breaking news
Rao balasarswathi devi
-
గాన సరస్వతి
పువ్వుకు రాగం అబ్బితే ఎలా ఉంటుంది? ఆ పువ్వు స్వరాన్ని ఎలా సవరించుకుంటుంది? ఆ తావి గానాన్ని ఎలా శ్రుతి చేసుకుంటుంది? అక్షరాలను పూలరెక్కల్లా పొదివి పట్టుకుంటుంది. సరిగమలు కందకుండా సున్నితంగా గానం చేస్తుంది. ఆ గాన సరస్వతి... మన రావు బాలసరస్వతీదేవి. పువ్వు పాడితే ఎలా ఉంటుందో... రావు బాలసరస్వతీదేవి పాట వింటే తెలుస్తుంది. హైదరాబాద్, మణికొండలోని గాయత్రి ప్లాజాలో ఆమె ఫ్లాట్ గోడలు ఆ గానసరస్వతి రాగాలను నిత్యం వింటుంటాయి. తొంభై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో రాగం శ్రుతి తప్ప లేదు. తొంభై ఏళ్లుగా సాగుతున్న సాధనతో ఆ స్వరం అద్దుకున్న తియ్యదనం అది. పారిజాత పువ్వులాంటి మృదుత్వం ఆమె రాగానిది. ఆ గొంతు సన్నజాజి మొగ్గలా పరిమళం వెదజల్లుతోందిప్పటికీ. ఆ సుమధుర గానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తొమ్మిది దశాబ్దాల ఆమె సంగీత సేవను గౌరవిస్తోంది. నవంబర్ ఒకటవ తేదీన (రేపు) ఆమె వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. గ్రామఫోన్ నుంచి సీడీల వరకు సరస్వతి నాలుగవ ఏట నుంచి వేదికల మీద పాడుతున్నారు. ఆరవ ఏట హెచ్.ఎం.వి కంపెనీ ఆమె పాటను గ్రామఫోన్‌లో రికార్డు చేసింది. తెలుగు సినిమాలో తొలి నేపథ్య గాయనిగా రికార్డు ఆమెదే. ఆకాశవాణి కేంద్రాలు మద్రాసు, విజయవాడ స్టేషన్ల కోసం ప్రారంభగీతం పాడిన రికార్డు కూడా ఆమెదే. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు సింహళ గీతాలనూ ఆలపించారు. బాలనటిగా, బాల గాయనిగా సినీరంగం ఆమెను గారం చేసింది. పేరు ముందు ‘బాల’ను చేర్చింది. కర్ణాటక సంగీతం, హిందూస్థానీ సంగీతాలు సాధన చేసింది. సినిమా షూటింగ్‌ల కారణంగా స్కూలుకెళ్లడం కుదరకపోవడంతో ఆమె చదువు కోసం ట్యూటర్ ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆమెకు ఇంగ్లిష్ నవలలు చాలా ఇష్టం. ఆ అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గ్రామఫోన్ రికార్డుల కాలం నుంచి క్యాసెట్ టేప్‌లో రికార్డ్ చేసే టెక్నాలజీని చూశారు. సీడీలు, ఎంపీత్రీలనూ చూశారు. టెక్నాలజీతోపాటు అప్డేట్ అవుతూ వచ్చారు. కానీ, సినిమా సంగీతం, సాహిత్యంలో వచి్చన భాషాపరంగా విలోమమవుతున్న ప్రమాణాలను అంగీకరించలేకపోయారు. సినిమా అంటే శక్తిమంతమైన వినోదసాధనం. పిల్లలు, యువతకు మానసిక వికాసం, మేధో వికాసంతోపాటు వాళ్ల అభివృద్ధికి... వినోదం అనే సాధనంతో బాటలు వేసే గొప్ప కళామాధ్యమంగా ఉండాలి సినిమా. అంతే తప్ప విలువలను దిగజార్చుకునే సాధనం కాకూడదని చెబుతారామె. రెండు వేలకు పైగా పాటలు పాడిన ఈ సంగీత సరస్వతి ఈ రోజుల్లో పాటల సాహిత్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాట కలిపింది ఇద్దరినీ! చెన్నై (మద్రాసు) లో పుట్టి పెరిగిన బాల సరస్వతి పెళ్లి తర్వాత కోడలిగా కోలంక జమీందారీలో అడుగుపెట్టారు. ప్రకృతి ఇద్దరు వ్యక్తులను దూరం చేసిన విషాదాంతాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రకృతి ఇద్దరు మనుషులను దగ్గర చేయాలనుకుంటే చాలా చమత్కారంగా దగ్గర చేస్తుంది. అందుకు ఈ గానసరస్వతి పెళ్లే గొప్ప ఉదాహరణ. ‘‘నా పాటను వినడానికి స్వయంగా కోలంక జమీందార్... శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు గారు మద్రాసులో మా ఇంటికి వచ్చారు. నేనప్పుడే ‘కలువ రేకుల కనులు గల నా స్వామీ’ అనే పాట రికార్డింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. మా నాన్న పాట పాడమనగానే అదే పాట పాడాను. రాజా వారేమో తన పెద్ద కళ్లను వరి్ణస్తూ, వారి మీద ప్రేమను అలా పాట రూపంలో వ్యక్తం చేశాననుకున్నారట. అదే మా పెళ్లికి నాందీ గీతం’ అంటూ ఆనాటి జ్ఞాపకాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారామె. అందుకే తనకు ఇష్టమైన ప్రదేశం మద్రాసేనని చెబుతారామె. ఈ బాల రెండో బాల్యమిది! బాలసరస్వతీ దేవికి హాఫ్ వైట్ పట్టు చీరలిష్టం. క్రీమ్ కలర్‌తో అనేక రంగుల కాంబినేషన్లలోనే ఎక్కువగా కనిపిస్తారు. ఆమెకు మల్లెలన్నా ఇష్టమే. ఇక స్వీట్స్... ముఖ్యంగా గులాబ్ జామూన్, జాంగ్రీలను చూస్తే చిన్నపిల్లయిపోతారు. చాక్లెట్ చేతికిస్తే పసి పిల్లల ముఖం వికసించినట్లే ఆమె ముఖంలో నవ్వులు పూస్తాయి. భోజనం గుప్పెడే కానీ, ఆ వెంటనే స్వీట్ తినడం ఆమెకిష్టం, ఆ తర్వాత తియ్యగా పాడడం మరింత ఇష్టం. ఆ సరిగమల వారసత్వం ఇద్దరు కొడుకులకు రాలేదు, మనుమడు, మనుమరాలికీ రాలేదు. కానీ మనుమరాలి కూతురు నేహకు వచ్చింది. గానసరస్వతి కళ్ల ముందే ఆ ఇంట్లో సరిగమల కొత్తతరం వెల్లివిరుస్తోంది. తొంబై ఐదేళ్ల వయసులో హైదరాబాద్‌లోని పెద్ద కుమారుని ఇంటిలో ప్రశాంతంగా పసిబిడ్డలా జీవిస్తున్నారు బాల సరస్వతీదేవి. కన్నతల్లిని ‘కన్నక్కా’ అని పిలుస్తూ తల్లిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారాయన. కోడలు అత్తగారి చిన్నప్పటి జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ ఆమెను అపురూపంగా చూసుకుంటున్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆమె కొన్ని సంగతులు చెప్తూ మధ్యలో మర్చిపోతుంటే ఆమె పెద్ద కొడుకు, పెద్ద కోడలు అందుకుని పూర్తి చేయడమే అందుకు నిదర్శనం. సినిమాలకు మాత్రమే దూరం... స్వరానికి కాదు! పెళ్లి తర్వాత పదిహేనేళ్లకు బాల సరస్వతీదేవి సినిమాల కోసం పాడడం మానేశారు. కానీ సంగీత సాధన మాత్రం ఆపలేదు. సినారె తెలుగులోకి అనువదించిన మీరాభజన్ గీతాలను ఆలపించారామె. ఎనభై ఏళ్ల వయసులో ఆమె తనకిష్టమైన కొన్ని లలిత గీతాలను ఎంచుకుని స్వీయ సంగీత దర్శకత్వం వహించి ‘రాధా మాధవం’ సీడీ విడుదల చేశారు. కోవిడ్‌కి ముందు 2018లో అంటే ఆమె తొంబయ్యేళ్ల వయసులో ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాడడమే ఆమె చివరి వేదిక. ఆ వేడుక తర్వాత మూడవ రోజు ఇంట్లో జరిగిన ప్రమాదం ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయితే ఆశ్చర్యంగా జారి పడడంతో విరిగిన తుంటి ఎముక దానంతట అదే సరయింది. సంగీతమే తనను స్వస్థత పరిచిందంటారామె. ఇప్పటికీ రోజూ ఆ స్వరం రాగాలను పలుకుతుంటుంది. ఆమె ఊపిరితిత్తులకు శక్తినిస్తున్నది సంగీతమేనని వైద్యులు కూడా నిర్ధారించారు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: మోహనాచారి -
చివురులో చిలక! జుంటితేనె చినుకు!!
