breaking news
Rs.450 crores
-
తెలంగాణకు రూ.450 కోట్ల కోత
పన్నుల వాటాకు గండి కొట్టిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో దాదాపు రూ.450 కోట్లు కోత పడింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల కావాల్సిన పన్నుల వాటాలో ఆ మేరకు గండి పడింది. ఇప్పటికే పథకాలకు నిధులను సర్దుబాటు చేసేందుకు తిప్పలు పడుతున్న సమయంలో పన్నుల వాటా కుదించటం తెలంగాణ ఆర్థిక శాఖను మరింత ఇరకాటంలో పడేసింది. రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాను కేంద్రం దామాషా ప్రకారం ప్రతి నెలా ఒకటో తారీఖున విడుదల చేస్తుంది. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% నిధులను పంపిణీ చేస్తుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రతినెలా దాదా పు రూ.1000 కోట్లు వాటా కింద విడుదలవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6000 కోట్లు పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి. ఇదే వరుసలో ఈ నెల కోటాలో విడుదల కావాల్సిన రూ.1000 కోట్లకు బదులు, కేంద్రం కేవలం రూ.550 కోట్లు విడుదల చేసింది. ఆశించిన అంచనాల మేరకు పన్నుల రాబడి లేనందునే ఈ నిధులకు కోత పడింది. ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలు ముందస్తు అంచనా ప్రకారం పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం.. వాస్తవ పన్నుల రాబడిని లెక్కగట్టి ఈ నెలలో నిధులకు కత్తెర వేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారిగా 45 శాతం నిధులు కోత పడటంతో రాష్ట్ర ఆర్థిక శాఖ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. రూ.2020 కోట్ల రైతు రుణమాఫీతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను ఈ నెలలోనే చెల్లించాలని సంకల్పించిన నేపథ్యంలో కేంద్రం నిధులు తగ్గిపోవటం ప్రభుత్వానికి అశనిపాతంగా మారింది. -
రూ.450 కోట్లతో ‘తెలంగాణ పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రవ్యాప్తంగా సమీకృత గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో టీఆర్ ఐజీపీగా ఉన్న ఈ పథకానికి ఇటీవల‘తెలంగాణ పల్లె ప్రగతి’గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.దీనికింద చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 450 కోట్లు వెచ్చించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా చేపట్టనున్న ఈ కార్యక్రమాల ప్రణాళికపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరినుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 150 మండలాల ఎంపిక సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకం అమలుకై రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) 150 మండలాలను సెర్ప్ అధికారులు ఎంపిక చేశారు. ఎంపికైన మండలాల్లో ఆదిలాబాద్ జిల్లాలో 30, మహబూబ్నగర్లో 30, కరీంనగర్లో 11, ఖమ్మంలో 17, మెదక్లో 17, నల్లగొండలో 13, నిజామాబాద్లో 5, రంగారెడ్డి జిల్లాలో 9, వరంగల్ జిల్లాలో 18 మండలాలున్నాయి. ఎంపికైన 150 మండలాల్లో మొత్తం 2,879 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 4,941 గ్రామాలు, 10,621 పునరావాస ప్రాంతాలు ఉన్నాయి. 6 వేలకు పైగా ఉన్న గ్రామ సమాఖ్యలను ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగస్వాములను చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇలా.. దళారుల బారిన పడి తమ పంటకు గిట్టుబాటు ధరను కోల్పోతున్న రైతులను ఆదుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు ఆదాయం పెంపు మార్గాలపై అవగాహన కల్పిస్తారు. లాభసాటి పద్ధతుల్లో వ్యవసాయానికి అనువైన మార్గాలను తెలపడంతోపాటు రైతులను బృందాలుగా ఏర్పరచి, వారి పంట ఉత్పత్తులను వారే స్వయంగా మార్కెటింగ్ చేసుకునేలా సదుపాయాలు కల్పించనున్నారు. గ్రామీణ ప్రజలు వారి హక్కులను సులువుగా పొందేందుకు వీలుగా పలు సేవలను అందుబాట్లోకి తేనున్నారు. ఏఎన్ఎంల ద్వారా మెరుగైన ఆరోగ్యసేవలందించనున్నారు. ఐసీడీఎస్ల ద్వారా మాతా శిశు సంరక్షణ కోసం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమాజానికి, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తొలగించేలా, పరస్పరం సహకరించుకునేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. అలాగే.. ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ‘మీసేవ’ తరహాలో ‘పౌర సేవా’ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మీసేవలో లభించే సేవలకు అదనంగా ఉపాధి హామీ, పెన్షన్ల పంపిణీ, ఫిర్యాదుల స్వీకరణ.. తదితర సేవలను కూడా అందించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుసంధానం చేసి ప్రభావవంతంగా పనులు జరిగేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.