breaking news
Rail way stations
-
బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి
దసరా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. తెలంగాణలో దసరా సెలవులు పొడిగించడం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పండుగ సెలవుల మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి గమ్యస్థానాలకు బయలుదేరుతుండటంతో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ అధిక టికెట్ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి. సాక్షి, విజయవాడ : స్వస్థలాలు, ఉద్యోగ ప్రాంతాలు, చదువుకునే ప్రదేశాలకు వెళ్లేవారు.. వచ్చేవారితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గత మంగళవారం విజయదశమి వేడుకలు ముగిసినప్పటికీ ఇప్పటికీ ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం సుమారు 250 ప్రత్యేక బస్సులతో సేవలందించిన ఆర్టీసీ శనివారం 80 బస్సులు నడిపింది. ఆదివారం 100కుపైగా ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. బస్సులు, రైళ్లు ఫుల్.. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా అన్నీ నిండిపోతున్నాయి. రాత్రి అయ్యే సరికి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అర్ధరాత్రి దాటేవరకు రద్దీ తగ్గడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతో వారం రోజులుగా రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక బాదుడు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రత్యేక బస్సులను ఏ రోజుకు ఆ రోజు పెంచుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే ప్రత్యేక బస్సులు వేస్తున్నారుకుంటే పొరపాటు పడినట్టే. ఈ బస్సులు, రైళ్లలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సులనే దూర ప్రాంతాలకు నడిపేస్తున్నారు. ఈ సిటీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, అన్నవరం, బెంగళూరు, చెన్నై, కడప, కర్నూలుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇక రైల్వే ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా.. అవి సకాలంలో రావడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో రెట్టింపు ధరలు బస్‌స్టేషన్ (విజయవాడ): రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుండటంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వారు రెట్టింపు ధరలతో ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో రేట్లు అమాంతంగా పెంచేశారు. ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే దూరాన్ని, రద్దీని బట్టి ఒక్కో టికెట్టుపై వెయ్యి, రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. -
సిగ్నల్స్ వైర్లు కట్ చేసి రైళ్లలో చోరీ
-
ప్లాన్ ప్రకారం రైళ్లలో చోరీలు
సాక్షి, అనంతపురం : జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ప్లాన్ ప్రకారం సిగ్నల్స్ వైర్లు కట్ చేసి రాయలచెరువు, జూటూరు రైల్వే స్టేషన్లలో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించక పోవటంపై బాధితులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాపం.. పసివాళ్లు!
కార్మిక శాఖ, రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం), పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా బుధవారం (గత నెల 29వ తేదీ) అనంతపురం నగరంలో దాడులు నిర్వహించారు. గంటల వ్యవధిలోనే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 45 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 14 ఏళ్లలోపు పిల్లలు 35 మంది ఉన్నారు. స్థానిక పాతవూరు, కమలానగర్, టవర్‌క్లాక్, రైల్వేస్టేషన్, సుభాష్‌రోడ్డులోని దుకాణాలు, మెకానిక్ షెడ్లు, ఇతరత్రా వీరు పనిచేస్తూ దొరికారు. ఈ పిల్లలతో పాటు, వారి తల్లిదండ్రులు, షాపుల యజమానులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులుండే నగరంలోని రెండు,మూడు ప్రాంతాల్లోనే ఇంతమంది బాల కార్మికులు ఉంటే.. ఇక జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఆటపాటల మధ్య చదువు కోవాల్సిన పిల్లలు దుకాణాల్లో పని చేస్తూ, భవన నిర్మాణాల్లో రాళ్లెత్తుతూ కనిపిస్తున్నారు. చట్టాలెన్ని ఉన్నా రోజు రోజుకూ వీరి సంఖ్య పెరుగుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6-14 ఏళ్లలోపు పిల్లలు బడిలోనే ఉండాలి. ఈ చట్టం అమలుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా నగరాలు, పట్టణాల్లో ఏ వీధిలో చూసినా బడిఈడు పిల్లలు కనిపిస్తున్నారు. మెకానిక్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ, భవన నిర్మాణ కార్మికులుగానూ పనిచేస్తున్నారు. ‘14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం’, ‘పిల్లలుండాల్సింది పనిలోకాదు... బడిలో’ లాంటి నినాదాలు గోడరాతలు, స్టిక్కర్లు, వాల్పోస్టర్లకే పరిమితమవుతున్నాయి. కుటుంబ యజమానులు లేకనో, ఇతర కారణాల వల్లనో పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. కొందరు తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు. సమన్వయ లోపం బాల కార్మికులు, డ్రాపౌట్స్ పిల్లలను గుర్తించి బడిబాట పట్టించడంలో రాజీవ్ విద్యా మిషన్‌ది కీలక బాధ్యత. వారితో పాటు కార్మిక, ఐసీడీఎస్, ఐసీపీఎస్, ఎన్సీఎల్పీ, పోలీసు శాఖ అధికారులు కూడా బాల కార్మికులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే.. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఎప్పుడో ఒకసారి హడావుడి చేయడం, తర్వాత ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. కార్మికశాఖ 2013లో దాదాపు 158 బాల కార్మిక కేసులు నమోదు చేసింది. అంతటితో తమ పనైపోయిందని విడిచిపెట్టింది. దీంతో చాలామంది పిల్లలు తిరిగి పనుల్లో చేరిపోయారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా కేవలం కౌన్సెలింగ్‌తో సరిపెడుతుండడంతో చాలామంది పిల్లలు తిరిగి ‘పనిబాట’ పడుతున్నారు. 2012-13లో 4,752 మంది బడి బయట పిల్లలు 2012-13 విద్యా సంవత్సరంలో అంగన్వాడీ కార్యకర్తలు జిల్లాలో సర్వేచేసి 4,752 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. ఈ జాబితా ఆధారంగా ఆర్వీఎం రాష్ట్ర అధికారులు కేజీబీవీ స్పెషల్‌ఆఫీసర్లు, ఐఆర్టీలతో తిరిగి సర్వే చే యించారు. చాలామంది వయసు మీరి పెళ్లిళ్లు అయిన వారు, వేరే ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారిగా తేలింది. మొత్తమ్మీద చివరకు 1,726 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. వీరిని విడతల వారీగా సమీప పాఠశాలలు, ఆర్‌ఎస్‌టీసీల్లో చేర్పించినట్లు ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది బడిబయట పిల్లలపై సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో కనిపించని ప్రత్యేక పోలీసు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఒక కానిస్టేబుల్‌ను నియమించాల్సి ఉంది. సదరు కానిస్టేబుల్ తన స్టేషన్ పరిధిలోని బాల కార్మికుల కేసులను పర్యవేక్షించాలి. తరచూ కౌన్సెలింగులు నిర్వహించాలి. అయితే.. ఏ ఒక్క పోలీస్ స్టేషన్లోనూ ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించిన దాఖలాలు లేవు. సెంథిల్‌కుమార్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి స్టేషన్లోనూ ఒక పోలీసును ఏర్పాటు చేశారని చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. చర్యలు తీసుకుంటున్నాం బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది గుర్తించిన వారిలో పాఠశాల స్థాయికి అర్హులైన అందరినీ చేర్పించాం. వలసలు వెళ్లిన కుటుంబాలు, 14 ఏళ్ల పైబడిన వారు అక్కడక్కడ ఉండొచ్చు. బడిఈడు పిల్లలపై తాజాగా సర్వే చేయిస్తున్నాం. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత గుర్తించిన పిల్లలను వారి స్థాయిని బట్టి ఆయా పాఠశాలల్లో చేర్పిస్తాం. - కేఎస్ రామారావు, ఆర్వీఎం పీఓ