breaking news
RBI Savings Bonds
-
బ్యాంకింగ్‌లో రికవరీ షురూ
ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను (ఎఫ్ఎస్ఆర్) విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థూల ఎన్పీఏలు తగ్గుముఖం పట్టాయని నివేదిక వెల్లడించింది. పదకొండు బ్యాంకులను పీసీఏ చట్రం కిందకు తీసుకురావడంతో బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణ వచ్చినట్లయిందని తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ దిగ్గజాల ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువ ఫోకస్ పెడతామని సూచించింది. మొండిపద్దులు తగ్గుతున్నాయ్ ఎఫ్ఎస్ఆర్ ప్రకారం... గత మార్చిలో 11.5 శాతం ఉన్న బ్యాంకుల స్థూల ఎన్పీఏలు సెప్టెంబర్ నాటికి 10.8 శాతానికి దిగివచ్చాయి. ఇదే కాలంలో పీఎస్‌యూ బ్యాంకుల జీఎన్‌పీఏలు 15.2 నుంచి 14.8 శాతానికి తగ్గాయి. ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏలు 4 నుంచి 3.8 శాతానికి పరిమితమయ్యాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే మార్చినాటికి బ్యాంకులన్నింటి స్థూల ఎన్పీఏలు 10.3 శాతానికి, పీఎస్‌బీల జీఏన్పీఏలు 14. 6 శాతానికి, ప్రైవేట్ బ్యాంకుల జీఎన్‌పీఏలు 3.3 శాతానికి తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నికర ఎన్పీఏలు గత మార్చిలో 6.2 శాతం ఉండగా మార్చినాటికి 5.3 శాతానికి పతనమయ్యాయి. 2015 అనంతరం అటు స్థూల, నికర ఎన్‌పీఏల్లో అర్ధవార్షిక తరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి. రిస్ట్రక్చర్డ్ స్టాండర్డ్ అడ్వాన్సుల (ఆర్ఎస్ఏ) నిష్పత్తి సెప్టెంబర్ నాటికి 0.5 శాతానికి పతనమైందని, ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి (పీసీఆర్) 51 శాతానికి పెరిగిందని, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ నిష్పత్తి (సీఆర్ఏఆర్) 13.7 శాతానికి వచ్చిందని నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌నాటికి బ్యాంకు పోర్టుఫోలియోల్లో పెద్ద రుణఖాతాలు 54.6 శాతానికి, బ్యాంకుల జీఎన్పీఏల్లో బడా బకాయిల వాటా 83.4 శాతానికి చేరాయని వివరించింది. ‘‘ప్రస్తుత ఎన్పీఏలు అధికమే. కానీ తరుగుదల రేటును పరిశీలిస్తే ఇవి మరింత దిగొస్తాయనిపిస్తోంది. నిజానికి ఎన్పీఏ అంశంలో ఈ మెరుగుదల చాలదు. పీఎస్‌యూ బ్యాంకుల నిర్వహణా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీనికోసం మరిన్ని పాలనా సంస్కరణలు తీసుకురావడం, బలహీన పీఎస్బీలకు రీక్యాప్ సాయం అందించడం తదితర చర్యలు అవసరం’’ అని దాస్ చెప్పారు. ఎన్పీఏలను గుర్తించే ప్రక్రియతో పీఎస్బీల్లో రిస్క్ మేనేజ్మెంట్ మెరుగుపడిందన్నారు. క్రమశిక్షణ తెచ్చిన పీసీఏ ఇరవై పీఎస్బీల్లో 11 బ్యాంకులను పీసీఏ (స్పష్టమైన దిద్దుబాటు చర్యల) పరిధిలోకి తీసుకురావడం మంచిదయిందని దాస్ అభిప్రాయపడ్డారు. క్రెడిట్ అంచనా, మార్కెట్ రిస్కు అంచనాలకు సంబంధించి పీసీఏ కారణంగా బ్యాంకుల్లో క్రమశిక్షణ వచ్చిందన్నారు. దివాలా చట్టం కింద చేర్చిన కేసుల్లో కొంత జాప్యం జరుగుతున్నా, ఈ చట్టం కారణంగా విత్త క్రమశిక్షణ వస్తుందన్నారు. గత నాలుగు త్రైమాసికాల్లో పీసీఏ కారణంగా 11 పీఎస్‌బీల సాల్వెన్సీ నష్టాలు 73,500 కోట్ల రూపాయల నుంచి 34,200 కోట్ల రూపాయలకు దిగివచ్చాయిని ఆర్బీఐ నివేదిక తెలిపింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, స్థూల స్థిర మూలధన ఏర్పాటులో వృద్ధి కారణంగా ఎకానమీలో వృద్ధి ముందుకే సాగుతుందని దాస్ అంచనా వేశారు. వాణిజ్య భయాలు తగ్గుతున్నాయన్నారు. ఎఫ్‌సీలపై డేగ కన్ను భారీ ఆర్థిక సామ్రాజ్యాల (ఎఫ్‌సీ) విత్త స్థిరత్వంలో రిస్కును ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం ఎత్తిచూపిందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. వీటిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఎఫ్‌సీల్లో కచ్చితమైన రిస్కులుండేందుకు పలు అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఎఫ్సీల స్థితిగతులను ఐఆర్ఎఫ్– ఎఫ్‌సీ పర్యవేక్షిస్తోంది. ఐఆర్ఎఫ్ పర్యవేక్షణ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఉన్నా, మరింత మెరుగుదల అవసరమని నివేదిక తెలిపింది. ఇకపై అన్ని ఎఫ్‌సీలు త్రైమాసికానికొకసారి తమ వద్ద జరిగిన ఇంటర్‌గ్రూప్ లావాదేవీల డేటాను సమర్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎఫ్‌సీలకు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు ఇచ్చే రేటింగ్ ప్రమాణాలపై సెబీ తీసుకువచ్చిన మార్పులు అవసరమని తెలిపింది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు... ∙ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో భారత బహిర్గత రుణభారం 3.6 శాతం తగ్గి 52,970 కోట్ల డాలర్ల నుంచి 51,040 కోట్ల డాలర్లకు చేరింది ∙2017 సెప్టెంబర్‌తో పోలిస్తే గత సెప్టెంబర్ నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బాలెన్స్ షీటు 17.2 శాతం పెరిగి 26 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో ఈ రంగ నికర లాభంలో 16.2 శాతం వృద్ధి నమోదయింది. ఎన్బీఎఫ్సీ రంగ స్థూల ఎన్పీఏలు 5.8 శాతం నుంచి 6.1 శాతానికి విస్తరించాయి. లోన్సు, అడ్వాన్సుల్లో వరుసగా 16.3, 14.1 శాతం పెరుగుదల నమోదయింది. ∙విత్త వ్యవస్థలోని మొత్తం ఆర్థిక లావాదేవీల్లో(ఆర్థిక సంస్థల మధ్యన జరిగే లావాదేవీలు– బైలేటరల్ ఎక్స్పోజర్స్) బ్యాంకుల ద్వైపాక్షిక విత్త లావాదేవీల వాటా 46.5 శాతానికి చేరింది. విత్త వ్యవస్థలో ఇలాంటి ద్వైపాక్షిక విత్తలావాదేవీలు అవసరం, కానీ కొన్ని సార్లు ఈ తరహా లావాదేవీలు అనుకోని రిస్కులు వ్యాపించేందుకు కారణమవుతుంటాయి. ∙నియంత్రణా సంస్థల మధ్య మరింత సహకారం అవసరం. నియంత్రణా సంస్థలు కలిసికట్టుగా పనితీరు కనబరిస్తే చట్టాల్లోని లోపాలను అడ్డుపెట్టుకొని ఆటలాడే సంస్థల ఆట కట్టించవచ్చు. -
రిస్క్ లేకపోతే డెట్ బెటర్
రానున్న కాలంలో వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయన్న స్పష్టమైన సంకేతాలు ఆర్బీఐ నుంచి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి తోడు వృద్ధిరేటు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు తీసుకొంటుండటంతో వడ్డీరేట్లు ఇక తగ్గడమే కానీ పెరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమైంది. ఇటువంటి తరుణంలో మార్కెట్లో ఉన్న వివిధ డెట్ పథకాలు, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. ఈక్విటీ మార్కెట్లు ఒకపక్క దూసుకుపోతూ... నూతన గరిష్ట స్థాయిలు చేరుతున్నా... ఇప్పటికీ చిన్న ఇన్వెస్టర్లు దూరంగానే ఉంటున్నారు. దీనికి కారణం స్టాక్ మార్కెట్ పెట్టుబడులనేవి తీవ్ర ఒడిదుడుకుల లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా, గత అనుభవాలు ఇంకా మది నుంచి తొలగకపోవడమే. ఇలా రిస్క్ చేయలేని వారికి డెట్ పెట్టుబడులు అనువైనవి. వీటిల్లో కూడా రిస్క్ సామర్థ్యం ఆధారంగా పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల దగ్గర నుంచి ఆల్ట్రా షార్ట్‌టర్మ్ వరకు అనేక రకాల పెట్టుబడి సాధనాలున్నాయి. బ్యాంకు డిపాజిట్లు ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇవి అనువైనవి. ఇప్పటికే పలు స్వల్పకాలిక డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. రానున్న కాలంలో వడ్డీరేట్లు ఇంకా బాగా తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు దీర్ఘకాలిక డిపాజిట్లపై 8-9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. వడ్డీరేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉండటంతో ఇప్పుడు డిపాజిట్ చేసేవాళ్లు దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకోవడం ఉత్తమం. ప్రభుత్వ బాండ్లు వివిధ ప్రభుత్వ సంస్థలు వాటి అవసరాల కోసం దీర్ఘకాలిక బాండ్లను జారీ చేస్తుంటాయి. ఇవన్నీ రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. కనీస ఇన్వెస్ట్మెంట్ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటాయి. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బాండ్స్, ఇన్ఫ్రా, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అన్నీ వీటి కోవలోకే వస్తాయి. అలాగే హడ్కో, సిడ్బి వంటి సంస్థలు ఎప్పుడూ డిపాజిట్లను స్వీకరిస్తూనే ఉంటాయి. సాధారణంగా వీటి వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితి దాటిన వాటిపై వడ్డీరేటు 6%పైన ఉంది. ప్రైవేటు బాండ్లు వివిధ కంపెనీలు బాండ్లు, డిపాజిట్ల ద్వారా నిధులు సేకరిస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కంపెనీల చట్టం కంపెనీల డిపాజిట్ల సేకరణపై ప్రభావం చూపనుంది. బ్యాంకుల వలే కంపెనీలు కూడా సేకరించే డిపాజిట్లకు బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆ చట్టంలో నిర్దేశించింది. కంపెనీల డిపాజిట్లకు బీమా ఇచ్చే పథకాలు ఇపుడు అందుబాటులో