breaking news
SK jhoshi
-
సీఎస్‌గా అజయ్‌మిశ్రా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి మంగళవారం పదవీ విర మణ చేయనున్నారు. సీనియారిటీ, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎస్ రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ముందంజ లో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మిశ్రాకు సీనియారిటీ కలిసి వస్తుండటంతో ఆయననే సీఎస్‌గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, 1989 బ్యాచ్‌కు చెందిన సోమేశ్‌కుమార్ పనితీరు పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న సానుకూల దృక్పథం కూడా కొత్త సీఎస్ ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది. మిశ్రాను సీఎస్‌గా నియమిస్తే 2020 జూన్ వరకు పదవి లో కొనసాగుతారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. సోమేశ్ కుమార్ పదవీ విరమణ సమయం 2023 డిసెంబర్ నెలాఖరుకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే మాత్రం, జోషి వారసుడిగా సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున సన్మానం ఎస్కే జోషి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొననున్నారు. -
రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేద్దాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు అవసరమైన బ్రాండ్ పాలసీని రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. దీనికి సంబంధించి ‘విజన్ డాక్యుమెంట్’ప్రాథమిక నివేదికను 15 రోజుల్లోగా తయారు చేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో క్రీడల అభివృద్ధిపై గ్రాంట్ థర్టన్ ఇండియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో క్రీడలు, సాంస్కృతిక శాఖల కార్యదర్శి బి.వెంకటేశం, పర్యాటక శాఖ కమిషనర్ సునితా ఎం.భగవత్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా 5, 6 క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించడం ద్వారా యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు, హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలు, స్టేడియంలు వినియోగించేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల్లో నిర్వహించబోయే చాంపియన్ షిప్స్, 2023లో వరల్డ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ నిర్వహణ కోసం బిడ్డింగ్ చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ క్రీడల ఈవెంట్లు నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్ ఆదేశించారు. -
కృష్ణా జలాల పంపిణీ కొలిక్కి!
* 15 అంశాలతో మార్గదర్శకాల రూపకల్పన * ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు * మిగులు జలాలూ ఇదే నిష్పత్తిలో పంపిణీ * నీటి విడుదల ప్రొటోకాల్ నిర్ధారణకు వర్కింగ్ గ్రూపు ఏర్పాటు * దీని సిఫారసులకు అనుగుణంగానే బోర్డు ఆదేశాలు * సుదీర్ఘంగా సాగిన కృష్ణా బోర్డు సమావేశం.. నేడూ కొనసాగింపు సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీపై మార్గదర్శకాల ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన 15 అంశాలపై ప్రస్తుతానికి ఒక ముసాయిదాను రూపొందించింది. దీనిని జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది. గురువారం ఇక్కడి శ్రమశక్తిభవన్‌లోని జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్సింగ్, తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్.కె.జోషి, ఆదిత్యనాథ్‌దాస్, తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, తెలంగాణ అంతర్ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజనీర్ నాగేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ముందుగా బోర్డు పరిధిని నిర్వచించి ఈ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను, వాటి నీటి విడుదల ప్రొటోకాల్‌ను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 8.40 వరకు.. దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. వివిధ అంశాలపై సమావేశంలో వాడీవేడిగా వాదోపవాదాలు జరిగినప్పటికీ చివరకు సయోధ్య దిశగా అడుగులు వేశారు. సమావేశాన్ని శుక్రవారం కూడా కొనసాగించాలని, మరోసారి అన్ని అంశాల మీద చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు. ఈ ముసాయిదా ఆమోదం పొందితే 2015-16 ఖరీఫ్, రబీ పంటల కాలానికి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించారు. ముసాయిదాలోని ముఖ్యాంశాలు: 1. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటి విడుదల ప్రొటోకాల్ కూడా బోర్డు పరిధిలోకి వస్తుంది. 2. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు మెంబర్ సెక్రెటరీ అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్లాలి. నీటి విడుదలకు అవసరమైన ఆపరేషన్ ప్రొటోకాల్‌ను సిఫారసు చేస్తుంది. ఇందుకు అనుగుణంగా కృష్ణా బోర్డు తగిన ఆదేశాలు జారీచేస్తుంది. వీటిని ఆయా ప్రాజెక్టు అధికారులు అమలుచేయాల్సి ఉంటుంది. 3. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాలను ఏపీ 512 , తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. 4. నికర జలాలు 811 టీఎంసీలు పోగా మిగులు జలాలు ఉంటే వాటినీ అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. 5. నాగార్జునసాగర్ నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాలువ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జునసాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. 6. కెసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు. 7. తెలుగు గంగ ద్వారా చెన్నై నీటి పథకానికి నిర్దేశిత విడుదలయ్యేలా, ఎస్సార్బీసీ ద్వారా వివిధ అవసరాలకు 19 టీఎంసీలు తప్పనిసరిగా విడుదలయ్యేలా చూడాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని పరిగణించాలి. 8. భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీలు ఇవ్వడం ద్వారా కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే పాటించాలని నిర్ణయించారు. 9. నీటి నియంత్రణ, నిర్వహణలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. అందుకు అనుగుణంగా నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఉండాలి. వాదోపవాదాలు.. * నికర జలాల పంపిణీకి సంబంధించి.. తమకు 532 టీఎంసీలు కేటాయించి, తెలంగాణకు 279 టీఎంసీలే కేటాయించాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. చివరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. కృష్ణా డెల్టాకు తక్కువయ్యే 20 టీఎంసీల విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు. * హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇప్పుడు ఇస్తున్న 16.5 టీఎంసీలకు తోడుగా ఉమ్మడి నీటి కేటాయింపుల నుంచి మరికొంత నీరు కేటాయించాలని తెలంగాణ కోరగా.. నూతన రాజధాని అమరావతికి, రాయలసీమకు తాగునీటి అవసరాలకు నీరు కావాలని ఏపీ కోరింది. * ఈ అంశంపై ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగించాలని, హైదరాబాద్‌కు అవసరమైన నీటిని ఉమ్మడి కోటా నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. * మొత్తం కేటాయింపుల నుంచి తమకు నచ్చిన రీతిలో వినియోగించుకుంటామని తెలంగాణ వాదించినప్పటికీ.. ఏపీ అంగీకరించలేదు. కేంద్రమూ ఈ వాదనకు సానుకూలంగా స్పందించలేదు.