breaking news
Rajagopalachari
-
బీజేపీలోకి సి.రాజగోపాలచారి ముని మనవడు
న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత దేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ అయిన సి.రాజగోపాలాచారి ముని మనవడు సీఆర్ కేశవన్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దక్షిణభారతంలో మరింతగా పుంజుకునేందుకు కృషిచేస్తున్న పార్టీలోకి నేతలు చేరుతుండటం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బలూనీల నేతృత్వంలో ఆయన బీజేపీలో చేరారు. ‘ ప్రజామోదంతో పాలిస్తూ అవినీతిరహిత, సమ్మిళ ప్రభుత్వాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రధాని మోదీపై గౌరవంతో పార్టీలో చేరాను’ అని బీజేపీలోకి వచ్చిన సందర్భంగా కేశవన్ వ్యాఖ్యానించాను. తమిళనాడుకు చెందిన కేశవన్ తొలినాళ్లలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను వీకేసింగ్ పరోక్షంగా విమర్శించారు. ‘ సి.రాజగోపాలాచారి దేశం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక ఆయన చేసిన త్యాగాలు మరుగునపడేలా, చరిత్ర గర్భంలో కలిసిపోయేలా కొందరు కుట్ర పన్నారు. దేశం కోసం తాము మాత్రమే కష్టపడ్డామని కేవలం ‘ఒక్క కుటుంబం’ మాత్రం ప్రకటించుకుంది’ అంటూ గాంధీల కుటుంబాన్ని పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో కేశవన్ బీజేపీ వాణిని గట్టిగా వినిపిస్తారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న నేతల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. -
సోనియాకు థ్యాంక్స్.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత
ఢిల్లీ: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్లు మాత్రం షాకిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన సీ. రాజగోపాలచారి మనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత సీఆర్ కేశవన్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ లేఖలో కేశవన్ కీలక విషయాలను వెల్లడించారు. తనకు 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసే బాధ్యతలు ఇచ్చినందకు కాంగ్రెస్‌కు, సోనియా గాంధీకి కేశవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీలో ప్రతీ ఒక్కరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని లేఖలో చెప్పుకొచ్చారు. ఇక, తాను 2001లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయాన్ని గుర్తుచేసిన కేశవన్.. దేశానికి సేవ చేయడానికే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం పార్టీలో ఇవ్వడం లేదని కేశవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రస్తుతం విలువలు లేవని ఆరోపించారు. పార్టీని సేవ చేసినన్ని రోజులు తన ప్రయాణం సవాలుగా, ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. అలాగే, తనకు.. శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. ఇదే సమయంలో తనకు వేరే పార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతంలేదని స్పష్టం చేశారు. -
భారతీయ ఆత్మను కదిలించినవాడు
