కుక్క పిల్లతో బాలుడి పెళ్లి
జార్ఖండ్‌కు చెందిన ముకేశ్ కెరాయి అనే ఏడేళ్ల బాలుడికి కుటుంబ ఆచారం ప్రకారం జాతకం చూపించారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లో మొదటి భార్య చనిపోతుందని, రెండో పెళ్లి చేసుకొని జీవితంలో స్థిర పడతాడని గిరిజన పూజారి చెప్పారు. పైగా ముకేశ్ పై దవడకు అదనపు పన్ను మొలిచిందని, అది కూడా అపశకునమని సదరు పూజారి తేల్చారు.
దీనికి విరుగుడుగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఆ బాలుడికి ఆడ కుక్కపిల్లను ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నిజమైన పెళ్లి లాగానే ముకేశ్‌ను పెళ్లి కొడుకును తయారు చేయడమే కాకుండా ఆడ కుక్కపిల్లకు సంప్రదాయబద్ధమైన పెళ్లి కూతురు దుస్తులు తొడిగారు. పెళ్లి తంతు ప్రకారం ఊరేగింపు జరిపారు. పెళ్లి వేడుకల్లో గ్రామస్థులంతా పాల్గొని మందేసి చిందేశారు.
పిల్లల జాతకాలను చూపించడం, వాటి ప్రకారం నడుచుకోవడం తమకు అనాదిగా వస్తున్న ఆచారమని, ఎవరెన్ని చెప్పినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆచారాల ప్రకారమే తాము నడుచుకుంటామని ఆ బాలుడి తాత అశోక్ కుమార్ లెయాంగి (43) మీడియాకు తెలిపారు. జాతకాలు, మూఢ నమ్మకాల గురించి జార్ఖండ్ గిరిజనుల్లో చైత న్యం తీసుకరావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేస్తున్నా వారిలో పెద్దగా మార్పు రావడం లేదు.
గిరిజన కుటుంబాలు సాధారణంగా కుక్క పిల్లలతో పెళ్లిలాంటి పీడ విరగడ కార్యక్రమాలను ప్రతి ఏడాది జనవరి 15 నుంచి 21వ తేదీల మధ్య మాత్రమే నిర్వహిస్తారు. పాపం ఒక్క రోజు పెళ్లి కూతురు అవతారమెత్తి కడుపునిండా కూడా తిన్న కుక్కపిల్ల ప్రస్తుతం వీధుల్లోనే తిరుగుతోంది.