లేకపోవడమే అసలు సమస్య. ఈ దిశగా బీమా కంపెనీలు కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. ఇది పూర్తిస్థాయిలో అమలైతే ఇక కార్పొరేట్ డిపాజిట్లు, బాండ్లు కూడా అత్యంత ఆకర్షణీయంగా మారతాయనడంలో సందేహం లేదు. సాధారణంగా కార్పొరేట్ డిపాజిట్లపై వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్ల కంటే కొద్దిగా అధికంగా ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కేంద్ర ప్రభుత్వం స్వల్ప, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్బీఐ ద్వారా వివిధ రూపాల్లో నగదును సేకరిస్తుంది. ఇందులో ప్రధానమైనవి గవర్నమెంటు సెక్యూరిటీస్(జీ-సెక్), ట్రెజరీ బిల్లులు. దీర్ఘకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని సెక్యూరిటీస్ అనీ, రోజులు, నెలలు, సంవత్సరం లోపు కాలపరిమితి ఉండే స్వల్పకాలిక అవసరాల కోసం విడుదల చేసే వాటిని ట్రెజరీ బిల్లులనీ అంటారు. సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. వీటిల్లో ఫైనాన్షియల్ సంస్థలైన పీపీఎఫ్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలవు. రిటైల్ ఇన్వెస్టర్లు పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ అందించే గిల్ట్ ఫండ్స్ అవకాశాన్ని కల్పిస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం రూ.2 లక్షలుండాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం డెట్ ఫండ్స్.. పైన పేర్కొన్న చాలా డెట్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ వీటిల్లో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనం పొందే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల డెట్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి రాబడులనేవి వడ్డీరేట్ల కదలికలపై ఆధారపడి ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగేటప్పుడు కొన్ని పథకాలు అధిక రాబడులను అందిస్తే మరికొన్ని వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు లాభాలను అందిస్తున్నాయి. వీటిని నేరుగా ఆయా మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్స్ లేదా స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే పన్ను ప్రయోజనాల పరంగా డెట్ ఫండ్స్ అనువైనవి. ఇప్పుడు వివిధ రకాల డెట్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలమైనవేనా అనే అంశాలను తెలుసుకుందాం. గిల్డ్ ఫండ్స్: ఇవి కేవలం గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అంత అనుకూలం కాదు. వీటిల్లో వడ్డీరేట్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు ఇవి అధిక లాభాలను అందిస్తాయి. ఒకసారి ట్రెండ్ మారి వడ్డీరేట్లు పెరుగుతుంటే వీటి నుంచి తక్షణం వైదొలిగే ప్రయత్నం చేయాలి. ఇన్కమ్ ఫండ్స్: వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు అధిక రాబడులను అందించే వాటిలో ఇన్కమ్ ఫండ్స్ ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అన్నిరకాల డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఈ పథకాలకు ఉంది. డైనమిక్ బాండ్స్, ఫ్లెక్సీ డెట్ ఫండ్స్ ఈ కోవలోకే వస్తాయి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలపరిమితి గల డెట్ ఫండ్స్‌ను షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. వడ్డీరేట్లు తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించే తరుణంలో ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్: స్వల్ప కాలిక ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ఎటువంటి లాకిన్ పీరియడ్ లేకపోవడం, బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ అధికం. కానీ, వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు పైవాటితో పోలిస్తే వీటి రాబడి తక్కువ. లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్: వడ్డీరేట్లు బాగా తగ్గే అవకాశాలున్నప్పుడు వీటి రాబడులు క్షీణిస్తాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి దూరంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఫిక్స్డ్ మెచ్యూర్టీ ప్లాన్స్ (ఎఫ్ఎంపీ): వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఫిక్స్డ్ మెచ్యూర్టీ ప్లాన్ (ఎఫ్ఎంపీ)లు అనువుగా ఉంటాయి. వడ్డీ రేట్ల కదలికల వల్ల వచ్చే రిస్క్ లేకుండా ఒక పరిమిత కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.