• ధ్రువతారలు చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్రలో నమోదు కావడం అసాధారణ ఘట్టం. భారత స్వాతంత్రోద్యమ చర్రితను మలుపు తిప్పిన వ్యక్తిగా తృటిలో అవకాశం తప్పిపోయిన వారు చక్రవర్తి రాజగోపాలాచారి. క్విట్ ఇండియా పిలుపు తరువాత స్వాతంత్రోద్యమంలో ఏర్పడిన దారుణమైన నిశ్శబ్దాన్ని ఛేదించినవారు రాజాజీయే. పాకిస్తాన్ ఏర్పాటును ఆపడం ఎవరితరమూ కాదని మహమ్మద్ అలీ జిన్నా అప్పటికే ప్రకటించాడు. అందులోని అనివార్యతను మొదటిసారి బాహాటంగా చెప్పిన వారు కూడా రాజాజీయే. ఈ ప్రతిపాదనే రాజాజీ ప్రణాళిక పేరుతో చరిత్రలో ఒక మూల దాక్కుని ఉంది. గాంధీజీ అనుమతితో రాజాజీ ఈ అంశాన్ని జిన్నాతో చర్చించాలని అనుకున్నారు. జిన్నా ముందుకు రాకపోవడంతో, 1944, సెప్టెంబర్‌లో గాంధీజీయే ఈ ప్రణాళిక గురించి జిన్నాతో చర్చించారు. 19 రోజుల పాటు జిన్నా స్వగృహంలో జరిగిన చర్చలలో ఇదే ప్రధానాంశం. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలన్న డిమాండ్‌కు ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించడం ఐదు సూత్రాల రాజాజీ ప్రణాళికలో తొలి అంశం. మిగలిన నాలుగు సూత్రాలు ఎలా ఉన్నా, దీనిలో అంతరార్థం ఒకటే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ విభజన గురించి ఆలోచించాలంటుంది ఆ సూత్రం. జిన్నా దీనిని వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు. జాతీయ కాంగ్రెస్ కంటే ఆంగ్లేయుల మీదనే ఆయనకు నమ్మకం ఎక్కువ కూడా. రెండో ప్రపంచ యుద్ధం వేళ మద్రాస్ నగరం మీద జపాన్ బాంబు దాడులకు పాల్పడిన సందర్భమే రాజాజీని అప్పుడున్న ఆ ప్రమాదకర నిశ్శబ్దాన్ని ఛేధించడానికీ, యథాతథ స్థితి మీద దండెత్తడానికీ ప్రేరేపించింది. ఒకటి నిజం. అవిభాజ్య భారత్‌గా ఉండగానే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఉంటే ఆ పరిణామం చరిత్రలో మలుపు అని పిలవడానికి అర్హమైనదిగా ఉండేదేమో! కానీ ‘ఏమో’, ‘అయితే’ వంటి ఊహాగానాలను చరిత్ర అనుమతించదు. చక్రవర్తి రాజగోపాలాచారి (డిసెంబర్ 10,1878–డిసెంబర్ 25,1972) ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. తండ్రి వెంకటరాయన్ అయ్యంగార్ థోరాపల్లి (తమిళనాడు, కృష్ణగిరి జిల్లా) మున్సిఫ్. తల్లి సింగారమ్మ. రాజాజీ, సీఆర్ అని కూడా పిలుచుకునే రాజగోపాలాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే జరిగింది. తరువాత మైసూరు రాష్ట్రం (నేటి కర్ణాటక) లో కొంతకాలం చదివారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని, 1900 సంవత్సరంలో సేలంలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కొద్దికాలంలోనే పెద్ద న్యాయవాదిగా కీర్తి సంపాదించారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడంతో రాజాజీ స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశించారు. అంటే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలోనే రాజాజీ స్వరాజ్య సమరం వైపు నడిచారు. నిజానికి ఆయన ఆనాటికి లోకమాన్య బాలగంగాధర తిలక్ అనుచరుడు. రాజాజీ అటు ఉద్యమాన్ని, ఇటు అధికార పదవులనూ సమానంగానే స్వీకరించారు. 1911లోనే సేలం మునిసిపాలిటీలో సభ్యుడయ్యారు. 1917లో తాను అధ్యక్షునిగా ఎన్నికై, ఒక దళితుడిని కూడా సభ్యునిగా ఎంపిక చేసిన ఘనతను దక్కించుకున్నారు. గాంధీజీ హరిజనోద్ధరణ ఆరంభించడానికి చాలా ముందే రాజాజీ ఇలాంటి అడుగు వేశారు. మునిసిపల్ చైర్మన్ పదవీ కాలం ముగిసిపోతున్న కాలంలో, అంటే 1919 లో మొదటిసారి ఆయనను గాంధీజీని కలుసుకున్నారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో కలసి నడిచారు. ఇటు గాంధీ పథంలో ఉన్నప్పటికీ తిలక్ అనుచరుడు, తీవ్ర జాతీయవాది ఓవీ చిదరబరం పిళ్లై అంటే ఎంతో అభిమానించేవారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, పూర్తిస్థాయి ఉద్యమకారునిగా మారారు. అప్పుడే న్యాయవాద వృత్తి వదిలేశారు. 