పిల్లనగ్రోవి పాటకాడ.. పిలచిన పలికే దాననోయ్ తలచిన వలచే జాణనోయ్.. గానమే కామనమని జీవనమని కలవరించు కన్నెనోయ్ ఒకమారు టి.వి.రాజు ‘ఋష్యశృంగ’కు పాడమని ఆమెని పిలిపించారు. అవి తమిళ మాతృకలో వసుంధరాదేవి గొప్పగా పాడిన పాటలు. రాజు పాడగా విని ఆమె వరసలు మార్చమన్నారు. హక్కులు కొని తెలుగులో తీస్తున్నామనీ, అవే వుండాలనీ దర్శక నిర్మాతలంటే ‘‘ఇదుగో గార్డన్ ఉడ్లాండ్స్లో కాఫీ తాగి వస్తా’’నని అంతే సంగతులు. - రావు బాలసరస్వతీదేవి ఈ మాటలను పాటగా వ్రాసింది మల్లాది రామకృష్ణశాస్త్రి, వరసకట్టి వట్టివేరు పరిమళం అద్దినది అశ్వత్థామ(చిన్నకోడలు, 1952). పాడినది చివురులో చిలక, మావి కొమ్మపై కోయిల, జుంటితేనె చినుకు అయిన ఆర్.బాలసరస్వతీదేవి. ఇవి అతిశయోక్తులు కావా, విమర్శకులిలా నుతించవచ్చునా అని ప్రశ్నిస్తే దానికొకే జవాబు. ఈ మాటలు విమర్శకుని కొలతలు కావు. సంగీత సాహిత్యాలింకా వంటబట్టని చిననాటనే కలిగిన వినుకలి కొలుపులు. చిన్నప్పటి నుంచి నాకు గ్రామఫోనూ, రికార్డులూ సరిగంగ స్నానాలు. మేముంటున్న బొబ్బిలి రాజమహల్లో వారానికి మూడునాలుగు ఆటవిడుపులు. ఇంట్లో కుక్కలతో, తోటలో నెమళ్లతో ఆడి, విచ్చలవిడిగా గూళ్లలోనూ బయటా తిరిగే ఎగిరే పావురాలతో కువకువలాడి, నేలనుబడితే పెంచిన ఉడతతో కిచకిచలాడి, విసుగెత్తితే వినోదం కోసం ఆశ్రయించే విలాసాలు. అంతటి చిరుత వయసులోనే జాతీయ గీతాలు పాడాలంటే టంగుటూరి సూర్యకుమారి, సినిమా పాటలు పాడాలంటే బాలసరస్వతి అన్న నిర్ణయానికి క్రమేణా రావడం గుర్తున్న విషయమే. తక్కిన వారి పాటలు వినలేదా? మొట్టమొదట నేపథ్య గాయని బెజవాడ రాజరత్నం, శాంతకుమారి, బళ్లారి లలిత, ఋష్యేంద్రమణి పాటలన్నా యిష్టమే. బాలసరస్వతి ప్రైవేటు పాటలూ పాడింది, నలభైల నడిమి నుంచి అరవైల అంతందాకా, అప్పుడప్పుడు. ఎస్.రాజేశ్వరరావుతో పోటీపడి పాడిన యుగళగీతాల (రావేరావే కోకిల, కోపమేల రాధా, రజనీవి; పొదరింటిలోన, తుమ్మెదా ఒకసారి, సన్యాసి రాజువి) ప్రౌఢ సౌందర్యం - వరసల్లో, వలపు సరసాల్లో - అర్థమయేసరికి కొంతకాలం పట్టింది. ఆమె కంఠంలో ప్రత్యేకత ఏమిటి? ఒక్కటే, మాధుర్యం. ‘అందాల ఆనంద’మంటూ (దేవదాసు, 1953) ఆకర్షించినా, ‘ఏల పగాయే’ (లైలామజ్నూ, 1949) అంటూ ప్రేమించి వదలిన ప్రియునికై అలమటించినా, ‘కనిపించితివా నరసింహా’ అంటూ కుంతలవరాళిలో వేడినా (చెంచులక్ష్మి 1943), కాదు, మధురభక్తిలో ముంచినా బాలసరస్వతికి సాటి బాలసరస్వతే. ఇందరున్నారీ చిత్రసీమలో