breaking news
Qualcomm chairman
-
అదానీతో క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో భేటీ
న్యూఢిల్లీ: చిప్‌ల తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఆర్ ఎమోన్, అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ సోమవారం సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు మొదలైన వాటి పాత్ర గురించి ఈ సందర్భంగా చర్చించినట్లు సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. చెన్నైలో రూ. 177 కోట్లతో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్ సెంటర్‌ను మార్చి 14న ఎమోన్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వై–ఫై టెక్నాలజీలకు అనుబంధ ఆవిష్కరణలు లక్ష్యంగా కొత్త సెంటర్ వైర్లెస్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఈ సెంటర్ రూపొందించనుంది. మరోవైపు, తమ సొంత పోర్టులు, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి తదితర విభాగాల అవసరాల కోసం స్వల్ప మొత్తంలో తీసుకున్న 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి ఉపయోగపడే సొల్యూషన్స్ కోసం అదానీ అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్టియానో, అదానీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత్‌పై క్వాల్కామ్ దృష్టి
ఐటీ, టెలికం మంత్రులతో క్వాల్కామ్ చైర్మన్ సమావేశం న్యూఢిల్లీ: మొబైల్ చిప్‌ల విభాగంలో ప్రపంచ అగ్రగామి కంపెనీ క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పౌల్జాకబ్స్ సోమవారం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, టెలికం మంత్రి మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. శాటిలైట్ అనుసంధాన ప్రాజెక్టుతోపాటు భారత్‌లో చిప్‌ల తయారీపై చర్చించారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ, శాటిలైట్ ఆధారిత సమాచార నెట్వర్క్ ‘వన్ వెబ్’పై ఐటీ మంత్రితో చర్చించగా.. వన్ వెబ్‌పై టెలికం మంత్రితోనూ సమాలోచనలు జరిపారు. వన్ వెబ్ ప్రాజెక్టును క్వాల్కామ్ 2019-20లో ప్రారంభించే యోచనలో ఉంది. శాటిలైట్ ప్రాజెక్టుపై చర్చలు ‘శాటిలైట్ కంపెనీ వన్ వెబ్‌లో పెట్టుబడుల గురించి చర్చించాం. 700 శాటిలైట్లను నిర్మించి 2019-20 నాటికి ప్రారంభించనున్నాం. మారుమూల ప్రాం తాలకు బ్రాండ్‌బ్యాండ్ అనుసంధానాన్ని ఈ ప్రాజెక్టు కల్పిస్తుంది. దాంతో ఆయా ప్రాంతాలు సైతం మిగిలిన నెట్‌వర్క్‌తో కలసిపోతాయి’ అని సమావేశం అనంతరం పౌల్జాకబ్స్ వెల్లడించారు. పాఠశాలలకు, ఆస్పత్రులకు బ్రాడ్‌బ్యాండ్ అందించాలనుకుంటున్నామని చెప్పారు. దేశంలో చిప్సెట్ తయారీని ఎప్పుడు ప్రారంభించబోతున్నారన్న విలేకరుల ప్రశ్నలకు జాకబ్స్ స్పందిస్తూ... దీనిపై చిప్ తయారీదారులతో ప్రాథమిక స్థాయి చర్చలు జరిపామని, ఇంకా తయారీ వివరాలు వెల్లడించే దశకు రాలేదని చెప్పారు. కాగా, స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర చాలా అధిక స్థాయిలో ఉందని జాకబ్స్ అభిప్రాయపడ్డారు. వన్‌వెబ్...: వన్‌వెబ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను తక్కువ భూ కక్ష్య(ఎల్ఈవో)లో వందలాది ఉపగ్రహాలతో ఒక సమూహంగా ఏర్పాటు చేస్తారు. ఈ ఉపగ్రహాలు భూమిపై 1200 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఒకదానికొకటి సమన్వయంతో పనిచేస్తూ అతిపెద్ద అనుసంధాన ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుత జియోసింక్రనస్ విధానంలో ఉపగ్రహాలు భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. అయితే, వన్‌వెబ్ ప్రాజెక్టులో ఉపగ్రహాలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల అవి స్పందించే సమయం తగ్గిపోతుంది.