1924–25లో తమిళనాడులో జరిగిన వైకోమ్ సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించారు. అంటరాని కులాల వారిని దేవాలయాలలోకి అనుమతించాలన్న ఆశయంతో ఈ ఉద్యమం ఆరంభమైంది. 1930లో గాంధీజీ దండిలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభిస్తే, నాగపట్నం దగ్గరి వేదారణ్యంలో రాజాజీ ఆరంభించారు. జైలు జీవితం తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయ్యారు. 1937 ఎన్నికలలో రాజాజీ మద్రాస్ విశ్వవిద్యాలయం ప్రతినిధిగా శాసనసభలో ప్రవేశించారు. మద్రాస్ తొలి ప్రధాని అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మధుర మీనాక్షి ఆలయంలో అంటరానివారి ప్రవేశం (1939) జరిగింది. ఆలయాలలో అంటరానివారి ప్రవేశం కోసం ఆయన చట్టాన్ని తెచ్చారు. రైతు రుణ విమోచన చట్టం కూడా ఆయనదే. మద్యపాన నిషేధం విధించి, దీని ద్వారా వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి అమ్మకం పన్ను పెంచారు. అయినా లోటు తప్పలేదు. దీనితో కొన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. కింది వర్గాల వారి విద్యాభివృద్ధికి రాజాజీ ఈ విధంగా కావాలనే భంగం కలిగించారని ఆయన వ్యతిరేకులు, అంటే ద్రవిడ పార్టీలు విమర్శలకు దిగడం విశేషం. అలాగే హిందీని పాఠ్య ప్రణాళికలో చేర్చాలన్న రాజాజీ నిర్ణయం కూడా వ్యతిరేకులు రాజకీయం కోసమే ఉపయోగించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీ మీద యుద్ధం ప్రకటించినందుకు నిరసనగా 1940లో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేశారు. రాజాజీ కూడా ప్రధానమంత్రి పదవికి (నాటి ముఖ్యమంత్రులను ఇలాగే పిలిచేవారు) రాజీనామా చేశారు. ఇందుకు ఇంగ్లిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలుకు పంపించింది. అప్పుడే క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. కానీ ఆ ఉద్యమాన్ని రాజాజీ సమర్థించలేకపోయారు. అంతకంటే బ్రిటిష్ వారితో చర్చించి, వారు దేశాన్ని విడిచిపోయేందుకు ఒప్పించాలని ఆయన అభిప్రాయం. అప్పటికే జపాన్ మద్రాస్, విశాఖల మీద బాంబులు వేసింది. ఇంగ్లిష్ వాళ్లు వెళ్లిపోయిన తరువాత జర్మనీ లేదా జపాన్ భారత్ మీద ఆధిపత్యం సంపాదించే పరిస్థితిని కల్పించకూడదన్నదే రాజాజీ అభిప్రాయం. అందుకే ఆయన బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు ముస్లింలీగ్‌తో కూడా చర్చలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇందుకు జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. రాజాజీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను, గాంధీ–నెహ్రూ నాయకత్వాన్ని రాజాజీ నిరాకరించినా, రాజాజీ అవసరాన్ని నాటి పరిస్థితులలో గుర్తించకుండా తప్పుకునే అవకాశం లేకపోయింది. 1946లో నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందులో భాగస్వామి కావలసిందంటూ ఆయనను ఆహ్వానించక తప్పలేదు. అత్యంత కీలకమైన నాలుగు శాఖలు– పరిశ్రమలు, రవాణా, విద్య, ఆర్థిక వ్యవహారాలు రాజాజీకి అప్పగించారు. 