breaking news
Saravati
-
రాజా రాణీ రాకెట్ రోవర్
గమనం నదుల స్వగత కథనం నా పేరు శరావతి. నేనొక దాన్ని ఉన్నాననే సంగతి చాలామందికి తెలియదు. నేను ప్రయాణించే దూరం తెలిస్తే శరావతి కూడా ఓ నదేనా? బహుశా ఉప నదేమో అనే సందేహం రావచ్చు కూడా. నేను ఉపనదిని కాదు, ప్రధాన నదినే. అయితే చిన్న నదిని! ఎందుకంటే స్వయంగా సముద్రంలో కలుస్తాను, నాకు ఉపనదులున్నాయి. అంతే. రెండే రెండు జిల్లాలు... షిమోగా, ఉత్తర కన్నడ... పుట్టింది ఒక జిల్లా, సాగరంలో కలిసేది మరో జిల్లాలో... ఈ మధ్యలో మరో జిల్లా కూడా లేదు. నా ప్రయాణం 128 కి.మీ.లతో ముగుస్తుంటే నా పేరు పెట్టుకున్న రైలు మాత్రం కర్ణాటకలోని మైసూరు నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు 1212 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. శరం అంటే బాణం! నాకు ఆ పేరు ఎలా వచ్చిందంటే... స్థానికులు ఓ చక్కని కథనాన్ని వినిపిస్తారు. రాముడు సీతతోపాటు అరణ్యవాసం చేస్తున్న సమయంలో... వనవిహారం చేస్తుండగా సీతకు దాహం వేయడంతో రాముడు వింటిని సంధించి భూమిని చీల్చాడని, బాణం వేసిన చోట నీరు పైకి ఎగచిమ్మి అది తటాకంగా మారిందంటారు. అందుకే ఆ తటాకం నుంచి మొదలైన ప్రవాహానికి శరావతి అనే పేరు వచ్చింది. శరం అంటే బాణం. అంబుతీర్థం అనే పదానికి అర్థం కూడా బాణం వేసిన ప్రదేశం అనే అర్థం. నేను పుట్టిన ప్రదేశానికి అంబుతీర్థం అనే పేరు వెనుక ఉన్న కథనం కూడా ఇదే. అలా మొదలయ్యే నా ప్రయాణంలో ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్లే సరికి అల్లంత దూరంలో సముద్రం కనిపిస్తూ ఉంటుంది. గట్టిగా లెక్కేస్తే 30 కిలోమీటర్లకు మించదు. అయినా నేను ఎనిమిది వందల అడుగులకు పైగా ఎత్తులోనే ఉంటాను. ఇక సాగరాన్ని చేరాలంటే ఎక్కడో ఓ చోట నేలను చేరాల్సిందేనని దిక్కులు చూస్తూ గెరుసొప్ప చేరేసరికి... నా కోసమే అన్నట్లు నేల మాయమై లోయ కనిపిస్తుంది. అంతే ఒక్కసారిగా లోయలోకి దూకేస్తాను. అదే కర్నాటకలోని ప్రసిద్ధ జోగ్జలపాతం. నేను అత్యంత చిన్న నదిని, అయితే ఆ జలపాతానికి అత్యంత ఎత్తై జలపాతాల్లో ఒకటిగా రికార్డు ఉంది. ఇటీవలి కాలం వరకు భారతదేశంలో ఎత్తై జలపాతంగానూ, ప్రపంచంలో రెండవ ఎత్తై జలపాతంగానూ చెప్పుకునే వారు. ఇటీవల మేఘాలయలోని నోహకాలికాయ్ ఫాల్స్‌ను గుర్తించారు. ఇప్పుడా కిరీటం నోహకాలికాయ్ జలపాతానికి దక్కింది. దేశంలో పొరుగు రాష్ట్రాలు జోగ్ రెండవస్థానాన్ని అంగీకరిస్తాయి. కానీ కన్నడిగులు, మరీ ముఖ్యంగా నేను పుట్టిన షిమోగా జిల్లా వాసులు మాత్రం ఒప్పుకోరు. వారి మాటనూ తీసేయడానికి లేదు. ‘కుంచికల్ జలపాతం’ సవ్వడి నా చెవులను సోకుతూనే ఉంటుంది, జోగ్కంటే ఎత్తై జలపాతం కుంచికలేనంటూ ‘విరాహి’ నది నాతో చెప్తున్నట్లు అనిపిస్తుంటుందా సవ్వడి. అలాగే సీతానది నుంచి జాలువారే ‘బర్కానా జలపాతం’ కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే వాటి సవ్వడి నాకు ఏడాది పొడవునా వినిపించదే! ఎత్తై జలపాతాల కిరీటం జోగ్‌ను కాదని వాటికెలా దక్కుతుంది? అందుకే జాతీయ స్థాయిలో జోగ్నే గొప్పగా చెప్పుకుంటారు. పైగా నా ప్రవాహం అలా ఇలా ఉండదు. డెబ్బై మీటర్ల వెడల్పుతో నేలకు దూకుతాను. సింహ గర్జనను తలపిస్తూ... నేను నేలకు ఉరికే తొందరలో నేల