సొంతగొంతుతో పాడుకొనేవారు, తెరవెనుక నుంచి ఆలపించేవారు కాని యీమెకున్న ఒక ఘనత మరెవ్వరికీ లేదు. హాస్యనటులుగా హీరోలకు సమ ఉజ్జీలై ప్రజాభిమానం చూరగొన్న శివరావుతో, రేలంగితో కలసి త్రిగళగీతం పాడింది మరొకరు లేరు. ఆ పాట ‘ముంత పెరుగండోయ్’ అన్నది (ప్రేమ, 1952). ఆ పాటలోనే కణుపులు లేని చెరుకు గడలు కురంజిలో ‘శివదీక్షా పరురాలనురా’ (ఘనం శీనయ్య పదం), ఆనందభైరవిలో ‘మధురా నగరిలో’ (చిత్తూరు సుబ్రమణ్యం పిళ్లై, గోపికా గీతం). కోలంక రాజావారిని పెళ్లాడి ఆమె నాకు పిన్నమ్మయ్యారు. ఆమెను ముఖతా కలుసుకొనడం నాకింకా జ్ఞాపకం వుంది. నాకు ఎనిమిదేళ్లుంటాయేమో, మద్రాసు రేసు కోర్సులో. అప్పటి నుంచి నేనంటే ఆమె ఆలపించేది వ్యక్తిగతంగా వాత్సల్యరాగమే. ఇక వృత్తిగతంగా ఆమెకూ నాకూ చుక్కెదురు. పి.మంగపతి హెచ్ఎంవీలో కీలక పదవిలో ఉండగా నా దగ్గరున్న రికార్డులతో ఆమె పాటలతో ఒక ఎల్.పి. సమకూర్చమన్నారు. ఆ పాటల జాబితా ఆమె చూసి ‘‘అందులో ‘తన పంతమే’ ఉండకూడదు. రాజేశ్వరరావుతో పాడిన కొన్ని ప్రైవేటు పాటలుండా’’లన్నారు. నేనా తలవంచేవాడిని! ఆ ప్రయత్నం వదలుకొని శశిగోపాలన్న ఒక సత్పురుషుడు బ్రాంచి మేనేజర్‌గా అధికారంలోకి వచ్చిన తరువాత నా పంతం నెగ్గించుకున్నాను. అవే అలనాటి అందాలు. ఇంతకూ ఆ పాట ‘తన పంతమే’ రజనీ వ్రాసి వరస చేసినది (మానవతి, 1952) అరుదైన రసాళి రాగంలో. ఈ రాగంలో ప్రచారంలో ఉన్న ఒకే ఒక పాట ‘అపరాధములనోర్వ’ ననే త్యాగరాజ కీర్తన. ఒకమారు టి.వి.రాజు ‘ఋష్యశృంగ’కు (1961) రెండు పాటలు పాడమని ఆమెని పిలిపించారు. అవి తమిళ మాతృకలో (1941) వసుంధరాదేవి గొప్పగా పాడిన పాటలు, ‘ఆనందమే ఉన్ కాట్చి’ ‘నానే భాగ్యవతి’ అన్నవి. రాజు పాడగా విని ఆమె వరసలు మార్చమన్నారు. హక్కులు కొని తెలుగులో తీస్తున్నామనీ, అవే వుండాలనీ దర్శక నిర్మాతలంటే ‘‘ఇదుగో గార్డన్ ఉడ్లాండ్స్లో కాఫీ తాగి వస్తా’’నని అంతే సంగతులు. ఏమిటి కారణం అని అడిగితే అంటారు కదా ‘‘కాపీ ట్యూనులు పాడను’’ అని. వసుంధర ఆ తమిళ గీతాలను అలవోకగా, అవలీలగా హిందుస్తానీ సంగతులు సుడులు త్రిప్పుతూ పాడటమూ ఈ పలాయనమునకొక మంత్రమయిందేమో! మరి అదే రాజుకి ‘రావా అమ్మా నిదురా’ (నిరుపేదలు, 1954) అని, లతా-సలిల్ అజరామర సృష్టి ‘ఆజారే నిందియా’ (దో బిగా జమీన్, 1953) ఎలా పాడారు? ‘అనార్కలి’లో సి.