breaking news
Rs 10 crore loan
-
రెండంకెల రంకె...
జాతీయ వృద్ధి రేటును మించి నమోదు చేస్తున్న రాష్ట్రం ⇒ రికార్డు స్థాయిలో పెరిగిన తలసరి ఆదాయం ∙పుంజుకుంటున్న వ్యవసాయ రంగం ⇒ 54 శాతం మందికి ఉపాధి వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనే.. ⇒ ప్రతి ఐదుగురు యువతలో ఒకరు నిరుద్యోగే! ∙తెలంగాణ ఆర్థిక–సామాజిక సర్వేలో వెల్లడి వృద్ధి రేటులో తెలంగాణ ఉరకలేస్తోంది. వరుసగా మూడో ఏడాది జాతీయ సగటును అధిగమించింది. తొలిసారిగా రెండంకెల వృద్ధిరేటు నమోదు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదు కాగా రాష్ట్రం 10.1 శాతం వృద్ధి రేటు సాధించడం గమనార్హం. వరుస కరువులతో గతేడాది వరకు కుంగిపోయిన వ్యవసాయ రంగం ఈ ఏడాది బాగా పుంజుకుంది. పరిశ్రమలు, విద్యుత్, వ్యాపారం, స్థిరాస్తి, సేవా రంగాలు మళ్లీ దూకుడు ప్రదర్శించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రాష్ట్ర జీఎస్డీపీ(స్థిర ధరల వద్ద) విలువ రూ.4.64 లక్షల కోట్ల నుంచి రూ.5.11 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం అంచనా వేస్తే.. రాష్ట్రం 13.7 శాతం వృద్ధితో రూ.6.54 లక్షల కోట్ల జీడీపీని నమోదు చేయనుంది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వృద్ధి రేటు దూకుడులో ప్రథమ, ద్వితీయ రంగాలు కీలక పాత్ర పోషించాయి. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఉపాధి రాష్ట్రంలో ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగమే అండగా నిలుస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 14.7 శాతమే అయినా 54 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది. జీఎస్డీపీలో 62 శాతం వాటా కలిగిన సేవల రంగం 28 శాతం మందికి ఉపాధినిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో సేవల రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి 73 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో సేవల రంగంపై ఆధారపడి 64 శాతం మంది ఉన్నారు. ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలకు సూచిక అయిన తలసరి ఆదా యంలో రాష్ట్రం దూసుకుపోతోంది. గతేడాది రూ.1,40,683 తో పోల్చితే ఈ ఏడాది 12.6% వృద్ధితో రూ.1,58,360గా నమోదైంది. గతేడాది జాతీయ తలసరి ఆదాయం రూ.94,178కాగా.. ఈసారి 10.2% వృద్ధితో రూ.1,03,818కు చేరనుంది. 2015–16 గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.రెండు లక్షలకుపైగా... సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు రూ.లక్షకు పైగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. 18 జిల్లాలు లక్ష లోపు, మరో 14 జిల్లాలు జాతీయ సగటు అయిన రూ.94,178 కన్నా తక్కువగా తలసరి ఆదాయాన్ని నమోదు చేశాయి. యువతలో ఐదింటఒకరు నిరుద్యోగే! రాష్ట్రంలోని పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగిత సగటు 2.7 శాతం ఉండగా... పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 6.1 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 1.2 శాతంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 30 శాతంగా ఉన్న యువతలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 96 శాతం యువతకు ఎలాంటి సాంకేతిక విద్య లేదు. పనిచేస్తున్న యువతలో 44 శాతం వ్యవసాయం, 15 శాతం ఉత్పత్తి, 11 శాతం వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర రుణ ప్రణాళిక లెక్కలు ఇవీ.. రాష్ట్రంలో 2015–16లో మొత్తంగా రూ.78,776.4 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,36,855.7 (174శాతం) కోట్లు ఇచ్చారు. రూ.27,800 కోట్ల పంట రుణాల జారీ లక్ష్యంగా పెట్టుకోగా రూ.23,400 కోట్లను మాత్రమే ఇచ్చారు. ఇక 2016–17లో మొత్తం రూ.90,776 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఇందులో రూ.29,101 కోట్లు (33 శాతం) పంట రుణాలున్నాయి. గాడిన పడ్డ వ్యవసాయం కరువుతో వరు సగా రెండేళ్ల పాటు రుణాత్మక (మైనస్) వృద్ధి సాధించిన వ్యవసాయం రంగం ఈ ఏడాది 26.3 శాతం వృద్ధితో మెరిసింది. 2012–13 తర్వాత వ్యవసాయ రంగంలో ఇదే అత్యధిక వృద్ధి రేటు. పనిచేసే వయసున్న జనాభాయే అధికం సకుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 2.39 కోట్ల మంది ఉపాధి వివరాలను వెల్లడించారు. అందులో 8.3 లక్షల మంది ఎలాంటి ఉపాధి, ఉద్యోగం లేదని తెలపగా.. మరో 18.89 లక్షల మంది విద్యార్థులు, 17.7 లక్షల మంది గృహిణులు ఉన్నారు. 15–19 వయసు గల జనాభాలో 8.84 లక్షల మంది ఎలాంటి పనిచేయడం లేదు. అయితే 85.5 లక్షల మంది తాము ఏయే రంగంలో ఉపాధి, ఉద్యోగం చేస్తున్నామనే వివరాలను వెల్లడించలేదు. పోస్టు గ్రాడ్యుయేట్లు 4 శాతమే సకుటుంబ సర్వే–2014 ప్రకారం రాష్ట్ర జనాభాలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), ఆపై విద్య అభ్యసించిన వారు 4 శాతమే. గ్రాడ్యుయేషన్ (డిగ్రీ స్థాయి) పూర్తి చేసినవారు 14 శాతం ఉన్నారు. 10 శాతం ఇంటర్మీడియట్, మరో 29 శాతం పదో తరగతి వరకు చదువుకున్నారు. 7 శాతం ప్రాథమిక విద్య పూర్తి చేయగా.. 2 శాతం మంది డిప్లొమా కోర్సులు చేశారు. మిగతావారు చదువుకోనివారు లేదా ప్రాథమిక విద్య పూర్తి చేయనివారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు.. 2.12 లక్షల మందికి ఉపాధి! నూతన పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ద్వారా గత జనవరి 24 వరకు రాష్ట్రంలో 3,327 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమలతో 2,12,033 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే 1,138 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా.. 405 పరిశ్రమల ఏర్పాటు చివరి దశలో ఉంది. అత్యధికంగా 361 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. 8,618 పరిశ్రమలు ఖాయిలా.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 8,618 పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి. ఇందులో 632 (7 శాతం) యూనిట్లను పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉండగా.. మిగతా వాటి పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చారు. -
దాచిన అప్పు.. 10 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: అప్పులు, వడ్డీల భారం రాష్ట్రాన్ని వణికిస్తోంది. సర్కారును సైతం ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే.. ఈసారి బడ్జెట్లో కొంతమేరకు అప్పులను దాచి పెట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో అప్పుల కుప్ప రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని బడ్జెట్లో ప్రస్తావించింది. కానీ ఇది రూ.1.50 లక్షల కోట్లు దాటే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. దాదాపు రూ.10 వేల కోట్ల అప్పును ప్రభుత్వం దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే కేంద్రం అమలు చేస్తున్న ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) అప్పులన్నీ రాష్ట్ర ఖజానాకు బదిలీ అయ్యాయి. దీంతో రూ.8,924 కోట్ల అప్పు రాష్ట్ర ఖాతాకు చేరింది. ఇటీవలే రిజర్వ్ బ్యాంకు మార్కెట్ బాండ్లను వేలం వేసి ప్రభుత్వం ఈ అప్పులను తీర్చింది. కానీ.. బడ్జెట్లో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. వీటితోపాటు మార్చి నెలలో ప్రభుత్వం తీసుకున్న రుణాలనూ ఇందులో చూపించలేదు. 