భక్తుల కొంగుబంగారం ముక్తీశ్వరుడు పుష్కరాలు : ఇక్కడి స్పెషల్ ఏంటంటే..?
రాష్ట్రంలోని మహాప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన మహాక్షేత్రం కాళేశ్వరం. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం కాళేశ్వర–ముక్తీశ్వరులు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల భక్తులతో నిత్యం పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఈనెల 15నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కర శోభను సంతరించుకోనుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టం పై రెండు శివలింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈలింగాలలో ఒకటి కాలుడు (యముడు), ముక్తీశ్వరుడు(శివుడు)గా వెలిసినట్లు పురాణాలు పేర్కొంటున్నా యి. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికారంధ్రాలు ఉంటాయి. అందులో ఎన్ని బిందెల నీళ్లు పోసి నా బయటకు కనిపించవు. ఆ నీరు సొరంగ మార్గం గుండా గోదావరిలో కలుస్తుందని పూర్వీకులు తెలుపుతున్నారు. గర్భగుడికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజ స్తంభాలు, నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్రం విశేషం. కాళేశ్వరం క్షేత్రం గోదావరి పరీవాహక ప్రాంతం కావడంతో మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరి, అంతర్వాహిణి సరస్వతీ నదులు కలిసిన క్షేత్రం కాళేశ్వరమని ప్రాచుర్యంలో ఉంది. కాళేశ్వరం క్షేత్ర నిర్మాణం..పూర్వం యమ ధర్మరాజు ఓ కార్యం నిమిత్తం స్వర్గలోకంలో ఇంద్రుడి వద్దకు వెళ్లాడు. ఇంద్రలోకంలోని వైభవాలు చూశాడు. ప్రజలు ఇక్కడ సుఖసంతోషంగా ఉంటూ యమ లోకానికి రావడానికి ఇష్టపడడం లేదు. వీరంతా ఆ మహాశివుడిని పూజిస్తున్నట్లు తెలుసుకున్నాడు. మహాశివుడిని పూజిస్తే కోరికలు తీరుతాయని గ్రహించి ముక్తీశ్వర ఆలయం ఎదుట 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ముక్తీశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును తపస్సు ఎందుకు చేస్తున్నావు..నీ కోరిక ఏంటని ప్రశ్నించాడు.అందుకు యమధర్మరాజు నీవు భక్తులకు సర్వపాపాలు తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తూ కైలాసానికి పంపుతున్నావు. యమలోకంలో నాకు పని లేకుండా పోయిందని పేర్కొన్నాడు. అందుకోసం ముక్తీశ్వరాలయంలో నీ లింగం పక్కనే నాకు చోటు కల్పించి భక్తులు నీకంటే ముందు నన్నే పూజించాలని ముక్తీశ్వరుడితో వేడుకున్నాడు. అందుకు ముక్తీశ్వరుడు తన పక్కన ఆలయంలో చోటు కల్పించాడు. అందుకే కాలుడు, ముక్తీశ్వరుడు ఇద్దరు వెలిసిన నేపథ్యంలో ‘కాళేశ్వరం’ అనే పేరు వచ్చినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అదేవిధంగా కాళేశ్వరమనే పట్టణం నిర్మింతమైంది. ఈ ఆలయంలో ఒకే పానవట్టం పై ఓవైపు యముడు, మరోవైపు శివుడు కొలువయ్యారు. ముందు యముడి(కాలుడు)ని కొలిచిన తర్వాతే శివు(ఈశ్వరుడు)డిని భక్తులు ఆరాధిస్తారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తజనులతో ప్రాచుర్యంలోకి వచ్చిందని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానాలయంతో పాటు మహాసరస్వతి, శ్రీశుభానందాదేవి అమ్మవారి ఆలయాల్లో భక్తులు పూజలు చేస్తారు.శ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలుశ్రాద్ధ త్రికోటి సరస్వతీనది పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా పితృదేవతలకు తీర్థశ్రాద్ధాలు, పిండప్రదానాలు ముఖ్యం. సంకల్ప స్నానాలు చేయాలి. నదీపూజ తప్పని సరి చేయాలి. -పనకంటి ఫణీంద్రశర్మ, ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానంప్రయాగ కన్నా త్రివేణి స్నానం గొప్పనదిలో 12 రోజుల పాటు స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుంది. 33 కోట్ల దేవతామూర్తులు నది జలాల్లో సంచరిస్తారు. పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. త్రివేణి సంగమం కలిసే చోట అంతర్వాహిణి సరస్వతీనదిలో పుష్కర స్నానం చేస్తే ప్రయాగ నది కన్నా కోటిరెట్ల పుణ్యమని పురాణాల్లో ఉంది. పుష్కర స్నానంతో సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. -త్రిపురారి కృష్ణమూర్తిశర్మ, రిటైర్డ్ ఉపప్రధాన అర్చకుడు, కాళేశ్వరం దేవస్థానం