breaking news
Sarojinidevi
-
జస్టిస్ ఎన్వీ రమణకు మాతృవియోగం
-
జస్టిస్ ఎన్వీ రమణకు మాతృవియోగం
► నివాళులు అర్పించిన న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బంది ► నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ రమణ తల్లి నూతలపాటి సరోజినీదేవి (85) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయంత్రం ఆమె పార్థివ దేహాన్ని ఎస్ఆర్ నగర్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. సరోజినీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు సిబ్బంది జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈఎస్ఐ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ పొన్నవరానికి చెందిన గణపతి, సరోజినీదేవి దంపతులు. వారికి సుప్రీం న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణతో పాటు కుమార్తెలు రాణి, వాణి ఉన్నారు. పెద్ద కుమార్తె రాణి హైదరాబాద్‌లో, చిన్న కుమార్తె వాణి అమెరికాలో ఉంటున్నారు. అయితే ఇటీవలే తన కుమార్తెకు పాప జన్మించడంతో జస్టిస్ రమణ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం జస్టిస్ ఎన్వీ రమణ మాతృమూర్తి సరోజినీదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వైఎస్ జగన్ జస్టిస్ ఎన్వీ రమణ మాతృ వియోగం విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయమూర్తి ఇంటికి చేరుకుని పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్ టీవీ ఎండీ నరేంద్ర చౌదరి, టీడీపీ నేతలు కంభంపాటి రాంమోహన్‌రావులు కూడా నివాళులర్పించారు. -
కంటి ఆస్పత్రి ఖాళీ
- ‘సరోజినీ’లో చికిత్సకు ముందుకు రాని రోగులు సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్లు వికటించిన విషయం వెలుగుచూడడంతో రోగులు సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లేందుకు జంకుతున్నారు. క్యాటరాక్ట్ శస్త్రచికిత్స వికటించి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఐదుగురు బాధితులు మినహా ఇన్‌పేషెంట్ వార్డుల్లో మరెవరూ కన్పించడం లేదు. ఆస్పత్రి చరిత్రలో ఈ పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. కంటిచూపు మందగించడంతో గతనెల 30న ఆస్పత్రిలో 21 మంది క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోగా.. వారిలో ఏడుగురు కంటిచూపును కోల్పోయిన విషయం తెలిసిందే. కళ్లను శుభ్రం చేసే రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ బాటిల్లోనే కాకుండా ఆపరేషన్ థియేటర్లోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందని భావించిన అధికారులు ఈ నెల 1న ఎమర్జెన్సీ మినహా మిగిలిన ఏడు ఆపరేషన్ థియేటర్లను కూడా మూసేశారు. గత ఏడు రోజుల నుంచి ఎమర్జెన్సీకి వచ్చిన ఒకట్రెండు కేసులు మినహా.. ఇతర శస్త్రచికిత్స లేవీ జరగడం లేదు. రోగుల్లో సన్నగిల్లిన నమ్మకం సరోజినీదేవి కంటి ఆస్పత్రికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. రోజుకు సగటున 800 మంది వస్తుంటారు. 540 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ వార్డుల్లో నిత్యం 350-400 మంది చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 70-80 మంది కొత్త పేషెంట్లు అడ్మిట్ అవుతారు. రోజుకు 40-50 శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అయితే ఆపరేషన్లు వికటించిన నేపథ్యంలో గురువారం అత్యవసర విభాగం సహా ఓపీ, ఐపీ వార్డులన్నీ రోగుల్లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు కూడా వైద్యులపై నమ్మకం సన్నగిల్లింది. తమను ఇక్కడి నుంచి ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి షిఫ్ట్ చేయాలని బాధితుడు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న రోగులకు ఇప్పటివరకు చేయాల్సినదంతా చేస్తున్నామని, బయటి నుంచి నిపుణులను పిలిపించాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్గుప్తా పేర్కొన్నారు. నిలోఫర్‌లో ‘ఫంగస్’ సెలైన్ బాటిళ్లు తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సరఫరా చేసిన రింగర్ లాక్టిటెట్(ఆర్ఎల్) సెలైన్ వాటర్ బాటిల్లో ‘క్లెబ్సియల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు సరోజినీదేవి ఉదంతంతో తేలిన సంగతి తెలిసిందే. అదే కంపెనీకి చెందిన సెలైన్ బాటిల్లో ఫంగస్ ఉన్నట్టు వారం రోజుల కిందటే నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. దానిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ టీఎస్ఎంఐడీసికి లేఖ రాసినా అధికారులు స్పందించలేదు. తాజాగా సరోజినీదేవి ఆసుపత్రిలో బ్యాక్టీరియా వెలుగుచూడడంతో డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు గురువారం హడావుడిగా నిలోఫర్ ఆసుపత్రికి చేరుకొని 29 వేల సెలైన్ బాటిళ్లను సీజ్ చేశారు. ఈ ఆసుపత్రికి 38 వేల సెలైన్ బాటిళ్లు సరఫరా చేయగా.. వాటిలో ఇప్పటికే 9 వేల బాటిళ్లు ఉపయోగించారు. కంపెనీని వదిలి.. డాక్టర్లపై చర్యలా: టీజీడీఏ సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేయడం తగదని తెలంగాణ వైద్యుల సంఘం( టీజీడీఏ) ఉస్మానియా యూనిట్-2 ప్రతినిధులు డాక్టర్ రవీందర్‌గౌడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్, డాక్టర్ వినోద్‌కుమార్ లు స్పష్టంచేశారు. సరఫరా చేసిన కంపెనీని, నాణ్యతను పరిశీలించకుండా కొనుగోలు చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను వదిలి వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం సమంజసం కాదన్నారు. మందుల కొనుగోళ్లు, వాటి నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఎవరి నిర్లక్ష్యమిది!
