breaking news
Special track
-
ఈ రోడ్డుపై చార్జింగ్ చేసుకోవచ్చు!
బ్రెస్సెల్స్: సమీప భవిష్యత్‌లో వాహనాలన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయా? శిలాజ ఇంధనాలకు విద్యుత్ సరైన ప్రత్యామ్నాయమా? అంటే స్వీడన్ పరిశోధకులు అవుననే చెబుతారు. చెప్పడమే కాదు.. రోడ్లపై వాహనాలు దూసుకెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్ అయ్యేలా ప్రత్యేకమైన ట్రాక్‌ను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. స్టాక్‌హోం విమానాశ్రయం నుంచి రోజెర్స్బెర్గ్ వరకూ నిర్మించిన ఈ ట్రాక్‌ను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశమంతటా అమలు చేసేందుకు స్వీడన్ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. 2030 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని 70 శాతం తగ్గించాలని స్వీడన్ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు మధ్యలో విద్యుత్ ట్రాక్ ఈరోడ్ ఆర్లాండా, వాహనాల తయారీ సంస్థ డీఏఎఫ్, టెక్నాలజీ కంపెనీలు, విద్యాసంస్థలు, స్వీడన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. స్టాక్ హోం ఎయిర్పోర్ట్ నుంచి రోజెర్స్బెర్గ్లోని ఓ సరుకుల సరఫరా కేంద్రం వరకూ దాదాపు 2 కి.మీ పొడవుతో రోడ్డు మధ్యలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ మధ్యలో 6 సెం.మీ లోతులో విద్యుత్ వైర్లను అమర్చారు. దీంతో విద్యుత్‌తో నడిచే ప్రత్యేకమైన కారు లేదా లారీ ఈ మార్గంపైకి రాగానే దాని కింద ఉండే ప్రత్యేకమైన చేయి లాంటి నిర్మాణం ఆటోమేటిక్‌గా విద్యుత్ ట్రాక్‌ను గుర్తించి చార్జింగ్ ప్రారంభిస్తుంది. ఈ మార్గంలో కారు లేదా ట్రక్కు వెళుతున్నంతవరకూ బ్యాటరీలు చార్జ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ కారు లేదా ట్రక్కు నిలిచిపోతే, విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. ఈ వ్యవస్థలో భాగంగా ఒక్కో వాహనం ఎంత విద్యుత్‌ను వినియోగించుకుంటుందో లెక్కించి సదరు కారు లేదా లారీ ఓనర్ నుంచి నగదును వసూలు చేస్తారు. దీనివల్ల విద్యుత్ కొరతతో వాహనాలు ఆగిపోవడమన్న సమస్యే తలెత్తదు. ఈ పైలెట్ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో స్వీడన్ ప్రభుత్వం 70 శాతం భరిస్తోంది. లాభదాయకం.. సురక్షితం ఈ ప్రాజెక్టులో విద్యుత్ ట్రాక్ ఉన్న రోడ్డును 50 మీటర్లకు ఓ సెక్షన్ చొప్పున విభజిస్తారు. తద్వారా వాహనాలు సంబంధిత సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా జరుగుతుంది. లేదంటే ఆగిపోతుంది. దీనివల్ల గణనీయంగా ఇంధనాన్ని, శక్తిని ఆదా చేయొచ్చు. దేశమంతటా రోడ్లపై ఇలాంటి ట్రాక్‌లను పరచడం వల్ల విద్యుత్ వాహనాల తయారీ ఖర్చు, బ్యాటరీల పరిమాణం భారీగా తగ్గిపోతుంది. సాధారణంగా ఈ ట్రాక్‌లను ఓ కి.మీ మేర అమర్చాలంటే దాదాపు రూ.8.46 కోట్ల మేర ఖర్చవుతుంది. ఈ మొత్తం ట్రామ్ కారు ఏర్పాటు వ్యయంతో పోల్చుకుంటే 50 రెట్లు తక్కువ. ఇక ఈ ట్రాక్‌ల కారణంగా చార్జింగ్ స్టేషన్ల కోసం వాహనదారులు వెతకాల్సిన బాధ తప్పుతుంది. వరదలు సంభవించినా, రోడ్డంతా ఉప్పు ఉండిపోయినా ఉపరితలంపై విద్యుత్ సరఫరా ఒక ఓల్ట్కు మించదనీ, ప్రజలు నిక్షేపంగా చెప్పులు వేసుకోకుండా నడవొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంధన కొరత అన్నదే లేకుండా ప్రజలు తమ వాహనాలు నడుపుకోవచ్చని హామీ ఇస్తున్నారు. -
సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్
నగరంలో సైకిళ్లను వినియోగించేవారిని ప్రోత్సహించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 15 లక్షల వ్యయమవుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మెట్రో రైల్ స్టేషన్ల వద్ద సైకిల్ స్టేషన్లను నిర్మించనున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) యోచిస్తోంది. ఎనిమిది కిలోమీటర్ల పొడవుండే ఈ ట్రాక్ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలై వన్ వే రోడ్, గలేరియా మార్కెట్ గుండా గోల్ఫ్ కోర్సు రోడ్ వద్ద ముగుస్తుంది. తక్కువ వ్యయంతో, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ట్రాక్ నిర్మించడం కోసం గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పలు డిజైన్లను పరిశీలిస్తోంది. ట్రాక్ నిర్మాణం వారం రోజులలో మొదలవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. మామూలుగా వాహనాలు నడిచే రోడ్డుకు భిన్నంగా కనిపించడం కోసం సైకిల్ ట్రాక్‌లకు ప్రతే ్యక రంగు తో పెయింట్ చేస్తారు. వాటిపై రెట్రో రిఫ్లెక్టివ్ పెయింట్‌తో సైకిల్ లోగోలను పెయింట్ చేసి క్యాట్ ఐ లైట్లను అమరుస్తారు, ఈ మార్గంలో ఇతర వాహనాలు ప్రయాణించకుండా ఉండడం కోసం అక్కడక్కడా సైకిళ్లకు మాత్రమే అని తెలియజెప్పే సైనేజ్‌లను అమర్చడంతో పాటు బొల్లార్డ్ వంటి బారియర్లను ఏర్పాటుచేస్తారు. ఒక్కొక్క లేన్ 1.5 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 15 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు, గుర్గావ్లో సైక్లింగ్ చేసేవారు తక్కువని, నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ప్రత్యేక ట్రాక్‌లు నిర్మిస్తున్నట్లు ఎంసీజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది సైకిళ్లను వాడేవిధంగా ప్రోత్సహిండం కోసం మెట్రో స్టేషన్ల ఎదుట సైకిల్ స్టేషన్లను నిర్మించాలని కూడా యోచిస్తున్నారు.