1948లో మళ్లీ ఆయన అవసరం అనివార్యమైంది. 1947, ఆగస్టు 15న బెంగాల్‌లోని తూర్పు బెంగాల్ పాక్‌లో భాగమైంది. నాటి బెంగాల్ పరిస్థితిని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. హిందూ–ముస్లిం ఘర్షణలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ముస్లిం లీగ్ నాయకుడు సుహ్రావర్ధి నాయకత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యథేచ్ఛగా రక్తపాతం సృష్టించారు. నౌఖాలి వంటి ఘటనలన్నీ అప్పుడే చోటు చేసుకున్నాయి. ఆ స్థితిలో నెహ్రూ పూర్తి మద్దతుతో రాజాజీని ఆ రాష్ట్ర గవర్నర్‌గా పంపించారు. కానీ సుభాష్ బోస్‌ను విమర్శించిన వ్యక్తిగా రాజాజీ అంటే బెంగాలీలు తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. అయినా తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన శరణార్థుల పునరావాసం, శాంతి స్థాపన ధ్యేయంగా రాజాజీ గట్టి కృషి జరిపారని పేరుంది. కొన్ని మాసాల తరువాతే అక్కడ నుంచి వెనక్కి తిరగవలసి వచ్చింది. ఆఖరి బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్‌బాటన్ రెండేళ్లు సెలవులో వెళ్లారు. తన మేనల్లుడు ప్రిన్స్ ఫిలిప్‌కు, యువరాణి ఎలిజబెత్‌కు వివాహం. ఆ సమయంలో మౌంట్‌బాటన్ తాత్కాలిక వైస్రాయ్గా రెండు పేర్లు సూచించారు. ఒకటి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్, రెండు రాజాజీ. కానీ పటేల్ పేరును నెహ్రూ అంగీకరించలేదు. అలా రాజాజీ భారతీయుడైన తొలి, మలి వైస్రాయ్గా (జూన్ 1948–జనవరి 26,1950) పదవిని అలంకరించి, కీర్తి పొందారు. అంత పెద్ద వైస్రీగల్ భవనంలో ఆయన (నేటి రాష్ట్రపతి భవన్) అతి సాధారణ జీవితం గడిపారు. వైస్రాయ్ పదవిని అలంకరించారు కాబట్టి, స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి పదవికి రాజాజీ అభ్యర్థిత్వమే సహజంగా ముందుకు వస్తుందని అంతా ఆశించారు. నెహ్రూ కూడా ఆయనకే మద్దతు ఇచ్చారు. రాజాజీ కూడా బరిలో దిగాలని ఆశించినా, తరువాత నిర్ణయం మార్చుకున్నారు. కారణం, ఉత్తరాది ఎంపీల ఆధిపత్యం ఒకటని చెప్పినా, క్విట్ ఇండియా ఉద్యమాన్ని రాజాజీ వ్యతిరేకించిన విషయాన్ని విస్మరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. రాజాజీ కాకుండా బాబూ రాజేంద్రప్రసాద్ వైపు జాతీయ కాంగ్రెస్ ఎంపీలు మొగ్గారు. తరువాత మళ్లీ నెహ్రూ ఆహ్వానం మేరకు రాజాజీ కేంద్ర మంత్రి వర్గంలో ఏ శాఖా కేటాయించని మంత్రిగా చేరారు. డిసెంబర్ 15, 1950న పటేల్ మరణంతో హోంశాఖ బాధ్యతను రాజాజీ స్వీకరించారు. కానీ పదిమాసాల తరువాత బయటకు వచ్చేశారు. కారణం– నెహ్రూతో విభేదాలు. చైనా విస్తరణ కాంక్ష గురించి, టిబెట్ సమస్య గురించి పదే పదే రాజాజీ నెహ్రూను హెచ్చరించేవారని చెబుతారు. నిజానికి ఆ ఇద్దరి అభిప్రాయాలకు పొంతన లేదు. నెహ్రూ ఉద్దేశం హిందూ మహాసభ దేశానికి పెద్ద బెడద. కానీ రాజాజీ నమ్మకం, దేశానికి అతి పెద్ద ప్రమాదం కమ్యూనిస్టులు. అంటే సోవియెట్ రష్యా వైపు నెహ్రూ మొగ్గడం ఆయన ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. ఇక్కడ ఒక పరిణామాన్ని గమనించాలి. నాటికి నెహ్రూ జీవించి ఉన్నా ఇది జరిగింది. 