సర్కారీ ఆసుపత్రుల అధ్వాన్న స్థితిగతుల గురించి, అక్కడ పేద రోగులకు ఎదుర వుతున్న సమస్యల గురించి... అవి ప్రాణాపాయానికి దారితీస్తున్న తీరు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కానీ ఉన్నతశ్రేణి ఆసుపత్రిగా పేరున్న సరోజినీదేవి కంటి ఆస్పత్రి సైతం అందుకు భిన్నంగా లేదని మరోసారి రుజువైంది. కంటి శుక్లాలకు చికిత్స చేయించుకుందామని వెళ్లిన 13మందికి ఇన్ఫెక్షన్ సోకగా... వారిలో ఏడుగురికి ఏకంగా చూపే కరువైందని బుధవారం వెల్లడైన వైనం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ మాదిరి ఘటన చోటు చేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. ఇదే ఆసుపత్రిలో ఆరేళ్లక్రితం కంటి శుక్లాల ఆపరేషన్లు జరిగిన ఏడుగురు కంటిచూపు కోల్పోయారు. తాజా ఉదంతంలో తమ తప్పేమీ లేదని, శస్త్ర చికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేయడానికి ఉపయోగించిన సెలైన్ బాటిళ్లలో క్లెబ్సియల్లా బాక్టీరియా ఉండటమే ఇందుకు కారణమని వైద్యులు సంజాయిషీ ఇస్తున్నారు. అటు వాటిని ఉత్పత్తి చేసిన సంస్థ, ఆ బాటిళ్లను కొనుగోలు చేసి ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) సైతం ఇలాగే చెబుతున్నాయి. అసలు ఇప్పుడు వెల్లడైన 13 కేసుల్లోనే ఇలా జరిగిందా...లేక అదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఇతరుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు తలెత్తాయా అన్నది స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఈ ఆసుపత్రికి వచ్చేవారిలో సాధారణంగా ఎక్కువమంది మారుమూల గ్రామాలనుంచి వచ్చే నిరుపేదలు, దిగువ మధ్య తరగతివారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికెళ్లాక సమస్యలేమైనా తలెత్తితే మళ్లీ హైదరాబాద్ నగరం రావడమన్నది వారికి కష్టం. లోపం తలెత్తితే తాము మందులు సరిగా వాడనందువల్ల జరిగిందనుకుంటారు. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే సరిపోతుందన్న ధోరణిలో ఉంటారు. ఇటు ఆసుపత్రి రికార్డుల్లో నమోదు చేసే అరకొర వివరాలు ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు ఏమేరకు ఉపయోగపడతాయో చెప్పలేం. సరోజినీదేవి కంటి ఆసుపత్రి దేశంలోనే పేరెన్నికగన్నది. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ కంటి వైద్యంలో అగ్రశ్రేణి సంస్థ. ఆ రంగంలో నిష్ణాతులుగా ఖ్యాతి పొందిన డాక్టర్ శివారెడ్డి వంటివారు దానికి నేతృత్వంవహించారు. అక్కడ ఏటా వేల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. అలాంటిచోట ఈ మాదిరి ఉదంతాలు చోటు చేసుకోవడం ఆ సంస్థకు మాత్రమే కాదు... ప్రభుత్వానికి కూడా తలవంపులు తెచ్చేదే. ఇప్పుడు ఇన్ఫెక్షన్కు కారణమైన క్లెబ్సియెల్లా బాక్టీరియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నట్టు సెలైన్ బాటిళ్ల ద్వారానే సోకిందా లేక ఇతరేతర మార్గాల ద్వారా రోగులకు సోకిందా అన్నది స్పష్టంగా చెప్పలేమని నిపుణులంటున్న మాట. దేనికీ లొంగని ‘సూపర్‌బగ్’గా గుర్తించిన ఈ బాక్టీరియా దాదాపు అన్ని ఆసుపత్రులలోనూ ఉంటుందని, దీనివల్ల రోగులకు కంటి ఇన్ఫెక్షన్లే కాక ఊపిరితిత్తులు, మెదడు తదితర భాగాలకు కూడా ప్రాణాంతక వ్యాధులు