ఎత్తుపల్లాలను దాటుకుంటూ నాలుగు పాయలుగా చీలిపోతాను. రసజ్ఞుల దృష్టి నిశితంగా ఉంటుందని ఒప్పుకోవాల్సిందే. జలపాతం తీరును నాలుగు రకాలుగా చెబుతూ ‘రాజా, రాణి, రాకెట్, రోరర్ ’ అని నాలుగు పాయలకు నాలుగు పేర్లు పెట్టేశారు. రాజా పాయ చాలా హుందాగా నేలను తాకుతుంటే, రాణి పాయ జాలువారుతున్న తీరు సుతిమెత్తగా, ఒయ్యారంగా అడుగులు వేస్తున్న నాట్యకారిణిని తలపిస్తుంది. రాకెట్ పాయలో నీరు ఎక్కువ మోతాదులో భూమిని చేరుతుంది కానీ పాయ చాలా సన్నగా ఉంటుంది. ప్రవాహవేగం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్‌ను గుర్తుచేస్తుంది. ఇక నాలుగో పాయ రోరర్... ఇది కూడా చిన్న పాయే... అయినా ఇది చేసే శబ్దం చిన్నది కాదు. ఈ చప్పుడు పులి గర్జనను పోలి ఉంటుందని ఈ పేరు స్థిరపడింది. నా ప్రవాహాన్ని ఇంత గొప్పగా చెప్పుకోవడానికి ‘నందిహోలె, హరిద్రావతి, మావినహోలె, హిల్కుంజి, యెన్నెహోలె, హుర్లిహోలె, నగోదిహోలె... ఉపనదులే కారణం. మాయలా కప్పేసే మబ్బులు! నా తీరాన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించనలవి కాదు. పశ్చిమ కనుమల పచ్చదనం, కొండల అంచులను తాకుతూ కదిలే మేఘాల నీలవర్ణం కలగలిసి కొత్తరంగును ఆవిష్కరిస్తుంటాయి. వర్షాకాలంలో మేఘాలు సమూహంగా వచ్చి వర్షిస్తున్నాయా అనిపిస్తుంది. తెల్లని నురగలతో నీటి ప్రవాహం... ప్రవాహ వేగానికి గాల్లోకి లేచే మంచుబిందువులు ప్రదేశాన్ని పొగమంచులా కప్పేస్తాయి. ప్రబంధ కవులు ఇక్కడికి వచ్చారంటే... గంగా మాత ఆకాశం నుంచి భూమాతను పరామర్శించడానికి వచ్చే క్రమంలో ఒలికిన తుషార, తుహిన, నీహారికల సమ్మేళనం... అంటూ బరువైన పదాలతో అందమైన భావాన్ని పద్యాలల్లేస్తారు. అంతటి అందమైన ప్రదేశమే మరి. ప్రాచ్యానికీ - పశ్చిమానికీ మధ్య... నా తీరం ఓ చారిత్రక ఘట్టానికి సాక్షి. చతుర్ముఖ బాసాడి జైన ఆలయాన్ని నిర్మించడానికి నిర్మాణ సామగ్రి చేరవేత నా మీదనే జరిగింది. పన్నెండవ శతాబ్దం నుంచి కన్నడిగ రాజ్యాన్ని పాలించిన హోయసల రాజులు హిందూత్వంతోపాటు జైనాన్ని కూడా ఆదరించారు. చతుర్ముఖ బాసాడి ఆలయంలో నలుగురు జైన తీర్థంకరుల విగ్రహాలున్నాయి. గ్రానైట్ మందిరం... ఇప్పటికీ చెక్కు చెదరలేదు కానీ మెరుపు తగ్గి రంగు వెలిసింది. పిల్లలు చూస్తే ఇదేంటి ఇలా పాతగా అంటూ ముఖం చిట్లించుకుంటారో ఏమో! ఇందులో చెన్నబైరదేవి విగ్రహం అసంపూర్తిగా ఉండిపోయింది. సాళ్వ వంశంలో గొప్ప పాలనదక్షత కలిగిన రాణి ఆమె. క్రీ.శ 1552 నుంచి 1606 వరకు పాలించిన చెన్నబైరదేవి మిరియాల రాణిగా పేరు తెచ్చుకుంది. పశ్చిమ తీరం నుంచి మేలు రకం మిరియాలను పశ్చిమదేశాలకు ఎగుమతి చేసి ఆ పేరు తెచ్చుకుంది. గెరుసొప్ప రాణిగా కూడా పిలుస్తారు. సాల్వ రాజుల రాజధాని గెరుసొప్ప. ‘నగర్ బస్తికెరి’గా పిలిపించుకున్న రోజుల్ని చూశాను. ఇది అందమైన వాణిజ్య కేంద్రం. సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాల వేదిక. హోన్నావర్ పెద్ద హార్బర్. అంతర్జాతీయ వాణిజ్య రవాణా కేంద్రం. మధ్య ప్రాచ్యం, పాశ్చాత్య దేశాలకు ఓడల్లో మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు రవాణా అయ్యేవి. గతం తాలూకు వైభవాన్ని తలుచుకుంటూ వర్తమానంలో నా చెంత చేరే కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. చిన్న నదినే, అయినా చేవ ఉన్న నదిని. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పుట్టిన ప్రదేశం: కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా, తీర్థహళ్లి గ్రామానికి సమీపంలోని అంబుతీర్థం. సాగర సంగమం: కర్నాటక రాష్ట్రంలోనే... ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర్ తీరం దగ్గర అరేబియా సముద్రంలో. ప్రవాహ దూరం: 128 కి.మీ.లు -