1952 మద్రాస్ అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు దక్కలేదు. కమ్యూనిస్టుల నాయకత్వంలోని కూటమి ఆధిపత్యం సాధించింది. ఆ కూటమి, అంటే కమ్యూనిస్టులు అధికారంలోకి రాకుండా నాటి గవర్నర్ శ్రీప్రకాశ్ రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయకున్నా, అటు ప్రధాని నెహ్రూకు గాని, ఇటు రాష్ట్ర నాయకులకుగాని తెలియకుండా గవర్నర్ రాజాజీని ఎంఎల్‌సిగా నామినేట్ చేసి, ముఖ్యమంత్రిగా నియమించారు. తరువాత విపక్షాల ఎంఎల్ఏలను చేర్చుకుని రాజాజీ బలం నిరూపించుకున్నారు. కానీ ప్రత్యేక ఆంధ్రోద్యమం ఆయన కాలంలోనే వచ్చింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ అప్పుడే జరిగింది. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. భారత స్వాతంత్య్రోద్యమం మీద, పరిపాలన మీద రాజాజీ ముద్ర చెరిపివేయలేనిది. అంటే ఆరు దశాబ్దాల చరిత్ర మీద ఆయన జాడ సుస్పష్టం. ఆయన మౌంట్‌బాటన్ వారసుడు. సర్దార్ పటేల్ వారసుడు. గాంధీగారి వియ్యంకుడు. గాంధీజీ∙నాల్గవ కుమారుడు దేవదాస్ గాంధీకి, తన కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. ఇంగ్లిష్‌లో 26 అక్షరాలతో కూడిన చక్రవర్తి రాజగోపాలాచారి పేరేను రాజాజీ అని క్లుప్తీకరించినవారు గాంధీజీయే. గాంధీజీకి ఐదుగురు గొప్ప సన్నిహితులు ఉన్నారని తాతగారి జీవిత చరిత్రలో రాజ్‌మోహన్‌గాంధీ (మనుమడు) రాశారు. పటేల్, నెహ్రూ, అబుల్ కలామ్, రాజేంద్ర ప్రసాద్.. ఆ ఐదో సన్నిహితుడు రాజాజీ. వ్యక్తి స్వేచ్ఛలో, పాలనలో ప్రభుత్వం ప్రమేయం కనిష్టంగా ఉండాలని ఆయన ఆనాడే భావించారు. స్వేచ్ఛా విపణి అవసరమని కూడా వాదించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాట ఆయన ప్రతిభ ముందు చిన్నదే. రామాయణం, భారతం, భాగవతం కూడా ఆయన మళ్లీ రాశారు. సంగీతంతో పరిచయం ఉంది. ఆయన రచనలకు సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా దక్కింది. 1954లోనే ఆయన భారతరత్నకు ఎంపికయ్యారు. ఆయన జీవితంలోని వెలుగు చూడని మరొక కోణం, అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా ఆయన చేసిస కృషి. 1962లో ఈ అంశం మీద అమెరికా ప్రభుత్వంతో మాట్లాడడానికి గాంధీ శాంతి మండలి తరఫున వెళ్లిన బృందానికి నాయకుడు రాజాజీ. అప్పుడే అక్కడ ఉన్న దౌత్యవేత్త కె. నట్వర్‌సింగ్ రాజాజీతో ముచ్చటించారు. మంచి ప్రశ్నలే రాజాజీని ఆయన అడిగారు. దేశ విభజనకి మొదట గాంధీజీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా, తరువాత ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయన అలా వెనక్కి తగ్గడం అప్పుడు నాలాంటి యువకులందరికీ పెద్ద షాక్ అన్నారు నట్వర్. గాంధీజీ చాలా గొప్పవారు. కాదనలేం. కానీ తరువాతి పరిణామాలతో ఆయన చాలా నిరాశలో కూరుకుపోయారు. చివరికి మీరంతా అంగీకరిస్తే, మీతో పాటే నేను అనేశారు అని చెప్పారు రాజాజీ. ఆపై,‘మీరు జీవిత చరిత్ర ఎందుకు రాయలేదు?’ అని అడిగారు నట్వర్‌సింగ్. ‘ఖాళీ ఎక్కడ దొరికింది?’ అన్నారు రాజాజీ. వైస్రాయ్గా ఉన్నప్పుడు బోలెడు సమయం దొరికి ఉండాలి మీకు అని అన్నారు నట్వర్‌సింగ్. అందుకు నవ్వుతూ సమాధానం చెప్పారు, రాజాజీ. ‘నిజమే, అక్కడ చాలా వెసులుబాటు దొరికిన మాట నిజం. కానీ ప్రధానికీ, ఉప ప్రధానికీ (నెహ్రూ, పటేల్) మధ్య నిత్యం జరిగే కీచులాటలు పరిష్కరించడానికే నా సమయమంతా గడచిపోయింది’ అన్నారు రాజాజీ. ‘అప్పుడే, నీవు నాతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వచ్చి ఉండాల్సింది’ అన్నారు నట్వర్‌తో. ‘అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చురుకుగా కనిపించారు. వాళ్లు నన్ను అర్థవంతమైన ప్రశ్నలు అడిగారు. అందులో ధర్మం అంటే ఏమిటి; కర్మ అంటే ఏమిటి అన్న ప్రశ్నలు ఉన్నాయి. ధర్మం అంటే, ప్రపంచ ప్రజలందరి బాధ్యత, అలాగే సహజ ఆదేశం అని చెప్పాను. అందుకు వాళ్లు, అంటే సోషలిజమే కదా అన్నారు. సోషలిజమే, కానీ అది స్వచ్ఛందంగా ఉండాలి. భారత్‌లో సోషలిజం మాదిరిగా కాదు అని చెప్పాను’ అన్నారు రాజాజీ. మళ్లీ, అది బహిరంగ సమావేశం కాదులే, అందుకే అలా చెప్పాను అన్నారాయన. ఉద్యమం, సంస్కృతి, సంస్కరణ, సాహిత్యం, పాలనా దక్షత మేళవించిన అరుదైన నాయకుడు రాజాజీ. ఆయన ప్రభావం కాదనలేనది. గాంధీజీ ఉద్దేశంలో రాజాజీ అంటే భారతీయ ఆత్మను కదలించినవారు. - డా. గోపరాజు నారాయణరావు -
తొలి స్వదేశీ విద్యా పీఠం!
దేశంలోనే తొలిసారిగా ఆంగ్లేతర మాధ్యమంలో ఏర్పాటైన ఉస్మానియా యూనివర్సిటీ - ఉర్దూ భాషలోనే బోధన.. ప్రపంచ భాషల నుంచి పుస్తకాల తర్జుమా - తొలి స్వదేశీ విద్యాపీఠమంటూ ప్రశంసించిన రాజగోపాలాచారి - మొదట 25 మంది అధ్యాపకులు.. 225 మంది విద్యార్థులు - నాటి ఎడ్యుకేషన్ హబ్‌గా నిలిచిన గన్‌ఫౌండ్రీ ప్రాంతం - అప్పట్లోనే ప్రపంచ ఖ్యాతి పొందిన ఉస్మానియా - ఓయూ పట్టభద్రులకు విదేశీ విద్యాలయాల్లో నేరుగా ప్రవేశం - 1920లో మెట్రిక్.. 1926లో బీఏ పరీక్షల నిర్వహణ - ఉన్నత విద్యా వ్యాప్తికి బీజం వేసిన యూనివర్సిటీ - స్వాతంత్య్రానంతరం ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు వివిధ భాషలు, మతాల ప్రజల సమ్మేళనం హైదరాబాద్ సంస్థానం. అలాంటి సంస్థానం స్థానిక భాషకు పట్టం కట్టింది. బ్రిటిషు వలస పాలకులు పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆంగ్ల మాధ్యమంలో వ్యాప్తి చేసిన తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా ఉర్దూ మీడియంతో ఉస్మానియా యూనివర్సిటీని నెలకొల్పింది. ప్రపంచ భాషల్లోని సబ్జెక్టు పుస్తకాలను ఉర్దూలోకి అనువాదం చేయించి మరీ బోధన కొనసాగించింది. ఇదే సమయంలో అత్యుత్తమ విద్యకు ఉస్మానియా ప్రపంచ ఖ్యాతి పొందింది. స్వాతంత్య్రానంతరం ఆంగ్ల మాధ్యమంలో బోధనకు మారింది. ఈ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.. (మహ్మద్ మంజూర్, చింతకింది గణేశ్) నాలుగో నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా (1869–1911) కాలం అది. హైదరాబాద్ నగరంలో స్కూళ్లు, కాలేజీలకు పక్కా భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. వివిధ ప్రదేశాలను సందర్శించి.. ఫతే మైదాన్ (ప్రస్తుత లాల్ బహదూర్ స్టేడియం) ప్రక్కన ఉన్న గన్‌ఫౌండ్రీ ప్రాంతంలోని విశాలమైన భూములను ఎంపిక చేశారు. 1872లో ఆలియా బాలుర హైస్కూల్, మహబూబీయా బాలికల హైస్కూల్ భవనాలు నిర్మించారు. వాటికి ఎదురుగా 1887లో నిజాం కాలేజీని నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంలో విశ్వవిద్యాలయం లేకపోవడంతో నిజాం కాలేజీకి మద్రాస్ విశ్వవిద్యాలయంతో అనుబం«ధ గుర్తింపు ఉండేది. స్కూళ్లు, కాలేజీలు ఉండడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కోసం ఇక్కడే భవనాలు అద్దెకు తీసుకుని యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. (1919–1939) మధ్య గన్‌ఫౌండ్రీ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందింది. 