breaking news
Rajiv Vidya
-
టెన్ షన్
31 మండలాలకుఇన్చార్జ్ ఎంఈవోలు ఒక ఉప విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీ ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుందని ఆందోళన యలమంచిలి : జిల్లా విద్యావ్యవస్థలో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. శాశ్వత మండల విద్యాశాఖాధికారుల నియామకాలు పదేళ్లుగా జరకపోవడం, సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించడం, ఉన్నత పాఠశాలల్లోనూ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులను నియమించి బోధన సాగించడం, తదితరాల ప్రభావం పదోతరగతి పరీక్షా ఫలితాలపై పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాలకే శాశ్వత ఎంఈవోలు ఉన్నారు. 31 మండలాలకు ఎంఈవోలుగా ఆయా మండలాల్లోని ఉన్నత పాఠశాలల సీనియర్ ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించి ఉన్నతాధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎంఈవోల స్థానాల్లో పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా నియమించారు. దాంతో ఎంఈవోలుగా ఉంటూనే తమ పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సిన రావడంతో ఒత్తిడికి గురవుతున్నామని పలువురు ఇన్చార్జ్ విద్యాశాఖాధికారులు అంటున్నారు. దీంతో పాటు పాడేరు, జిల్లా పరిషత్, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. పాడేరు ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు విశాఖపట్నం ఉప విద్యాశాఖాధికారిణి రేణుక, రాజీవ్ విద్యామిషన్ ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి చూస్తున్నారు. దీంతో వీరిపై పని ఒత్తిడి పెరగడంతో పాఠశాలలపై పర్యవేక్షణ లోపిస్తోంది. మరోవైపు ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాలు పూర్తికాక ఉపాధ్యాయుల్లో సమన్వయం లేక బోధన మూలకు చేరిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నివేదికలతోనే సరి... మండలాల్లో ఇన్చార్జ్ ఎంఈవోలుగా పనిచేస్తూ పాఠశాలల పనితీరు, మధ్యాహ్న భోజనం పరిశీలన, పారదర్శక నిధులు వినియోగం, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన ఎస్‌ఎంసీల సమావేశాలు నిర్వహణ, విధులపై వారికి అవగాహన కల్పించడంలోనే సతమతమవుతుంటే.. ఉన్నతాధికారులు వివిధ నివేదికలు అందజేయాలంటూ వారానికి రెండుమూడుసార్లు సమావేశాలకు హాజరు కావాలంటూ జిల్లా కేంద్రానికి పిలిపించుకుంటుండటంతో పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కిందని ఎంఈవోలు చెబుతున్నారు. పాఠశాల ఆవాస ప్రణాళికలు, పాఠశాల వార్షిక అభివృద్ధి నివేదికలు, ఆధార్, 2005 నుంచి 2014 వరకూ మధ్యాహ్న భోజన ఖర్చుల నివేదిక, ఏకరూప దుస్తుల వివరాల నివేదికలు, జమ, వ్యయాలు సరిపోక తజ్జనభజ్జన పడుతున్నామని అంటున్నారు. అధికారాలు లేని ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుల మాటను సిబ్బంది వినిపించుకోని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. పదో తరగతి పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు తగు పర్యవేక్షణ లేకపోవడంతో తమకెందుకులే అన్నట్టు వారంతా మిన్నకుండిపోతున్నారు. మెరుగైన ఫలితాలు సాధ్యమేనా? గత మూడేళ్లలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా 17, 14, 11 స్థానాల్లో ఉంది. ఈ ఏడాది దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారా ? చేతులెత్తేస్తారా? అన్న సందేశం విద్యాశాఖ ఉన్నతాధికారులనే కలవరపెడుతోంది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మారడం, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం, మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలు సమకూర్చకపోవడం తదితరాలతో తరగతి గదుల్లో బోధన నత్తనడకన సాగింది. కొన్ని నాన్పేనల్ హైస్కూళ్లలో కొన్ని సబ్జెక్టులకు ఏడాది పొడవునా ఉపాధ్యాయులే లేరు 31 మండలాలకు ఇన్చార్జ్ ఎంఈవోలు జిల్లాలో 31 మండలాలకు ఇన్చార్జ్ ఎం ఈవోలు ఉన్నారు. 