breaking news
Sir charges
-
లీటర్ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి ఎంత లాభమంటే..
న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలేం ఖర్మ ఏకంగా గ్రహాలన్నింటిని చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తాజాగా సోమవారం 16వ సారి ఇంధన ధరలు పెరిగాయి. కేంద్రానికి అధిక ఆదాయం తెచ్చే వనరుల్లో ఇంధనానిది ప్రముఖ స్థానం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఇంధనం మీద వసూలు చేసే ఎక్సైజ్, సెస్, సర్‌చార్జీల ద్వారా కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలిపింది. మే 6, 2020 నుంచి ఇప్పటి వరకు కేంద్రం లీటర్ పెట్రోల్ మీద 33 రూపాయలు, లీడర్ డీజిల్ మీద 32 రూపాయలు లాభపడినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఎక్సైజ్ సుంకం, సర్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1, 2020 వరకు కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 19.98 రూపాయలు, డీజిల్‌పై 15.83 రూపాయలు ఆర్జించగా.. మార్చి 14 నుంచి మే 5 వరకు ఈ మొత్తం రూ.22.98, 21.19కు పెరగగా.. మే 6 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు లీటర్ పెట్రోల్ మీద ఏకంగా 32.98, లీటర్ డీజిల్(బ్రాండెడ్) మీద 34.19 రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఇంధన రేట్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు దేశంలో ఇంధన ధరలు.. అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల మాదిరిగా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. "సాధారణంగా, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇతర దేశాల కంటే ఎక్కువ, తక్కువగా ఉంటాయి. ఇందుకు వివిధ కారణాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పన్ను పాలన, సంబంధిత సబ్సిడీ పరిహారాలు వంటివి ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. వీటి వివరాలను ప్రభుత్వం నిర్వహించదు” అని తెలిపారు. ఇంధన ధరలను నియంత్రించాలంటే.. దీనిని కూడా జీఎస్టీ పరిధిలో చేర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనం అత్యధిక ఆదాయం తెచ్చే వనరుగా ఉంది. కనుక దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావంటున్నారు. ఇంధాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చే అంశంపై అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 “వస్తువులు,సేవల పన్ను”ను వివరిస్తుంది. అంటే వస్తువులు, సేవల సరఫరాపై పన్ను లేదా రెండింటి సరఫరాపై పన్ను విధించాలి. ఇక పెట్రోలియం వంటి ఉత్పత్తుల సరఫరా జీఎస్టీ పరిధిలోకి రాదు’’ అన్నారు. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ దీని గురించి ప్రతిపాదనలు చేస్తే.. అప్పుడు కేంద్రం ఇంధానాన్ని జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది అన్నారు. చదవండి: అధిక పెట్రో ధరలు భారమే అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
విద్యుత్ పథకానికి ‘వంద’నం
ఖమ్మం, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలు, దానికి తోడు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు అంతా తడిసి మోపెడు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి విద్యుత్ బిల్లు అంటేనే షాక్‌కొట్టినట్లవుతోంది. చేసిన కష్టం అంతా విద్యుత్ బిల్లు కట్టడానికే సరిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ఊరటనిచ్చే విధంగా ఉందన్న చర్చ ప్రజానీకంలో సాగుతోంది. నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం చేసుకున్న ప్రతి కుటుంబం రూ.100 బిల్లు చెల్లిస్తే చాలని, మిగిలిన చార్జీ ప్రభుత్వమే భరించే విధంగా పథకం ప్రవేశపెడతామని చెప్పడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలైతే జిల్లాలోని సుమారు 3,35,937 కుటుంబాలకు ఉపయోగం కాగా, జిల్లా వాసులకు సుమారు రూ.8.2కోట్లు ఆదా అవుతాయి. అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని, ఆరోజులకోసం ఎదురు చూస్తున్నామని జిల్లా ప్రజలు చెబుతున్నారు. మహానేత మరణం తర్వాత చార్జీల మోత... మహానేత వైఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అలా చేస్తే వైర్లపై బట్టలు ఆరవేయాల్సి వస్తుందని వెటకారంగా మాట్లాడిన టీడీపీ నాయకుల నోళ్లూ మూయించారు. పేదలపై భారం పడకుండా ఎఫ్ఏసీ చార్జీలను ప్రభుత్వమే భరించి పేదలకు నిరంతర విద్యుత్ సరఫరా చేశారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు, అదనపు లోడు చార్జీ...ఇలా అనేక ఆంక్షలు పెట్టి బిల్లులు వడ్డించి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరగ్గొట్టాయి. ‘వంద’ పథకంతో లబ్ధిపొందేది ఇలా.. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు సుమారు 8,62,000 మంది ఉన్నారు. ఇందులో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగించే కనెక్షన్లు 6,95,598 ఉన్నాయి. ఇందులో నెలకు 150 యూనిట్లలోపు విద్యుత్ వాడకం దారులు 3,35,937 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా నెలకు రూ.300 నుంచి రూ. 600 బిల్లు చెల్లిస్తుంటారు. ‘వంద’ పథకం అమలైతే... 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం ప్రతి కుటుంబం రూ.200 నుంచి 500 వరకు లబ్ధిపొందే అవకాశం ఉంది. జిల్లా ప్రజలకు రూ. 8.2కోట్ల ఆదా రూ. 100 లకే నెలకు విద్యుత్ సరఫరా పథకంతో జిల్లా ప్రజలపై సుమారు రూ. 8.2కోట్ల భారం తగ్గుతుంది. వివిధ విద్యుత్ చార్జీల రూపేణా జిల్లా ప్రజానీకం నెలకు సుమారు రూ.60కోట్లు చెల్లిస్తోంది. ఇందులో కేవలం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ ద్వారా రూ.13కోట్లు చెల్లిస్తున్నారు. 0నుంచి 50 యూనిట్లు వాడే వినియోగదారులు 70,478 మంది ఒక్కొక్కరు సుమారు నెలకు రూ. 250 మేరకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా 0నుంచి 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వినియోగదారులు 67,112 మంది ఒక్కొక్కరు నెలకు సుమారు రూ.500 మేరకు, 0నుంచి 150 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు 1,98,347 మంది ఒకొక్కరు నెలకు సుమారు రూ. 600వరకు చెల్లిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రకటన ప్రకారం 150 యూనిట్ల విద్యుత్ వినియోగం వరకు నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అది మొత్తం 3.36 కోట్లు అవుతుంది. అంతకంటే ఎక్కువ విద్యుత్ చార్జీ చెల్లించే వారితో సహా జిల్లాలో మొత్తం నెలకు రూ. 5కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 8.2కోట్ల ప్రభుత్వమే చెల్లిస్తుంది.