25 మంది అధ్యాపకులు..225 మంది విద్యార్థులు 1917 ఏప్రిల్ 26న విశ్వవిద్యాలయం ప్రకటన జరిగినప్పటి నుంచి 1919 డిసెంబర్ 28 వరకు.. గన్‌ఫౌండ్రీలోని మస్రత్ మహల్ (ప్రస్తుత ఎస్బీఐ భవనం)తో పాటు అబిడ్స్ వెళ్లే మార్గంలోని ఆరు భవనాల్లో వర్సిటీకి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో ప్రముఖ విద్యావేత్త సర్ రాస్ మసూద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 25 మంది అధ్యాపకులను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ సంస్థానం నుంచి వెళ్లి విదేశాల్లో చదివిన వారితోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రొఫెసర్లూ ఉన్నారు. ఇక రాతపరీక్షలు నిర్వహించి ఆర్ట్స్ విభాగంలోని వివిధ సబ్జెక్టుల్లో 225 మంది విద్యార్థులçకు అడ్మిషన్లు ఇచ్చారు. అయితే తొలినాళ్లలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక్కో సబ్జెక్టు తరగతుల కోసం వివిధ భవనాల్లోకి మారాల్సి వచ్చేది. ఇంగ్లిషేతర భాషలో బోధన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో అప్పటి వరకు ఏర్పాటైన విశ్వ విద్యాలయాల్లో ఆంగ్లమే బోధనా భాషగా ఉండేది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో పాఠశాలలు, కాలేజీలన్నీ ఉర్దూ భాషలో కొనసాగేవి. అయితే 19వ శతాబ్దం చివరలో మొదటి సాలార్జంగ్ చొరవతో ఇంగ్లిషు మీడియం విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. బ్రిటిష్ స్కూళ్ల మాదిరిగా మదర్సా–ఆలియా, మదర్సా–ఐజా పాఠశాలలను స్థాపించారు. తర్వాత నిజాం కాలేజీలోనూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టారు. అయితే సంస్థానంలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉర్దూ భాషలోనే చదువుతున్నారన్న ఉద్దేశంతో ఉర్దూ మీడియంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పుస్తకాల కోసం ‘దారుల్ తర్జుమా’ ఉస్మానియాను ఉర్దూ మీడియంలో కొనసాగించాలని నిర్ణయించారుగానీ.. అప్పటికి బోధనా పుస్తకాలన్నీ ఆంగ్లం, పర్షియన్, అరబ్బీ తదితర భాషల్లో ఉన్నాయి. దీంతో ఆయా సబ్జెక్టుల పుస్తకాలను ఉర్దూలోకి అనువాదం చేయడానికి 1917 సెప్టెంబర్ 6న అప్పటి విద్యావేత్త అబ్దుల్‌హక్ నేతృత్వంలో దారుల్ తర్జుమా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉర్దూ, ఆంగ్లం, పర్షియన్ భాషలపై పట్టున్న అనువాదకులను దేశ విదేశాల నుంచి రప్పించారు. 1920లో మెట్రిక్..1926లో బీఏ పరీక్షలు.. 1919 డిసెంబర్ 28న ఉస్మానియా వర్సిటీ భవనం ప్రారంభమైనా.. విద్యా సంవత్సరం (1919–20) జూన్ నెల నుంచే మొదలైంది. ఆ విద్యా సంవత్సరం చివర్లో ఉస్మానియా వర్సిటీ ద్వారానే తొలి మెట్రిక్ (పదకొండో తరగతి, హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్) పరీక్షలు నిర్వహించి, సర్టిఫికెట్లు జారీ చేశారు. 1968–69 వరకు ఇదే విధానం కొనసాగింది. 