సోకుతున్నాయని వారంటున్నారు. ఈ బాక్టీరియాపై సాధారణ యాంటీబయా టిక్స్ కూడా పనిచేయవని చెబుతున్నారు. ఇప్పుడు వెల్లడైన ఉదంతంతోపాటే తమ తప్పేమీలేదని వెను వెంటనే ప్రకటించుకున్న ఆసుపత్రి బాధ్యులు ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లక్రితం ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్సలో ఉపయోగించే ఉపకరణాలను తగిన రీతిలో పరిశుభ్రం చేయకపోవడంవల్ల ముగ్గురికి ఇన్ఫెక్షన్ సోకి చూపు కోల్పోయారని ఒక విచారణలో తేల్చారు. అందుకు కారకుడని తేల్చిన వార్డ్ బాయ్ క్షయరోగి అని కూడా అనంతరకాలంలో బయటపడింది. ఒక ఆసుపత్రిలో ఈ పరిస్థితి తలెత్తడమే ఆశ్చర్యకరంకాగా ఆ తదనంతరమైనా అలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారన్నది ప్రస్తుత ఉదంతం నేపథ్యంలో సమీక్షించు కోవాలి. ఆసుపత్రి ప్రాంగణంతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహించే గదుల్లో గోడలు, ఫ్లోరింగ్ మొదలుకొని ట్రాలీలు, మైక్రోస్కోప్ లువంటి ఇతరత్రా ఉపకరణాలు సైతం లోపరహితంగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక సీసాలోని ద్రావణాన్ని పలుమార్లు తీయడం, వేర్వేరు రోగులకు ఉపయోగించడం లాంటి అలవాట్లవల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతారు. వీటన్నిటి విషయంలో ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూసే నిరంతర నిఘా వ్యవస్థ మన దగ్గర లేదు. ఫిర్యాదు లొచ్చిన సందర్భాల్లోనే తనిఖీలుంటున్నాయి తప్ప ఎప్పటికప్పుడు దాన్ని చూసేవారు ఉండటం లేదు. సరోజినీదేవి ఆసుపత్రి ఉదంతం వెల్లడయ్యాక గురువారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిపిన తనిఖీలో 29,000 కల్తీ సెలైన్ బాటిళ్లు, కల్తీ ఇంజక్షన్లు బయటపడ్డాయి. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే ఔషధాల్లో నాణ్యత సరిగా ఉండటం లేదన్న ఫిర్యాదులు ఈనాటివి కాదు. అడిగేవారు లేరన్న ధైర్యంతోనే ఇలా జరుగుతున్నదని నిపుణులంటున్నారు. సగటున భారత్‌లో లభించే ఏడు ఔషధాల్లో ఒకటి కల్తీదేనని రెండు అంతర్జాతీయ జర్నల్స్ వెల్లడిం చాయి. మార్కెట్లో చలామణిలో ఉన్న ఔషధాల్లో 4.5 శాతం నాసిరకమైనవని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) ఆమధ్య తెలియజేసింది. ఇందులో సింహభాగం ప్రభుత్వాసు పత్రులకు చేరుతున్నాయన్న విషయంలో ఎవరికీ అనుమానం అక్కరలేదు. ఎందుకంటే ఆసుపత్రులకు సరఫరా అయ్యే మందులైనా, ఇతర ఉపకరణాలైనా కొనుగోలు చేసే బాధ్యతను చూసే సంస్థల్లో వైద్యులకు లేదా ఆసుపత్రుల సూప రింటెండెంట్లకు చోటుండటం లేదు. ఆ సంస్థల్లో ఇంజనీర్ల పెత్తనం నడుస్తున్నదని చెబుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణా అంతే. కాంట్రాక్టుకిచ్చి చేతులు దులుపు కుంటున్నారు. ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్థ పరిస్థితులే రోగుల ప్రాణాలు తీస్తు న్నాయి. ప్రాణాంతకమైన వ్యాధులు కలగజేస్తున్నాయి. ఎలుకలు కొరికి, చీమలు కుట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎవరూ మరిచిపోలేదు. సరోజినీ దేవి ఆసుపత్రి ఉదంతంతోనైనా ప్రభుత్వాలు మేల్కొని దీన్నంతటినీ సరిచేయాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.