాతాను తెర వాలి. * గ్రామ కమిటీ ద్వారా మరోమారు గ్రామంలో సర్వే చేసి మరుగుదొడ్లు లేని పేద కుటుంబాల జాబితాకు గ్రామ సభ ఆమోదం తీసుకోవాలి. * నిధుల మంజూరు నిమిత్తం గ్రామసభ ఆమోదించిన జాబితాను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమర్పించాలి. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ ఆమోదం కూడా పొందాక గ్రామ కమిటీ ఖాతాలకు నిధులు జమ అవుతాయి. * గ్రామంలో వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, గ్రామసమాఖ్య సభ్యులు, సాక్షర భారతి వాలంటీర్ల సాయం తీసుకోవాలి. * మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన వ్యయంలో 50 శాతం నిధులు ఖాతాలో సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. * లబ్ధిదారులు తామే సొంతంగా మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలి. ఇందుకవసరమయ్యే నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలి. * లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకోలేకుం టే గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలి.