breaking news
Risk control
-
రిస్క్‌ను ఎదుర్కొనడం కంపెనీ డీఎన్ఏలోనే ఉండాలి
న్యూఢిల్లీ: రిస్కులను ఎదుర్కోవడమనేది కంపెనీల రోజువారీ డిఎన్ఏలోనే ఉండాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం.దామోదరన్ పేర్కొన్నారు. రిస్కులనేవి పెద్ద కంపెనీలకే కాదని, చిన్న సంస్థలూ వీటిని ఎదుర్కోవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. మోడల్ రిస్క్ కోడ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రిస్క్‌ల నిర్వహణలో ఈ కోడ్ ఆచరణాత్మక సాధనం (టూల్ కిట్) వంటిదని దామోదరన్ పేర్కొన్నారు. దేశీ పరిశ్రమల పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (జీఆర్ఎంఈ) కలిసి దీనికి రూపకల్పన చేశాయి. దామోదరన్ సారథ్యంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఈ కోడ్‌ను తీర్చిదిద్దింది. కోడ్ ప్రధానంగా రిస్క్ మేనేజ్మెంట్కు సంబంధించిన కీలక మూలసూత్రాలు, రిస్క్ నిర్వహణను అమలు చేయడం అనే రెండు కీలక అంశాల ఆధారంగా రూపొందింది. ఇది వ్యాపారాల నిర్వహణలో మార్గదర్శిగా నిలవడంతోపాటు.. అన్ని విభాగాలలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడంలో తోడ్పాటునిస్తుంది. కోడ్ ప్రధానంగా లిస్టెడ్, పబ్లిక్ అన్‌లిస్టెడ్, ప్రయివేట్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లను ఉద్ధేశించి రూపొందించారు. -
మెరుగైన రిస్క్ టూల్స్‌ను అనుసరించాలి
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) మెరుగైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్బీఎఫ్సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. నూతన నిబంధనలను 2020 డిసెంబర్ నుంచి కచ్చితంగా ఆచరించాలని నిర్దేశించింది. లిక్విడిటీ కవరేజీ రేషియోలో కనీసం 50 శాతం అధిక నాణ్యతతో కూడిన లిక్విడిటీ ఆస్తులను కలిగి ఉండాలని, 2024 డిసెంబర్ నాటికి 100%కి దీన్ని తీసుకెళ్లాలని ఆర్బీఐ పేర్కొంది. పారితోషికంపై కొత్త నిబంధనలు: విదేశీ, ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకుల్లో హోల్‌టైమ్ డైరెక్టర్లు, సీఈవోలకు చెల్లించే పారితోషికం విషయమై ఆర్బీఐ కొత్త నిబంధనలు తెచ్చింది. వేరియబుల్ పే (పనితీరు ఆధార చెల్లింపులు)ల్లో నగదు పరిమాణం 67 శాతానికి మించరాదని నిర్దేశించింది. ఉద్యోగులకు సంబంధించి సమగ్ర చెల్లింపుల విధానాన్ని బ్యాంకులు రూపొందించుకోవాలని, వార్షికంగా వాటిని సమీక్షించాలని పేర్కొంది. -
సిటీ ఆర్టీసీలో ఆపరేషన్ స్టార్ట్
♦ భద్రత వైపు ఆర్టీసీ బస్సు పయనం ♦ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై స్పెషల్ డ్రైవ్ ♦ అన్ని డిపోల్లో ప్రమాదరహిత వారోత్సవాలు ♦ ఉత్తమ సేవలకు పురస్కారాలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆర్టీసీ బస్సుల వల్ల అటు ప్రయాణికులకు... ఇటు ఇతర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్య లు చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. బస్సు ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలని భావిస్తోంది. వాస్తవంగా నగరంలో ఆర్టీసీ బస్సుల వల్ల నిత్యం ఎక్కడో ఒక చోట సమస్య ఏర్పడుతోంది. రోడ్డు ప్రమాదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఇష్టారాజ్యంగా సిగ్నల్ జంపింగ్, రోడ్డుమధ్యలోనే బస్సుల నిలిపివేత, హడలెత్తించే వేగం వంటి సంఘటనలు ఉంటూనే ఉన్నాయి. వీటికి చెక్‌పెట్టేందుకు ఆర్టీసీ ఉపక్రమించింది. తప్పిదాలకు పాల్పడే డ్రైవర్లలో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు, ప్రమాదాల నియంత్రణ చర్యలపై దృష్టి సారించింది. ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రమాదరహిత వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. నగరంలోని 28 డిపోల్లో రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు. రోడ్డు భద్రతా నిపుణులు, పోలీసులు, అధికారులు ఈ కృషిలో భాగస్వాములవుతారు. అదేసమయంలో ఉత్తమ సేవలు అందజేసిన వారికి పురస్కారాలను కూడా అందజేస్తారు. ప్రతిష్టకు విఘాతం... లారీ డ్రైవర్ల కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తున్న కొందరు ఆర్టీసీ డ్రైవర్ల వల్ల ప్రమాదాలు జరగడమే కాకుండా ఆర్టీసీ ప్రతిష్టకు సైతం విఘాతం కలుగుతోం ది. 2014–15 సంవత్సరంలో సిటీ బస్సుల వల్ల నగరంలో 280 ప్రమాదాల్లో 95 మంది మృత్యువాత పడ్డారు.78 మంది తీవ్రంగాను, 106 మంది స్వల్పంగాను గాయపడ్డారు. అలాగే 2015–16లో 219 ప్రమాదాలు జరిగాయి. 85 మంది చనిపోయారు. 49 మంది తీవ్రంగా, 85 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ‘ప్రమాదరహితమైన బస్సు ప్రయాణం’ అనే లక్ష్యంతో సిటీలో ఈ వారోత్సవాలు చేపట్టారు. ఈ వారం ఏంచేస్తారంటే ... ► మొదటి రోజు రవాణాశాఖ అధికారులు, నిపుణులు రోడ్డు భద్రతపై ప్రసంగిస్తారు. ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం. ► రెండవ రోజులో అన్ని డిపోల్లోను బస్సులను క్షు ణ్ణం గా తనిఖీ చేస్తారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణం గా ఉన్నాయా లేదా అనే అంశంపైన సమగ్రంగా దృష్టి సారిస్తారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందజేసిన మె కానిక్‌లను ప్రశంసించి పురస్కారాలను అందజేస్తారు. ► మూడవ రోజు అన్ని డిపోల్లో డ్రైవర్లకు పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వైద్య సేవలను అందజేస్తారు. ► 4వ రోజు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ వల్ల తాము నష్టపోవడమే కాకుండా ఇతరులకు సైతం నష్టం కలుగుతుందనే విషయం పట్ల అవగాహన కల్పిస్తారు. ► 5వ రోజు ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు హకీంపేట్ ట్రాన్స్‌పోర్టు అకాడమీలో ఒక రోజు శిక్షణనిస్తారు. ► 6వ రోజు డ్రైవర్స్ డే. ఉత్తమ సేవలందజేసిన వారికి నగదు పురస్కారాలు, సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ► 7వ రోజు రీజనల్ కార్యాలయాల్లో, జోనల్ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తారు. రోడ్డు భద్రతలో భాగంగా... ► బస్సు ఎక్కే ముందు ప్రతి డ్రైవర్ ప్రతి రోజు విధిగా భద్రతా సూక్తులను గుర్తు చేసుకొనే విధంగా ప్రోత్సహిస్తారు. ► అన్ని డిపోల్లోనూ గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఉత్తమ డ్రైవింగ్ అలవాట్లపైన అవగాహన కల్పిస్తారు. ► అన్ని డిపోల్లో బ్రీత్ ఎనలైజర్లను వినియోగించి మద్యం సేవించి విధులకు హాజరయ్యే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటారు. ► ప్రతి డ్రైవర్లో అవగాహన కల్పించే విధంగా రూపొందించిన లఘుచిత్రం ‘భద్రత’ను అన్ని డిపోల్లో ప్రదర్శిస్తారు. ► నిపుణుల ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలు ప్రతి రోజు ఉంటాయి. మూడేళ్లలో ఆర్టీసీ బస్సుల కారణంగా ప్రమాదాలు ఇలా.. సంవత్సరం ప్రమాదాలు మృతులు తీవ్రంగా స్వల్పంగా గాయపడ్డవాళ్లు శాతం 2013–14 287 112 92 89 0.09 2014–15 280 95 78 106 0.09 2015–16 219 85 49 85 0.07