breaking news
southern grid
-
గ్రిడ్‌కు ముప్పు?
నిర్ణీత కోటాను మించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో కీలకమైన విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. నిర్ణీత కోటాను మించి విద్యుత్‌ను వినియోగించరాదని దక్షిణాది గ్రిడ్ ఇస్తున్న ఆదేశాలను ఏపీ సంస్థలు ధిక్కరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని తామే పూర్తిగా వినియోగించుకుంటామని తేల్చి చెబుతూ.. ఆ నిర్ణయాన్ని అమలు కూడా చేస్తున్నాయి. దీంతో దక్షిణాది ఫ్రీక్వెన్సీలో హెచ్చుతగ్గులతో ఏకంగా గ్రిడ్‌కే ముప్పు ముంచుకొస్తోంది. కోటాను మించుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట లోడ్ డిస్పాచ్ సెంటర్(ఏపీఎస్‌ఎల్‌డీసీ)ను దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డీసీ) శుక్రవారం పదే పదే హెచ్చరించింది. అయినప్పటికీ ఎస్ఎల్డీసీ దాన్ని ఖాతరు చేయలేదు. శుక్రవారం ఒక్క రోజే కోటాను మించి సుమారు 5-6 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఎక్కువగా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్లాంట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్‌ని ఎస్ఆర్ఎల్డీసీకి రోజూ అందివ్వాల్సిన ఏపీ విద్యుత్ సంస్థలు ఇప్పుడు ససేమిరా అంటున్నాయి. ఇకపై ఆ వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే తెగేసి చెప్పాయి. తద్వారా తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ కోటాను అడ్డుకునే యత్నం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎస్ఆర్ఎల్డీసీ కూడా చురుగ్గా స్పందించింది. సూపర్వైజరీ కంట్రోల్ డేటా అక్విజిషన్(స్కాడా) వ్యవస్థ ద్వారా ప్రతీ 15 నిమిషాలకోసారి ఏయే విద్యుత్ ప్లాంట్ల నుంచి ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్న సమాచారాన్ని సేకరించింది. దాన్ని బట్టి రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న కోటా మేరకు ఇరు రాష్ట్రాలకు విద్యుత్‌ను కేటాయించింది. ఈ మేరకు ఏపీఎస్ఎల్డీసీకి, ఇటు తెలంగాణ ఎస్ఎల్డీసీకి ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ బేఖాతరు చేస్తూ తమ ప్లాంట్ల ద్వారా లభిస్తున్న మొత్తం విద్యుత్‌ను వినియోగించుకుంటోంది. అయితే ఇందుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఎస్ఆర్ఎల్డీసీ హెచ్చరించినా ఏపీఎస్‌ఎల్‌డీసీ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. మరోవైపు ఏపీ విద్యుత్ సంస్థల తీరుతో దక్షిణాది గ్రిడ్‌కు ముప్పు వాటిల్లే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది గ్రిడ్‌కు ముప్పు! విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, సబ్స్టేషన్లు, సరఫరా లైన్లు మొదలైన వాటన్నింటినీ కలిపి గ్రిడ్‌గా వ్యవహరిస్తారు. విద్యుత్‌ను నిల్వ చేయుడం సాధ్యం కాదు. ఉత్పత్తి అరుున వెంటనే వినియోగించుకోవాలి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సవుతూకం ఉండాలి. ఈ సవుతూకం దెబ్బతింటే విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. విద్యుత్ సరఫరా పౌనఃపున్యం 50 హెడ్జ్‌గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఉత్పత్తి, వినియోగం సవూనంగా ఉన్నట్టు లెక్క. అరుుతే 49.5 హెడ్జ్ నుంచి 50.2 హెడ్జ్ వరకూ హెచ్చుతగ్గులు ఏర్పడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ దృష్ట్యా అన్ని రాష్ట్రాలూ విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య సమతూకాన్ని పాటించాలి. లేదంటే గ్రిడ్‌కు ఇబ్బందులు తప్పవు. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండి, వినియోగం తక్కువగా ఉంటే ప్లాంట్లలో ఉత్పత్తిని తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉండి, వినియోగం ఎక్కువగా ఉంటే సమతూకం తేవడానికి కోతలు విధించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే విద్యుత్ ప్లాంట్లపై ప్రభావం పడి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడం, సరఫరా లైన్లు ట్రిప్ కావడం వంటివి చోటుచేసుకుంటాయి. దీంతో గ్రిడ్ పూర్తిగా విఫలమై అంధకారం నెలకొంటుంది. అందుకే గ్రిడ్ ఫ్రీక్వెన్సీని కచ్చితంగా పాటించేందుకు రాష్ట్ర స్థారుులో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ), ప్రాంతాలవారీగా దేశవ్యాప్తంగా ఐదు ఆర్ఎల్డీసీలు(ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు) ఉన్నారుు. గ్రిడ్ ఫ్రీక్వెన్సీలో సమతూకం పాటించే విధంగా ఆర్ఎల్డీసీలు ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేస్తారుు. దీన్ని పాటించకపోతే గ్రిడ్‌కు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు దక్షిణాది గ్రిడ్(ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ పాటించడం లేదు. దీనివల్ల గ్రిడ్ కుప్పకూలితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. -
