Regional Transport Officer
-
చలనమే విజయం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్‌కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.టెస్ట్ పాసైన మహిళగత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.మా జీవితాలు మారాయిడ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్‌తో ఒక టూ వీలర్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు. చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి. ‘కనావు’...అంటే ‘స్వప్నం’దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి. మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్‌ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది. -
హెచ్ఐవీ బాధితులా? డోంట్ వర్రీ.. సంబంధం చూసి పెడతారు
కొన్ని రకాల ఆరోగ్య సమస్యల పేరు పలకడానికి సైతం కొంతమంది సిగ్గుపడుతుంటారు. అలాంటిది ఆ రోగంతో బాధపడుతోన్న రోగికి మరో రోగి భాగస్వామి అయితే ఆ జంట మరికొంతకాలం సంతోషంగా జీవిస్తారని భావించిన అనిల్ వాలివ్ అలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లి సంబంధాలు కుదురుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నాడు. పుణేకు చెందిన యాభైఏళ్ల అనిల్ వాలివ్ ప్రస్తుతం డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి (ముంబై)గా పనిచేస్తున్నాడు. అది 2005... అనిల్‌కు ఎంతో ఇష్టమైన స్నేహితుడు హెచ్ఐవీ సోకి తన కళ్లముందే చనిపోవడం. అతని కొడుకుకి కూడా హెచ్ఐవీ సోకడం అనిల్‌ను ఎంతో బాధించింది. తన స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక... ‘‘హెచ్ఐవీ వచ్చినంత మాత్రాన అంతటితో జీవితం అయిపోదు. వాళ్లకు భాగస్వామి ఉంటే జీవితం మరికొన్నాళ్లపాటు బావుంటుంది’’ అన్న ఉద్దేశ్యంతో 2005లో పాజిటివ్ సాథి వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ప్రారంభంలో తన పైఅధికారులు కూడా ప్రోత్సహించడంతో వెబ్‌సైట్‌తోపాటు.. వివాహ వేదికలూ నిర్వహించేవాడు. అలా మొదలైన పాజిటివ్ సాథీ డాట్‌కామ్ క్రమంగా విస్తరించి నేడు వేలమంది పాజిటివ్ రోగుల పెళ్లిళ్లకు వారధిగా నిలుస్తోంది. బ్రెయిన్ సర్జరీ అయినప్పటికీ.. ఒకపక్క ఉద్యోగం... మరోపక్క సామాజిక సేవచేస్తోన్న అనిల్‌కు 2015లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేయించుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తరువాత కూడా సామాజిక సేవలో మరింత మునిగి పోయాడు. తాను చేసే సాయం సమాజం మెరుగుపడడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకుని హెచ్ఐవీ రోగులకు పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. హెచ్వీ రోగికి మరో హెచ్ఐవీ జతను జోడిస్తూ ఇప్పటిదాకా వేలమంది పెళ్లిళ్లకు సాయపడుతూనే ఉన్నాడు. అంటరానివారిగా చూస్తుండడంతో... ఆర్టీవో అధికారిగా అనేకమందిని కలుస్తుంటాడు అనిల్. ఒకరోజు రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి వస్తువులు రవాణా చేసే డ్రైవర్లకు ఉపన్యాసం ఇస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ట్రక్కు డ్రైవర్లలో దాదాపు అందరు హెచ్ఐవీ సోకిన వారే అని తెలిసింది. హెచ్ఐవీ అని తెలియగానే..కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు అంటరానివారుగా చూస్తూ, తమని వదిలేశారని అనిల్‌కు కన్నీటితో తమ బాధను వెళ్లబోసుకున్నారు డ్రైవర్లు. ముందునుంచి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తులపై ఉన్న సానుభూతితో...హెచ్ఐవీ సోకిన డ్రైవర్ల జాబితా తీసుకుని డాక్టర్ల దగ్గరకు వెళ్లి వారికి ట్రీట్మెంట్ అందించాలని కోరాడు. కొంతమంది ముందుకు రావడంతో వాళ్లతో డ్రైవర్లకు వైద్యం అందిస్తూ సామాజిక కౌన్సెలింగ్‌ను అందిస్తున్నాడు. వీరిలో ఆసక్తి ఉన్నవారికి జతను వెదికిపెడుతున్నాడు. ఎన్నిసైట్లు వెతికినా... పాజిటివ్ అమ్మాయిలకోసం ఎన్ని మ్యాట్రిమొనీ సైట్లు వెతికినా ఎక్కడా హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సంబంధాలు చూసే సైటు ఒక్కటీ కనిపించలేదు. దీంతో తనే స్వయంగా సైటుని ప్రారంభించాలనుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రులలోని హెచ్ఐవీ రోగుల డేటాను సేకరించాడు. వారి అనుమతితోనే positivesaathiను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సైట్లో కొన్ని వేలమంది తమ జతకోసం రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. ఇప్పటిదాకా మూడు వేలమందికిపైగా ఈ సైట్ ద్వారా వివాహం చేసుకున్నారు. అర్ధంతరంగా పోకుండా.. సైట్ నిర్వహణ అంత సులభంగా లేదు. కొంతమంది నకిలీ ప్రొఫైల్స్ తో రిజిస్టరు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లన్నీ సరిచూసుకోవడం కష్టం. ఎక్కువమంది తమ కులానికి చెందిన వారిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పాజిటివ్ రోగులకు జతను వెతికే పనిలో నేను బిజీగా ఉన్నాను. ఇలా పెళ్లిళ్లు జరిగితే హెచ్ఐవీ వ్యాప్తి కొంతవరకైనా నిరోధించవచ్చవచ్చు. వాళ్లు అంటరాని వాళ్లలా అర్ధంతరంగా చనిపోకుండా, కొంతకాలం అయినా తోడుతో ఆనందంగా జీవిస్తారు. – అనిల్ వాల్వి -
ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఆర్టీవో ఇంటిపై ఏసీబీ దాడులు
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం మెరుపు దాడి చేశారు. అక్రమంగా ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఒంగోలు ఆర్టీవో రాంప్రసాద్ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లపైనా ఏకకాలంలో ఏసీబీ దాడులకు దిగింది. ఒంగోలులోని ఆయన నివాసంతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రసాద్ తన కార్యాలయంలో హోంగార్డు, ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లకు తెరలేపారు. దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఒంగోలు అపార్టుమెంట్లో దొరికిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది.