నవంబర్ నుంచి హెల్త్‌కార్డులు
వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం ఉద్యోగ సంఘాలకు ఏపీ సీఎం వెల్లడి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్‌కార్డుల పథకాన్ని నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నామని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అక్టోబర్ రెండో వారంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం మంగళవారం ఉద్యోగ సంఘా ల నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా హెల్త్‌కార్డుల పథకాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. వైద్య చికిత్సకు రూ. 2.5 లక్షలుగా నిర్ణయించిన గరిష్ట పరిమితిని తొలగించి.. అపరి మిత చికిత్స అందించాలనే ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు సీఎం సానుకూలంగా స్పందిస్తూనే.. ఆస్పత్రిలో చేరిన ఒక్కో విడతకు (ఎపిసోడ్‌కు) చికిత్స గరిష్ట వ్యయం రూ. 2 లక్షలు దాటకూడదనే షరతు పెట్టారు. అలా ఏడాదిలో ఎన్నిసార్లయినా ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అయి తే చికిత్స వ్యయం రూ. 2 లక్షలు దాటిన తర్వాతా చికిత్స కొనసాగించాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ పథకంలో ముఖ్యాంశాలు ఇవీ...
3.91 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాలకు హెల్త్‌కార్డుల పథకం వర్తించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిసి 22 లక్షల మంది ఉంటారని అంచనా.
ఠిపథకాన్ని అమలు చేయడానికి ఏడాదికి రూ. 230 కోట్లు వ్యయమవుతుందని అధికారుల అంచనా. అందులో 40 శాతం (రూ. 90 కోట్లు) ఉద్యోగులు, 60 శాతం (రూ. 140 కోట్లు) ప్రభుత్వం భరించనుంది. ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా చందాను వసూలు చేయనున్నారు. అక్టోబర్ జీతం నుంచి చందా వసూలును ప్రారంభించనున్నారు.
►పథకం అమలు కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల ట్రస్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు సీఎం సానుకూలంగా స్పందించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఉద్యోగుల ట్రస్టు ఒప్పందం కుదుర్చుకొని పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలోనూ పేర్కొంటామని చెప్పారు. అప్పటి వరకు పథకం అమలు బాధ్యతను ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అప్పగించనున్నారు.
►ఉద్యోగుల ట్రస్టు ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని శాశ్వత సభ్య సంఘాలతో పాటు గెజిటెడ్ అధికారుల సంఘం, పెన్షనర్ల సంఘానికి చోటు కల్పించనున్నారు. కమిటీలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, జీఏడీ (సర్వీసెస్) కార్యదర్శి, కుటుంబ సంక్షేమ కమిషనర్, వైద్య విద్య డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, ట్రెజరీ శాఖ డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఉద్యోగుల ప్రత్యేక ట్రస్టు ఏర్పాటయ్యే వరకు పథకం అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
►కాన్పు సహా 347 రకాల చికిత్సలను ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయించుకోవాలనే నిబంధన తొలగించారు. 32 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వనున్నారు. దీర్ఘ కాలిక మందులను కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పంపిణీ చేస్తారు. అయితే దీర్ఘకాలిక వ్యాధి చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్‌గా చేయడానికి అవకాశం కల్పించారు. ఠిదాదాపు 2,000 రోగాలకు ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందించనున్నారు.
►ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకే పథకాన్ని అమలు చేయనున్నారు. ఆరు నెలల తర్వాత మిగతా అనుబంధ రంగాలకు పథకాన్ని విస్తరించనున్నారు.
►హృద్రోగ చికిత్సలో నాశిరకం స్టంట్లు వేయకుండా నిరోధించడానికి నిబంధనలు పెట్టనున్నారు.
►ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులపై ఉద్యోగులకు చికిత్స అందించడానికి అంగీకరించాయి.
►ఉద్యోగులు, పెన్షనర్లు వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.