1969 విద్యా సంవత్సరం నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి ఎస్ఎస్సీ (10వ తరగతి, సెకండరీ స్కూల్ సర్టిఫికెట్) ఇస్తున్నారు. ఇక వర్సిటీ ఆధ్వర్యంలో 1926లో తొలిసారిగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) పరీక్షలు నిర్వహించారు. తొలి స్వదేశీ విద్యాపీఠమంటూ కితాబు 1944లో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో దేశ, విదేశ విద్యాలయాల కులపతులు, ఉపకులపతులు, విద్యావేత్తలు, వివిధ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేస్తున్న వారు పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమకారుడు, న్యాయవాది అయిన రాజగోపాలాచారి కూడా హాజరై ప్రసంగించారు. దేశంలో మైసూర్, మద్రాస్ వర్సిటీల్లో ఆంగ్లభాషలో బోధన జరుగుతోందని.. ఉస్మానియాలో మాత్రం దేశీ భాష అయిన ఉర్దూలో బోధన జరగడం గర్వకారణమని, ఉస్మానియా తొలి స్వదేశీ విద్యాపీఠమని కితాబిచ్చారు. విదేశీ వర్సిటీల్లో నేరుగా ప్రవేశం ఉస్మానియా విద్యా ప్రమాణాలకు అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేది. ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులు మరిన్ని డిగ్రీలు, పైచదువుల కోసం ఇతర దేశాల్లోని యూనివర్సిటీలకు వెళితే.. ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా నేరుగా అడ్మిషన్ ఇచ్చేవారు. దేశంలోని ఇతర వర్సిటీల్లో చదివిన వారికి ఈ అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఉన్నత విద్యా వ్యాప్తికి ఉస్మానియా వర్సిటీ ఇతోధికంగా కృషి చేసింది. 1920–30 దశకాల్లో సిటీ కాలేజీ, నాంపల్లి బాలికల కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, టీచర్స్ ట్రైనింగ్ కాలేజీ, వరంగల్ ఇంటర్మీడియట్ కాలేజీలను స్థాపించింది. 1948లో నిజాం పాలన ముగిసేనాటికి ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో 11 ఆర్ట్స్ సైన్స్ కాలేజీలు, 7 వృత్తి విద్యా కాలేజీలు కలిపి మొత్తంగా 18 కాలేజీల్లో 6,239 మంది ఉన్నత విద్యను అభ్యసించారు. ఉర్దూ నుంచి మళ్లీ ఆంగ్లానికి.. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత్‌లో విలీనమయ్యాక కూడా ఉస్మానియాలో ఉర్దూ మీడియంలో విద్యా బోధన కొనసాగింది. 1950లో అప్పటి ప్రధాని నెహ్రూ, కేంద్ర విద్యామంత్రి మౌలానా ఆజాద్ అధికార పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటి రాష్ట్ర పాలకులు, ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్‌తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ప్రధాని నెహ్రూ, మౌలానా ఆజాద్‌లకు నిజాం ఉస్మాన్ అలీఖాన్ కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఉస్మానియాను తాను ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశానని, దానిని అదే పద్ధతిలో కొనసాగించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన నెహ్రూ, ఆజాద్‌లు.. ఉస్మానియాలో ఉర్దూకు బదులు ఆంగ్ల భాషలో బోధనలు జరగాలని నిర్ణయించారు. దేశంలోని వర్సిటీలన్నీ ఆంగ్లంలో బోధిస్తున్నందున.. పరస్పరం సహకారానికి అనువుగా ఉంటుందన్నారు. అలా ఉస్మానియా లో 1950 నుంచి ఆంగ్లంలో బోధన మొదలైంది. ఉన్నత విద్యాశిఖరం ‘‘గత వందేళ్లలో కోటి మందికిపైగా విద్యార్థులకు ఉస్మానియా వర్సిటీ విద్యను అందించింది. ఆధునిక యుగంలో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగాల పురోగ తికి వర్సిటీ తోడ్పడింది. ఉర్దూ మీడియంలో బోధన జరిగినా ఆంగ్ల భాషనూ బోధించారు. దక్కన్ మిశ్రమ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ఆధునికతను పెంపొందించడంలో ఉస్మానియా పాత్ర మరువలేనిది..’’ – ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్