కోటా యథాతథం
విద్యుత్‌పై రాష్ట్ర డిస్పాచ్ సెంటర్‌కు దక్షిణాది గ్రిడ్ ఆదేశం ఇరు రాష్ట్రాలకూ ప్రస్తుత వాటా మేరకే సరఫరా పీపీఏలతో నిమిత్తం లేదంటూ గ్రిడ్ ఈడీ లేఖ కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించాకే తర్వాతి చర్యలు తెలంగాణకు తక్షణ ముప్పు తప్పినట్టే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ సరఫరాను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ)ను బెంగళూరు కేంద్రంగా ఉన్న దక్షిణాది ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) ఆదేశించింది. ఎస్ఆర్ఎల్డీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఆర్ రఘురాం ఎస్ఎల్డీసీకి బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. పీపీఏలు అమల్లో ఉన్నా, లేకపోయినా ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు ఉన్న వాటా మేరకు విద్యుత్ సరఫరా చేయాలని అందులో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాను విభజన చట్టం మేరకు ఎస్ఆర్ఎల్డీసీ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ వాటాలను ఖరారు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను కూడా లేఖలో ఈడీ ప్రస్తావించారు. ‘‘ఇరు రాష్ట్రాల విద్యుత్ వాటాలను ఖరారు చేస్తూ విభజన అనంతరం మే 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీవో(నంబర్ 20) జారీ చేసింది. పీపీఏలు దానికి అనుగుణంగా ఉన్నా లేకపోయినాఇరు రాష్ట్రాలకూ పేర్కొన్న వాటా మేరకు విద్యుత్‌ను సరఫరా చేయాలి. ఆ రాష్ట్రాల మధ్య ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్ర విద్యుత్ శాఖతో చర్చించండి. ఆ శాఖ నిర్ణయం అనంతరమే దీనిపై ముందుకు వెళ్లాలి’’ అని అందులో ఆయన స్పష్టం చేశారు. పీపీఏల రద్దు వల్ల విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్)కు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఈడీ అభిప్రాయపడ్డారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ వాటాను ఖరారు చేసేందుకు గత మార్చి 28న టాస్క్‌ఫోర్స్ కమిటీ వేశాం. అది పేర్కొన్న మేరకే ఇరు రాష్ట్రాలకు విద్యుత్ వాటాను ఖరారు చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి ఆ వాటా మేరకే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం’’ అని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈఆర్సీ ఒకవేళ తక్షణం పీపీఏల రద్దుకు సిఫార్సు చేసినా పీపీఏల మేరకు తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగుతుంది. కాబట్టి విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలంగాణ ఇంధన శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర విద్యుత్ శాఖ తీసుకునే నిర్ణయంపైనే పీపీఏల భవితవ్యం ఆధారపడి ఉందన్నాయి. -
‘కూడంకుళం’లో విద్యుదుత్పత్తి ప్రారంభం
సాక్షి, చెన్నై/కొలంబో: వివాదాస్పదమైన కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్ నుంచి ఎట్టకేలకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఈ ప్లాంటులో మంగళవారం అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో తొలుత 75 మెగావాట్లు, అనంతరం 160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని ప్లాంట్ డెరైక్టర్ ఆర్.ఎస్.సుందర్ వెల్లడించారు. దీనిని దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు తెలిపారు. భారత్, రష్యాలు సంయుక్తంగా నెలకొల్పిన ఈ కేంద్రం నుంచి ఒకటి రెండు రోజుల్లో 300 మెగావాట్లు, దశల వారీగా 500, 750, 1,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుందని సుందర్ వివరించారు. నిజానికి నేషనల్ పవర్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు చివరి వారానికే తొలి ప్లాంటును దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేసి, 400 మెగా వాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ప్లాంటులో ఏర్పడ్డ సాంకేతిక లోపంతో ఉత్పత్తిలో జాప్యం జరిగింది. కాగా, ప్లాంటు నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఫుకుషిమా తరహా ముప్పు పొంచి ఉంటుందని శ్రీలంక ఆందోళన వ్యక్తంచేసింది. రష్యాని మెప్పించేందుకే కమిషన్ ఈ డ్రామాలాడుతోందని కూడంకుళం వ్యతిరేక ఉద్యమ నేత సుందరరాజన్ దుయ్యబట్టారు.