8 మండలాలకు మాత్రమే శాశ్వత ఎంఈవోలు బాధ్యతలు చూస్తున్నారు. దీనివలన పాఠశాలల పర్యవేక్షణ కొంత వరకు ఇబ్బందే. అయినప్పటికీ పదో తరగతి ఫలితాలపై ఆ ప్రభావం లేకుండా చూస్తున్నాం. ప్రత్యే క పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాం. - ఎం.వెంకటకృష్ణారెడ్డి, డీఈవో -
96 స్కూల్ కాంప్లెక్సులు రద్దు
పాలమూరు : విద్యాశాఖ చేపట్టిన మార్పుల్లో భాగంగా జిల్లాలో స్కూల్ కాంప్లెక్సుల మదింపునకు చర్యలు చేపట్టారు. పాఠశాలల నిర్వహణలో కీలకమైన 96స్కూల్ కాంప్లెక్సులను రద్దుచేస్తూ రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఒక్కో కాంప్లెక్స్ కింద 5 నుంచి 7పాఠశాలలుంటే.. ఇప్పుడు 18 పాఠశాలలకు ఒక స్కూల్ కాంప్లెక్సును నిర్ణయించారు. రద్దు నిర్ణయంతో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై మరింత భారం పడనుంది. జిల్లాలో 3,650 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఉన్నత పాఠశాలల పరిధిలోని 5నుంచి7 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పక్కనే ఉన్నత పాఠశాలలకు కలిపి పాఠశాల సముదాయాలుగా ఏర్పాటు చేశారు. వీటి అధ్యక్షులుగా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వ్యవహరించేవారు. అధ్యక్షుడు సమీప పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థులకు బోధన, పాఠశాల గ్రాంట్ల ఖర్చు, పర్యవేక్షణ చేయాలి. ఇప్పటివరకు 353 పాఠశాలలుండగా వీటిసంఖ్య తగ్గించాలని 16 నుంచి 18 పాఠశాలలను కలిపి ఒకటిగా ఏర్పాటు చేశారు. తక్కువ పాఠశాలలున్న దాన్ని పక్క సముదాయానికి కలిపారు. దీంతో 96 స్కూల్ కాంప్లెక్స్‌లు తగ్గి సంఖ్య 257కు చేరింది. ఒక్కో పాఠశాల సముదాయానికి ఖర్చుల కోసం ఏడాదికి రూ. 20 వేలను ఆర్వీఎం కేటాయిస్తోంది. గతేడాది వరకు ఏటా రూ.70.60 లక్షలు మంజూరు చేసింది. రద్దు కారణంగా రూ. 51.40లక్షలే మంజూరవనున్నాయి. రూ. 19.20 లక్షల వరకు ఆదాకు అవకాశం ఉంది. ఈ నిధులతో సముదాయ సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్వీఎం ఉన్నతాధికారులు నిర్ణయించారు. హెచ్‌ఎంలపై భారం స్కూల్ కాంప్లెక్స్ అధ్యక్షుడు అయిన ప్రధానోపాధ్యాయుడు సమీప పాఠశాలల నిర్వహణ బాధ్యత చూడాలి. ఇప్పటి వరకు 5నుంచి7 పాఠశాలలు ఉండేవి. తాజాగా 18 కానుండటంతో నిర్వహణ భారం పడనుంది. వారంలో మూడుసార్లు తనిఖీలు చేసి ఎంఈఓ ద్వారా ఎస్ఎస్ఏకు నివేదికలు పంపాలి. పాఠశాలల సంఖ్య పెరగడంతో తనిఖీలకే సమయం సరిపోనుంది. పనిచేస్తున్న చోట పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపలేమని పలువురు స్కూల్ కాంప్లెక్సు హెచ్ఎంలు పేర్కొన్నారు. సీఆర్పీలపై వేటు? జిల్లాలో ప్రస్తుతం 340 స్కూల్ కాంప్లెక్సులకు సీఆర్పీ (క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు)లున్నారు. వీరు సముదాయ పాఠశాలల్లో ఉంటూ విధులు నిర్వహిస్తారు. ఆ పరిధిలోని పాఠశాలల్లో బోధన, ఎస్ఎస్ఏ ఆదేశాలు స్వీకరించి వివరాలు సేకరించి మండల విద్యాధికారి ద్వారా నివేదికలు పంపుతారు. సీఆర్పీకి నెలకు రూ.8,500 చెల్లిస్తున్నారు. ఇప్పుడు సంఖ్య తగ్గడంతో ఒక్కో సముదాయానికి ఇద్దరు సీఆర్పీలు విధులు నిర్వర్తించాలని ఆదేశాలిచ్చారు. భవిష్యత్తులో 96మంది సీఆర్పీలను తొలగించే అవకాశాలున్నట్లు విద్యాశాఖవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.