అలక వీడేనా?
రాజీ పడనున్న సతీష్ జారకీహోళి
ఫలించని హోంశాఖ సలహాదారు దౌత్యం
తాజా పరిణామాలపై బెళగావిలో కాంగ్రెస్ ప్రముఖల సమావేశం
హాజరైన వివాదస్పద మంత్రి
ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని ప్రకటన
బెంగళూరు :రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి సతీష్ జారకిహోళి రాజీనామా నుంచి వెనక్కుతగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. బెళగావి శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకుల రాజీ యత్నాల ఫలితంగా మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అబ్కారీ శాఖపై మొదటి నుంచి సతీష్ జారకిహోళి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి తాను మంత్రపదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. దీంతో ఒక్క కాంగ్రెస్‌లోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ వెంటనే దీనిపై స్పందించింది. అందులో భాగంగా రాష్ట్ర హోంశాఖ సలహాదారుడైన కెంపయ్య బెళగావి జిల్లా గోకాక్‌లో ఉన్న సతీష్జారకీహోళి ఇంటికి బుధవారం ఉదయమే చేరుకుని ఆయనతో మాట్లాడి రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇందుకు సతీష్జారకీహోళి ఒప్పుకోలేదు. దీంతో ఆయన ఉస్సూరు మంటూ వెనుదిరిగారు. విషయం తెలిసిన వెంటనే సిద్ధరామయ్య సతీష్జారకిహోళికి ఫోన్ చేసి బెంగళూరు వచ్చి తనను కలవాల్సిందిగా సూచించారు. ఇందుకు సతీష్జారకి హోళి సమ్మతించారు. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకు బెళగావిలోని కాంగ్రెస్ పార్టీకు చెందిన శాసనసభ్యులతో పాటు ఇతర ప్రముఖ నాయకులు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశంలో సతీష్‌జారకిహోళి కూడా ఉన్నారు.
సీఎం సిద్దుతోపాటు పార్టీ వైఖరి పట్ల అసమ్మతి ఉంటే శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు చెప్పి పరిష్కరించుకుందామని సమావేశంలో పాల్గొన్న నాయకులు సతీష్ జారికిహోళికి నచ్చజెప్పారు. దీంతో రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. సమావేశం అనంతరం సతీష్‌జారకిహోళి సహోదరుడు, గోకాక్ శాసనసభ్యుడు రమేష్జారకిహోళి మీడియాతో మాట్లాడుతూ...‘సీఎం సిద్ధరామయ్య, సతీష్జారకీ హోళి ఎంతమంచి స్నేహితులో మీకు అందరికీ తెలుసు. స్నేహం ఉన్నచోటనే కొద్దిపాటి అలక కూడా ఉంటుంది. మనసుకు నచ్చని పనులు చేయలేనంటూ సతీష్‌జారకిహోళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయమై మేమంతా ఆయనకు నచ్చజెప్పాం. రాజీనామాను వెనక్కు తీసుకోవడానికి అంగీకరించారు. వేరే శాఖ కేటాయించే విషయం సీఎం సిద్ధరామయ్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
నా నిర్ణయం పార్టీకు నష్టం చేకూర్చకూడదు : సతీష్ జారకిహోళి
‘రాజీనామా చేసిన తర్వాత సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు డీ.కే శివకుమార్, మహదేవప్ప నాతో ఫోన్లో మాట్లాడారు. నా రాజీనామ వల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాని, కాంగ్రెస్‌పార్టీకు కాని నష్టం చేకూడదు. అయితే ప్రస్తుతానికి నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అయితే సీఎం సిద్ధరామయ్యతో గురువారం నేరుగా భేటీ అయ్యి చర్చించి అదే రోజు సాయంత్రానికి నా రాజీనామా విషయమై స్పష్టమైన నిర్ణయం వెళ్లడిస్తాను.’