breaking news
ragpickers
-
చోరీకి యత్నించిన మహిళలకు దేహశుద్ధి
బాపట్ల : గుంటూరు జిల్లా బాపట్ల మండలం చర్లపాడులో శనివారం ఇద్దరు మహిళలు చోరీకి యత్నిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ది చేశారు. చల్లపాడులోని ఎలక్ట్రీషియన్ షేక్ సైదా ఇంట్లోకి శనివారం ఇద్దరు మహిళలు చోరబడి ఇంట్లోని వస్తువులన్నీ మూటగట్టి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కుటుంబసభ్యులు వారి ప్రయత్నాన్ని అడ్డుకుని.. వారికి దేహశుద్ది చేశారు. చెత్తలో ప్లాస్టిక్ వస్తువులు ఏరుకునే ఇద్దరు మహిళలు అటుగా వెళుతూ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో షేక్ సైదా ఇంట్లోకి చోరబడ్డారు. ఇంట్లో కనిపించిన వస్తువులన్నీ తీసుకుని మూటకట్టి తీసుకెళుతుండగా పెరట్లో ఉన్న కుటుంబసభ్యులు చూసి వారిని పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ది చేసి చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని... పోలీసులకు అప్పగించారు. -
చెత్త ఏరుకుంటూ.. జెనీవా వరకు!
పుణే: పొట్టకూటి కోసం పుణేకి వచ్చాం. మా కులం మూలంగా మాకు ఎక్కడా ఏ ఉద్యోగమూ దొరకలేదు. చాలా బాధలు పడ్డాం.. దాంతో వేరే గత్యంతరం లేక పాత ఇనుప సామానులు, చిత్తు కాగితాలు, చెత్త సేకరించడం మొదలుపెట్టా. చెత్త సేకరించేటపుడు మొదట్లో స్థానికుల నుంచి, పోలీసుల నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నా. దేనికి దాన్ని ప్రత్యేకంగా విడదీయడం వల్ల వచ్చే లాభాలు తెలుసుకున్నా... ఇలా అనర్గంళంగా సాగిపోతోంది. సాక్షాత్తు జెనీవా ప్రపంచ సదస్సులో... ఓ 50 ఏళ్ల చెత్త ఏరుకునే మహిళా కార్మికురాలి ప్రసంగం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన సుమన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అందించే అరుదైన పురస్కారాన్ని దక్కించుకుంది. జూన్ 1నుంచి l3 వరకు జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంది. ప్రపంచవ్యాప్తంగా హాజరైన 2000 మంది నిపుణులు ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వివరాల్లోకి వెళితే.. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చెత్త ఏరడాన్ని వృత్తిగా స్వీకరించిన సుమన్. ఈ క్రమంలో స్థానికుల నుంచి దొంగ అనే అవమానాలను భరించింది. అకారణంగా పోలీసుల వేధింపులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే తన తోటి వారినందరినీ ఏకం చేసి కెకెపికెపి (కచరా, కాగజ్, పత్ర, కష్టాకారీ పంచాయత్) అనే సంఘాన్ని ఏర్పాటచేసింది. తమ హక్కుల కోసం పోరాడింది. తన అనుభవాలను తన సంఘంతో పంచుకుని వేస్ట్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అలా స్థానిక మున్సిపాలిటీ దృష్టిలో పడింది. నగరంలోని పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు మున్సిపాలిటీ అధికారులతో కలిసి వేస్టే మేనేజ్మెంట్ పథకాన్ని విజయవంతంగా అమలుచేసింది. దీంతో ఇటు నగరాభివృద్ధికి, తన తోటి కార్మికుల సంక్షేమానికి చేసిన కృషికి గాను అరుదైన గౌరవ పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు 37 ఏళ్లుగా తాను ఈ వృత్తిలో ఉన్నానని, తన నలుగురు పిల్లల్ని చదివించుకోడానికి పస్తులు కూడా ఉన్నానని సుమన్ చెప్పారు. తన పిల్లలందరూ బాగా సెటిల్ అవ్వడంతో తన సంపాదన అంతా మురికివాడల్లో ఉండే పిల్లల చదువుల కోసం వెచ్చిస్తోందని సుమన్ బంధువు శ్వేత చెప్పారు. అంతేకాదు పిల్లలు క్రమంగా స్కూళ్లకు వెడుతున్నారో లేదో స్వయంగా తానే పర్యవేక్షిస్తుందనీ, ఈ విషయం తామందరికీ చాలా గర్వంగా ఉందన్నారు. ఆమె నలుగురు పిల్లల్లో ఒకరు డబుల్ మాస్టర్ డిగ్రీ సాధించి జర్నలిస్టుగా పనిచేస్తుండగా, మరొకరు సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. పెద్ద కూతురికి పెళ్లి చేసింది. -
ఇక చెత్త ఏరుకునే వారికి అవార్డులు
ముంబయి: చిత్తుకాగితాలు ఏరుకునేవారంటే అందరికీ ఓ రకమైన ఏవగింపే. కానీ, ఇకనుంచి వారికి కూడా సమాజంలో మంచి గుర్తింపు లభించనుంది. పురస్కారాలు లభించనున్నాయి. చిత్తుకాగితాలు ఏరుకునే వారికి కూడా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుందని పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. 'చిత్తుకాగితాలు ఏరడం అనేది చెప్పుకునేంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలా కాలంగా అది అత్యంత ముఖ్యమైన రంగం. వారు రోజంతా ఎంతో కష్టపడతారు. ఎన్నో నగరాలు విడుస్తున్న చెత్తచెదారాన్ని వేరు చేస్తూ పర్యావరణానికి మంచి చేస్తుంటారు. ఏళ్లుగా వారు సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. అందుకే మేం వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుంచి యేటా అవార్డులు ఇస్తాం' అని జవదేకర్ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో తమ శాఖ సాధించిన విజయాలపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.