breaking news
shortly sarts
-
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్‌లోనే. దాంతో భారత్‌లో జెమ్ క్యాపిటల్‌గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్‌లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్‌చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్‌కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్‌కు ఆహ్వానించగా భారత్‌కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్‌లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్‌ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్‌ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్‌కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్‌హీట్‌ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్‌చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్‌ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్‌గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇకపై ప్రీపెయిడ్ కరెంట్!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విద్యుత్ బిల్లులు జారీ, వినియోగదారుల నుంచి వాటిని కట్టించుకోవడానికి ప్రత్యేక విభాగాల నిర్వహణ వంటి తల నొప్పులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చెక్ పెట్టనుంది. విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయనుంది. వినియోగదారులు ముందుగా రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు సరఫరా చేయాలని చూస్తోంది. దీనివల్ల బకాయిల బాధ కూడా తప్పుతోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, బడా పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోట్లలో బిల్లులు వసూలు కావాల్సి ఉంది. కొందరైతే కోర్టులకు వెళ్లి మరింత తాత్సారం చేస్తున్నారు. వీటన్నింటికీ ప్రీపెయిడ్ విధానమే సరైనదని, ఆ దిశగా నూతన విధానం అమలుకు విద్యుత్ సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రీ పెయిడ్ మీటర్లు అమర్చుతారు ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అమర్చిన మెకానికల్, ఎలక్ట్రానిక్ విద్యుత్ మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలకు బిగించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. దీని నిమిత్తం సంస్థ ఇప్పటికే సుమారు 10 వేల మీటర్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది. దుబారాకు కళ్లెం నూతన విధానంలో విద్యుత్ దుబారాకు కూడా కళ్లెం పడనుందని అధికారుల అభిప్రాయం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ విధానం ద్వారా డిస్కంలు నష్టాల నుంచి గట్టెక్కినట్టు సంస్థ ఉన్నతాధికారులు గుర్తించారు. అదే తరహాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను అమర్చడం ద్వారా విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. ఎవరికి కావాల్సినంత రీచార్జ్ వారు చేసుకుని విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తారని, తద్వారా దుబారా తగ్గుతుందని అంటున్నారు. సెల్ఫోన్లో రీచార్జ్ అయిపోయిన వెంటనే మాట్లాడుతుండగానే లైన్ ఎలా కట్ అయిపోతుందో ఈ కొత్త విధానంలో విద్యుత్ సరఫరా కూడా రీచార్జ్ అయిపోయిన వెంటనే సరఫరా నిలిచిపోతుంది. అందువల్ల వినియోగదారుడు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కొంత మొత్తం ఉండగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పనిచేస్తుంది.. పాత మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక మీటరును అమర్చుతారు. ఈ మీటరుకు ఒక సిమ్ కార్డును అనుసంధానం చేస్తారు. దీంతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎటువంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీటరుకు అయ్యే ఖర్చును పూర్తిగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థే భరిస్తుంది. ఈ విధానం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం వినియోగదారునికి లేకుండా, బిల్లు వసూలు అవుతుందా లేదా? అనే సందేహం సంస్థకు లేకుండా అటు వినియోగదారులకు, ఇటు సంస్థకు ఉభయతారకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.