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
శివమొగ్గ,న్యూస్‌లైన్ : శివమొగ్గ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగా,భద్రతోపాటు శరావతి, దండావతి, వరదా, కుమద్వతి, మాలతి నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరదనీరు చుట్టుముట్టి పలు గ్రామాలతోపాటు భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. సొరబ తాలూకా ఆనవట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుమరికొప్ప గ్రామంలో కుండ పోత వర్షానికి ఓ ఇంటి గోడ కూలి మంజునాథ్(5) అనే బాలుడు మృతి చెందాడు. ఇదే తాలూకా చంద్రగుత్తి మండలంలో కమకూరు గ్రామనివాసి మున్నప్ప(50)వరదనీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. భద్రా జలాశయం నుంచి ముందుజాగ్రత్త చర్యగా నీటిని దిగువకు విడుదల చేయడంతో భద్రావతి పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కేఎస్ఆర్టీసీ బస్టాండు వెనుక భాగం నీట మునగడంతో వాహనరాకపోకలను మళ్లించారు. కవలుగుంది గ్రామంలోకి వరదనీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై గ్రామస్తులను సమీపంలోని పాఠశాలకు తరలించి అక్కడ గంజికేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాగర తాలూకా తమిడికొప్ప చెరువు పొంగి పొర్లింది. దీంతో చెరువు పక్కనే ఉన్న రహదారి నీటమునిగి వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శికారిపుర తాలూకా గౌరిహళ్ల చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో శికారిపుర-సొరబ ప్రధానరహదారి జలమయమైంది.సొరబ తాలూకాలో వరదానది పరవళ్లు తొక్కడంతో వందలాది ఎకరాల్లోకి వరదనీరు చొరబడి పంటలు నీటమునిగాయి. వరదల కారణంగా శివమొగ్గ తాలూకా గాజనూరులోని తుంగాజలాశయం కళకళలాడుతోంది. జలాశయంలోకి ఇన్‌ప్లో 61,131 క్యూసెక్కులుగా ఉండగా 60,352 క్యూసెక్కుల నీటిని హొస్పేట తుంగభద్రా డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు. భద్రా జలాశయం ఇన్‌ప్లో 44,665 క్యూసెక్కులుగా ఉండగా 61, 646 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాతహొన్నూరు సమీపంలోని తుంగా, భద్రా నది సంగమ స్థలం సముద్రాన్ని తలపిస్తోంది. లింగమనక్కి జలాశయ గరిష్టనీటిమట్టం 1819 అడుగులు కాగా ప్రస్తుతం 1816.75 అడుగులకు చేరుకుంది. 67,478 క్యూసెక్కులు డ్యాంలోకి వస్తుండగా 57,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జోగ్ జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది. 24గంటల వ్యవధిలో శివమొగ్గ తాలూకాలో 21.4 మిల్లీమీటర్లు, భద్రావతిలో 18.6, తీర్థహళ్లిలో 47.6, సాగరలో 16.8 , శికారిపురలో 5.6, సొరబలో 29.2, హొసనగర తాలూకాలో 82.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.