breaking news
state medical and health department
-
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్‌కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
వారియర్స్ నుంచీ వైరస్
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేసేవారే వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారకులవుతున్నారా? ప్రస్తుతం అనేక కారణాల్లో ఇదో కీలకాంశంగా ఉందా? అంటే అవుననే అంటు న్నాయి వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు. గత రెండు నెలలుగా అనేక కారణాలతోపాటు కరోనా నియంత్రణలో పాల్గొంటున్న వైద్యు లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీ సులు, మున్సిపల్ కార్మికులు ఇలా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేసే వారి నుంచే కరోనా వ్యాప్తి చెందుతోందని వైద్య, ఆరోగ్యశాఖ విశ్లేషించింది. ఏప్రిల్‌లో కొద్దిగా, మేలో కాస్త ఎక్కువగా, జూన్‌లో మరింత ఎక్కువగా వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని తేల్చింది. కరోనా కట్టడిలో భాగస్వాములైనవారే పరోక్షంగా దాన్ని వ్యాపింపజేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు కేంద్రా నికి తాజాగా నివేదిక సమర్పించింది. 235 మంది వైద్య సిబ్బందికి కరోనా గత నెల 28 నాటికి రాష్ట్రంలో 235 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 550 మంది కూడా కరోనా బారినపడ్డారు. ‘ఆరోగ్య సిబ్బందిలో కరోనా వ్యాప్తి ఏప్రిల్‌లోనే ప్రారంభమైంది. గత రెండు నెలల్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి నిమ్స్ వరకు అనేక ఆసుపత్రుల్లో కరోనా కలకలం రేపింది. అదిప్పుడు గొలుసుకట్టుగా వ్యాపిస్తూనే ఉంది’ అని ఒక వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వ్యాఖ్యానించారు. ‘ఇక అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో వందలాది మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కరోనా సోకింది. వారి వల్ల రోగులకు, ఇతరులకు సోకుతోంది. చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బ్లాక్ ఉన్న చోటే సాధారణ బ్లాకులు ఉండటం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనాయేతర పడకలు ఖాళీగా ఉన్నందున అనేక ఆసుపత్రులు ఎక్కువ పడకలను కరోనా పడకలుగా మారుస్తున్నాయి. కరోనా రోగులు, సాధారణ రోగులు ఒకే భవనంలో కలసి ఉన్నందున వైరస్ వ్యాప్తి జరుగుతోంది. సిబ్బందిని కరోనా బ్లాక్‌లలోనూ, సాధారణ బ్లాక్‌లలోనూ పనిచేయిస్తున్నందున చాలా కేసులు నమోదు అవుతున్నాయి’అని మరో వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులపై పంజా... తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పరీక్షలు చేయించుకోవడంతో వారి వల్ల కూడా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ ఒకటి నుంచి గత నెల 28 వరకు 11,299 శ్వాసకోశ సమస్యలున్న వారిని గుర్తించగా వారిలో 2,414 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో ఒక్క జూన్‌లోనే 2,202 మంది తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పాజిటివ్‌గా తేలింది. అంటే వారిలో పాజిటివ్ రేటు ఏకంగా 34.19 శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. నెలవారీ విశ్లేషణ... రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో మొదటి కేసు మార్చి 2న నమోదైంది. రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ విదేశాలకు వెళ్లి రావడంతో రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించింది. ఆ తర్వాత విదేశీ ప్రయాణికుల నుంచి, మర్కజ్ యాత్రికుల నుంచి కేసులు వచ్చాయి. వారిని కాంటాక్టు అయిన వ్యక్తులకు కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. కరోనా విధుల్లో పాల్గొన్న సిబ్బంది కూడా పరోక్షంగా వ్యా ప్తికి కారకులయ్యారు. మేనెలలో పరిస్థితి ఘోరంగా తయారైంది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ వలసదారులతో కేసుల సంఖ్య పెరిగింది. విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందినవారు రావడం, సౌదీ అరేబియాలో ఉన్న వారిని బలవంతంగా ఇక్కడకు పంపించడం వల్ల కూడా కేసులు పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ విశ్లేషణ ప్రకారం జూన్‌లో అనేక కారణాలతో కరోనా వచ్చినవారు, వారి కాంటాక్టులకు అంటించడం జరిగింది. -
నాలుగు జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆయుష్ ఆసుపత్రులను నెలకొల్పనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. సిద్ధంగా ఉన్న భవనాల్లో 20 పడకల ఆయుష్ ఆసుపత్రులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం మంత్రి లక్ష్మారెడ్డి ఆయుష్ వైద్య విభాగంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయుష్ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఆయుష్ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎయిడ్స్‌పై పరిశోధనలను మరింత ముమ్మరం చేసి ఆ మహమ్మారిని పారదోలాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆయుష్ కమిషనర్ డాక్టర్ రాజేందర్, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ లలితకుమారి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ పాల్గొన్నారు.