2016–17 బడ్జెట్ సవరణల ప్రకారం.. రూ.1.14 లక్షల కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటికితోడు కొత్త బడ్జెట్లో ప్రస్తావించిన రూ.26 వేల కోట్ల ద్రవ్యలోటు మేరకు చేసే అప్పులన్నీ కలిపి.. రూ.1.40 లక్షల కోట్లుగా లెక్క తేల్చింది. కానీ ఇందులో జమ చేయకుండా వదిలేసిన అప్పులు కలిపితే రూ.1.50 లక్షల కోట్లకు చేరనుంది. రాష్ట్ర విభజన సమయంలో రూ.70 వేల కోట్లతో మొదలైన తెలంగాణ రుణ ప్రస్థానం మూ డేళ్లలోనే రెండింతలు దాటిపోయింది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట బడ్జెట్తో సంబంధం లేకుండా ప్రభుత్వం చేస్తున్న అప్పులు రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనున్నాయి. బడ్జెటేతర అప్పులు రూ.40 వేల కోట్లకు పైనే.. బడ్జెటేతర వనరుల ద్వారా గొర్రెల పెంపకం, చేపల పెంపకం, మైక్రో ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు సమీకరించి వీటికి ఖర్చు చేయాలనేది లక్ష్యం. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తు రుణాల చిట్టా రూ.31,453 కోట్లకు చేరింది. ఈ ఏడాది కొత్తగా రూ.40 వేల కోట్ల పూచీకత్తు రుణాలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం నేరుగా తమపై భారం పడకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నప్పటికీ.. వడ్డీ సహా అప్పులు తీర్చే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. దీంతో వడ్డీల చెల్లింపులు ఏటేటా భారీగా పెరిగిపోతున్నాయి. తలసరి అప్పు రూ.42,857 కోట్లు వడ్డీల చెల్లింపులు వచ్చే ఏడాది నుంచి సర్కారుకు తలకు మించిన భారంగా మారనున్నాయి. గత ఏడాది అప్పులపై వడ్డీలకు ప్రభుత్వం రూ.7,700 కోట్లు చెల్లించింది. 2017–18లో అప్పులపై చెల్లించే వడ్డీలకు రూ.11,138 కోట్లు అవసరమని ఖర్చుల పద్దులో ప్రస్తావించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 కోట్ల జనాభా ఉంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను పంచితే తలసరి అప్పు రూ.42,857 ఉంటుంది. కార్మిక, ఉపాధి, శిక్షణకు రూ.625 కోట్లు సాక్షి, హైదరాబాద్: కార్మిక సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాలకు 2017– 18 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.625.58 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు నిమిత్తం రూ.310.22 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.315.36 కోట్లు ఇచ్చింది. ఇందులో కార్మిక ఉపాధి కల్పన కోసం 155.94 కోట్లు, సామాజిక సర్వీసుల కోసం రూ.6.5 కోట్లు కేటాయించింది. కార్మికుల బీమా, వైద్య సేవల నిమిత్తం రూ.87.66 కోట్లు నిర్దేశించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ)ల కోసం రూ.8.35 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ మిషన్ కోసం రూ.39.28 కోట్లు కేటాయించింది. ఐటీఐ విద్యార్థుల కోసం తలపెట్టిన సంకల్ప్ పథకానికి రూ.24.20 కోట్లు కేటాయించింది. సివిల్ సప్లైస్కు కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ఈ సారి బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. తాజా బడ్జెట్లో ఈ శాఖకు నిర్వహణ పద్దు కింద రూ.27.21 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.1732.69 కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,200 కోట్లు కేటాయించింది. అంతకు మందు 2015–16 బడ్జెట్లో సైతం ఇదే మొత్తంలో బడ్జెట్ కేటాయించినా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉండింది. కాగా ఖర్చు మాత్రం బడ్జెట్ అంచనాలను దాటిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీపీఎల్ కుటుంబాలకు ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఈ శాఖ రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. 2015–16 బడ్జెట్లో కేటాయించింది రూ.2,200 కోట్లు కాగా, ఆ ఏడాది ఏకంగా రూ.3,800 కోట్లు ఖర్చయ్యాయి.