కారు పార్కింగ్ కన్ఫ్యూజ్ ఉండదిక!
బీజింగ్: నిత్యం ఏదో ఒక నూతన ఆవిష్కరణ చేసి ఔరా..! అనిపించుకునే చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. 120 సెకన్లలో కారును పార్క్ చేయగల కొత్త రోబోట్‌ను తయారు చేసి అది సమర్థంగా పనిచేసేలా రూపొందించింది. కొత్తగా రూపొందించిన ఈ రోబోట్ ద్వారా కారు పార్కింగ్ చేసేందుకు ఎక్కడ అవకాశం ఉందో.. ఎక్కడ కారును ఉంచగలమనే విషయాన్ని తెలియజేస్తుంది. చైనాలో సాధారణంగా బహుళ అంతస్తులే అధికం. పైగా ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల మధ్య కారుతో వచ్చిన వారికి పెద్ద పెద్ద భవంతుల్లో పార్కింగ్ సమస్య సాధారణంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే షెంజెన్ యీ ఫంగ్ ఆటోమేషన్ టెక్నాలజీ సంస్థ ది స్మార్ట్ పార్కింగ్ రోబోట్‌ను రూపొందించింది. ఎవరైతే తమ కారును నడుపుకుంటూ వెళతారో వారు ఆ అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలోని మెటల్ బోర్డుపైకి తీసుకెళ్లి పెట్టి వదిలేస్తే సరిపోతుంది. మిగితా పనిమొత్తం ఈ రోబోట్ చూసుకుంటుంది. సెకండ్‌కు 1.5మీటర్ల వేగంతో వెళ్లే ఈ రోబో ఒక్కో కారు పార్కింగ్‌ను కేవలం 120 సెకన్లలో పూర్తి చేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆటోమేటిక్ గైడెడ్ వెహికల్ (ఏజీవీ) అని తయారీ దారులు తెలిపారు.