breaking news
rajamahendrawaram
-
ప్రజలకు మరింత చేరువగా ఎంపీ భరత్ రామ్
సాక్షి, రాజమహేంద్రవరం సిటీ: ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు ‘భరత్ రామ్’ యాప్‌ను రూపొందించినట్టు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. నగరంలోని అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ కంపెనీలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘భరత్ రామ్’ యాప్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. నియోజకవర్గ పరిధిలో అందరినీ కలవడం సాధ్యం కావడం లేదని, అందుకే ఈ యాప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వీడియోలు, పోస్టులను ఈ యాప్‌లో పెట్టవచ్చన్నారు. ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి భరత్ రామ్ అని టైప్ చేస్తే యాప్ వస్తుందని, దాన్ని ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు సమస్యలే కాకుండా సూచనలు కూడా ఇవ్వవచ్చన్నారు. ఈ యాప్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్న పథకాలను కూడా ఉంచామన్నారు. తన పర్యటనకు సంబంధించిన ముందుస్తు సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. దీనిలో ఉపాధికి సంబంధించిన ఐకాన్ కూడా ఉందని, దీని ద్వారా ఉపాధికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ యాప్‌లో ఉంచడంతో పాటు ఇప్పటివరకూ ఎంతవరకు అమలు చేశామన్న విషయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎప్పటికప్పుడు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారా ప్రజల దృష్టిలో ఉంచుతామని తెలిపారు. ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభమని, స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ ఈ యాప్‌ను లోడ్ చేసుకుని నియోజకవర్గ అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ యాప్‌ను రూపొందించిన అమరావతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండీ అనిల్‌కుమార్ చింతాను అభినందించారు. -
సాహిత్య పీఠానికి చంద్రగ్రహణం
సాక్షి, రాజమహేంద్రవరం : ‘తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరాన్ని ప్రధానకేంద్రంచేస్తాం.’ అంటూ గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాంతో ఎందరో భాషాభిమానులు బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠానికి మంచి రోజులు వస్తాయని ఆశించారు. అయితే వారి ఆశ అడియాసే అయింది. అన్ని హామీల్లాగే దీన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. దాంతో నానాటికీ సాహిత్యపీఠం కునారిల్లిపోతోంది. ఎన్టీఆర్ మానసపుత్రిక తెలుగువారికి గుర్తింపు తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు తెలుగు భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఉండేది. 1985 డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ కేంద్రంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్‌లో జానపదపీఠం, కూచిపూడిలో కూచిపూడి నాట్యవిభాగం, శ్రీశైలంలో పురావస్తు పరిశోధన విభాగం, ఆదికవి నన్నయ నడయాడిన, ఆంధ్రమహాభారతం అవతరించిన గడ్డ రాజమహేంద్రవరం శివారునగల బొమ్మూరులో తెలుగు సాహిత్యపీఠం ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఈ సాహిత్య పీఠం ఎంఏ తెలుగు చదువుకునే వారికి, తెలు గు భాషాసాహిత్యాలపై పరిశోధనలు చేసేవారికి కల్పవృక్షంగా భాసించింది. రాష్ట్ర విభజనానంతరం చంద్రగ్రహణంతో పురాతన వైభవం కోల్పోయింది. శిథిలమవుతున్న వసతి గృహాలు అంతా భ్రాంతియేనా? తెలుగు విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రం చేస్తానని పుష్కరాల సాక్షిగా వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఆతర్వాత ఆ ఊసు మళ్లీ ఎత్తలేదు. తెరమీదకు కొత్తవాదనలు వచ్చాయి. విభజన చట్టం, షెడ్యూల్ 10లో సాహిత్యపీఠం ఉండటం వలన ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని మొసలి కన్నీరు మొదలయింది. రాజమహేంద్రవరాన్ని ప్రధాన కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటన చేసే సమయానికే సాహిత్యపీఠం ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉంది. ఇదేదో ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఉత్పన్నమైన సమస్య కాదు. అన్నీ తెలిసే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం,హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్నవే. అవి మన రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయి. ఈ సంస్థలకు లేని అడ్డంకి సాహిత్యపీఠం విషయంలో ఎందుకు ఉత్పన్నమవుతోందని పద్మవిభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటివారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దానికి నేతలనుంచి సమాధానం లేదు. కాంచవోయి నేటి దుస్థితి ఒకప్పుడు సుమారు 80మందికి పైగా ఎంఏ (తెలుగు) చదువుకునే విద్యార్థులతో, పరిశోధకులతో కళకళలాడిన సాహిత్యపీఠం నేడు బావురుమంటోంది. ఎంఏ మొదటి సంవత్సరంలో ఐదుగురు, రెండో సంవత్సరంలో ఎనిమిది మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పూర్తి స్థాయిబోధన సిబ్బంది లేరు. అడపాతడపా, కన్సాలిడేటెడ్ పారితోషికం మీద ఒక అధ్యాపకుడు వచ్చి, పాఠాలు చెబుతున్నారు. సాహిత్యపీఠంలో పూర్తిస్థాయి పర్యవేక్షకులు లేరు. గుంటూరులో ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఉన్నారు. తలలేని మొండెంలా సాహిత్యపీఠం మిగిలింది. సుమారు 50,000 అరుదైన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నవారు దాదాపు లేరు. బోధనేతర సిబ్బందికి రెండునెలలకో, మూడు నెలలకో జీతాలు విదిలిస్తున్నారు. హాస్టల్ భవనం శి«థిలావస్థకు చేరుకుంది. ఎందుకీ దుస్థితి? రాష్ట్ర విభజన అనంతరం సాహిత్యపీఠం అస్తిత్వంపై, భవిష్యత్తుపై నీలిమేఘాలు కమ్ముతున్న తరుణంలో, ప్రభుత్వం ప్రేక్షకపాత్రను ధరించింది. సాహిత్యపీఠం క్షీణదశ ప్రారంభం కావడానికి ఇది ప్రధాన కారణం. విద్యార్థులకు భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యాడు. అదనపు భవనాల నిర్మాణం కాలేదు కనుక, సాహిత్యపీఠానికి ఇచ్చిన భూమిలో కొంతభాగాన్ని తిరిగి ఇవ్వాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టురని సాహిత్యపీఠం సిబ్బంది తెలిపారు. ప్రాంగణంలోని కొంత ప్రాంతానికి ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేశారు. కొంత భాగం ఆక్రమణలకు గురి అయింది. ఏది ఏమైనా, జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించక తప్పడం లేదు. కనీసం భాషాసాహిత్యాలను, కళలను రాజకీయ పరిధి దాటి ఆదరిస్తే బాగుంటుందని సాంస్కృతిక రాజధాని ప్రజలు కోరుకుంటున్నారు. -
కార్డన్ సెర్చ్‌లో ముగ్గురు రౌడీ షీటర్ల అరెస్ట్
రాజమహేంద్రవరం: నగరంలో సమస్యాత్మకమైన రాజేంద్రనగర్‌లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 56 బైక్‌లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీ షీటర్లను, ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ డి.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.