breaking news
Sensor system
-
సముద్రంలో ‘పవన విద్యుత్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే... సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన (విద్యుత్) ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించాల్సిన ఆవశ్యకతపై ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పటికే ఒక తీర్మానాన్ని కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్‌తోపాటు పవన విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కొండలు, మైదాన ప్రాంతాల్లోనే పవన విద్యుత్ ప్లాంట్లు ఉండగా.. కొద్దికాలంగా సముద్రంలోనూ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2026 నాటికి దాదాపు 20 గిగావాట్లు పవన విద్యుత్ సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం... 2021లో ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ కొత్తగా 93.6 గిగావాట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకు చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను నివారించడంలో సహాయపడుతోంది. మన దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 6 %గా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 గిగావాట్ల ఆన్‌షోర్ విండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ, గాలి విస్తరణ వేగం మందగించడంతో ఉత్పత్తి ఆశించినంతగా ఉండటం లేదు. 2012–2016 మధ్య 13 శాతంగా ఉన్న వార్షిక పవన విద్యుత్ సగటు వృద్ధి రేటు... 2016–21 మధ్య 5 శాతానికి తగ్గింది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విశ్లేషణ ప్రకారం ఈ వృద్ధి రేటు రానున్న దశాబ్దంలో 15శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో సముద్రతీరంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. నిర్వహణకు సెన్సార్ సిస్టమ్ భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సముద్రంలో ఏర్పాటు చేసే విండ్ పవర్ టరై్బన్లను బ్లేడ్లు, ఫైబర్ గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తారు. వందల అడుగుల పొడవు, అనేక టన్నుల బరువు ఉంటాయి. బ్లేడ్ల అంచులలో పగుళ్లు, రంద్రాల వల్ల టరై్బన్ విఫలమై, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో వాటిని పర్యవేక్షించడానికి ధ్వని ఆధారిత సెన్సార్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా బ్లేడ్లో వైర్లెస్ మైక్రోఫోన్లను ఆమర్చుతారు. దీనివల్ల సమస్యను వెంటనే గుర్తించి బాగుచేసే వీలు కలుగుతుంది. అంతేకాదు ఈ టరై్బన్లు తీరానికి దూరంగా ఉంటాయి. కాబట్టి రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీని వాడతారు. ఇతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికే ప్రాచుర్యంలోకి రాగా, మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన, చవకైన సహజ వనరులను వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అందులో సముద్రతీర గాలి మన దేశ విద్యుత్ వ్యవస్థకు ప్రధానమైనదిగా మారుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్‌కు ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టమ్ చార్జీల మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. -
సెన్సర్ చెక్!
ఐఐటీఎంఎస్ విధానంలో సిగ్నల్స్ 68 జంక్షన్లలో ‘బెల్’ సర్వే 4 25 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం సిగ్నల్స్‌తో సీసీ కెమెరాల అనుసంధానం 4 ప్రభుత్వానికి ప్రతిపాదనలు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు సెన్సర్ విధానం ద్వారా చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని విజయవాడలోనూ అందుబాటులోకి తేనున్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇది అందుబాటులోకి రానుంది. విజయవాడ సిటీ : రాజధాని నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పొరుగు ప్రాంతాలకు చెందిన వాహనాల రాకపోకలు కూడా గతం కంటే 50 శాతం మేర పెరిగాయి. ఇక్కడున్న ట్రాఫిక్‌కు తోడు బయటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్‌కు వెళ్లాలంటే అరగంట పైనే పడుతోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టం) విధానంలో సెన్సర్ పద్ధతిలో సిగ్నల్స్ పనిచేసేలా సమగ్ర ట్రాఫిక్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెట్రో నగరాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్‌లో పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ రూ.75 కోట్ల వ్యయంతో 200 సిగ్నల్ జంక్షన్లను ఆధునీకరించనున్నారు. విజయవాడలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు సర్వే జరిపి 68 జంక్షన్లలో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆవశ్యకతను గుర్తించారు. వాటిలో ముఖ్యమైన 25 ప్రాంతాల్లోని సిగ్నల్స్లోనే సీసీ కెమెరాలను అనుసంధానం చేయనున్నారు. బెల్ అధికారుల సర్వే ఆధారంగా పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే సెన్సర్ విధానంలో సిగ్నల్ వ్యవస్థను రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సీఎం సుముఖం ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగా ఉన్నారు. రాజధాని కావడంతో మంత్రులు, వారి శాఖల కార్యాలయాలు ఇక్కడికి తరలి రానున్నాయి. అదే జరిగితే ప్రస్తుత విధానంలో మరిన్ని ట్రాఫిక్ కష్టాలు తప్పవు. దీనిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలని ఇప్పటికే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కూడా దీనిపై సుముఖంగా ఉండటంతో త్వరలోనే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెపుతున్నారు. వచ్చే పుష్కరాల నాటికి ఈ విధానం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వారు పేర్కొంటున్నారు.