రామచంద్ర వరసలను మంగపతి కోరికపై ప్రైవేటు పాటలుగా పాడి, ‘రావా నను మరచినావా’ ‘సలామోయి సలీమా’ పాడి ఎలా ఆ లలిత పల్లవ ప్రాణులను శంకరగిరి మాన్యాలు పట్టించారు? ఒకటి మాత్రం నిజం. ఆమెకు దుశ్చింత ఎవరిపట్లా, ఎప్పుడూ లేదు. రమేశ్ నాయుడికి యీ మధురకంఠమంటే చాలా యిష్టం. దక్షిణాదిన ఆయన చేసిన మొదటి చిత్రం ‘దాంపత్యం’లో (1957) మంచి పాటలు పాడించారు. ‘తానేమి తలంచేనో’ (రాజాతో యుగళం), ‘నడివీథిలో జీవితం’ మొదలైనవి. ఆమె సినిమాకు పాడిన చివరిది అంపకాల పాట (సంఘం చెక్కిన శిల్పాలు, 1979) ఆయన పాడించినదే. అంతకు ముందే తెలుగులో మీరా గీతాలు (సి.నారాయణరెడ్డి అనుసృజన) ప్రైవేటు రికార్డుగా ఆయనే శ్రమ తీసుకొని సాధించారు. సినిమాలు చూడని, ఆ పాటలు వినని రేడియో శ్రోతలకూ ఆమె పాటంటే అభిమానమే. నాకు తెలిసిన రెండు : అన్నమయ్యది ‘రమ్మనవే మాని రచనలు’ (రజని), ‘తెలతెలవారింది చలిగాలి వీచింది’ (ఎస్.దక్షిణామూర్తి). ఇంకెందరికో ఆమె పాడిన పాటలు మలయానిల లాలనలు. పెండ్యాలకు ‘సృష్టిలో తీయనిది’ (ప్రైవేటు), ‘ఎవరినీ ప్రేమించకూ’ (అంతేకావాలి, 1955), విజయభాస్కర్‌కి ‘ఝళకిన ఝళకిన’ (కన్నడం, భాగ్యచక్ర, 1956 హిచ్‌కాక్ ‘స్టేజ్ఫ్రైట్’, 1950లో మార్లీన్ డీట్రిచ్ పాడిన మంద్రస్వర గీతానికి అనుసరణ), నాగయ్యకు సారంగరాగనిసర్గ సౌందర్యం తెలిపే ‘అదిగదిగో గగనసీమ’ (జిక్కితో, నాయిల్లు, 1953), అద్దేపల్లి రామారావుకి ‘మాలైనిల వరవేండుమ్’(తాయ్ ఉళ్లమ్, 1952), తమిళంలో ప్రైవేట్ పాటలెక్కువ పాడలేదు గాని, వాటిలో ముత్తు సంగీతానికి పాడిన ‘ఆడుదు పార్ మయిల్’ వింటే మబ్బును చూసి ఉబ్బితబ్బిబ్బయిన మయూరాలమవుతాము. నటించిన చిత్రాలన్నీ కనకవర్షం కురిపించలేదు ఒక్క తిరునీలకంఠర్ తప్ప. ఇప్పుడు ఆ ఒక్క చిత్రమే లభ్యం. దాసిప్పెణ్, సువర్ణమాల చిత్రాలలో ఆమె గాన నాట్యాభినయం చేసినా ‘‘ఏముంది! ఆనాటి నాట్యాలెవరు చేసినా ఉడతలు పట్టడమే’’ అని తీసిపారవేయడం ఆమెకలవాటు. నటించిన చిత్రాలన్నింటిలో ‘చంద్రహాస’ తప్ప మంచి పాటలున్నవి. సువర్ణమాలలోని ‘రావోయి జీవనజ్యోతి’ మూడు నిమిషాలు మెరిసే మెరుపు. ఏడుపులు, ఎక్కిళ్లు లేకుండా విచార విరహగీతం ఎలా పాడాలో నేర్పే పాఠం. ఈ పాటలు వింటుంటే ‘అబ్బ ఎంత గొప్పగా పాడారో’ అనిపించదు. ‘ఎంత హాయిగా ఉందో’ అని కూడా అనిపించదు. ఆ గొప్పతనం, ఆ హాయి చాపకిందనీరులా మనని తడిపేస్తాయి. దటీస్ బాలసరస్వతి! - వి.ఎ.కె.రంగారావు 9444734024 (నేడు గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్వారు బాలసరస్వతీదేవికి విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేస్తున్నారు.)