బాక్సయిట్‌పై మహోద్యమం
బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఏజెన్సీవాసులు
ఆందోళన బాట పడుతున్నారు. పాడేరు, అరకు ఎమ్మెల్యేల సారధ్యంలో మహోద్యమానికి ఉద్యుక్తులవుతున్నారు. గురువారం పెదబయలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ప్రాణాలు పణంగా పెట్టయినా బాక్సైట్‌ను అడ్డుకుంటామని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. అసెంబ్లీలో బాక్సైట్ తవ్వకాల రద్దుపై తీర్మానం చేయాలని ఈశ్వరి డిమాండ్ చేశారు.
పెదబయలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన్యంలోని బాక్సైట్ జోలికొస్తే తరిమికొడతామని ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం పెదబయలు మండల కేంద్రంలో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కూడిలిలో రాస్తారోకో నిర్వహించారు. మన్యంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దానిని వెలికితీస్తే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని గిరిజనులకు తాగునీరు దొరకని దుస్థితి దాపురిస్తుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయన్నారు. గిరిజనులు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఖనిజాల తవ్వకాలపై జరుగుతున్న కుట్రలను గ్రామాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం కే ంద్రంతో చేతులు కలిపి బాక్సైట్ తవ్వకాలకు కుట్రపన్నుతోందన్నారు.
సీఎం చంద్రబాబునాయుడు అరకు ప్రాంతాన్ని దత్తత తీసుకుంటాననడం గిరిజనులపై ప్రేమ కాదని, ఇక్కడి ఖనిజాలను కొల్లగొట్టడానికి కుట్రపన్నుతున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు లంబసింగి ప్రాంతంపై కన్నేశారని అన్నారు. వీటిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జర్సింగి గంగాభవాని,వైఎస్సార్ సీపీ నాయకులు జర్సింగి సూర్యనారాయణ, సందడి కొండబాబు, పద్మాకరరావు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వంతాల అప్పారావు, కాతారి సురేష్‌కుమార్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సింహాచలం, గోమంగి ఎంపీటీసీ సభ్యుడు కూడ బొంజుబాబు పాల్గొన్నారు.