breaking news
public treasury
-
స్పెక్ట్రం @ రూ. 1.10 లక్షల కోట్లు
ముగిసిన వేలం 19 రోజులు, 115 రౌండ్లు బరిలో 8 కంపెనీలు కాల్, డేటా చార్జీలకు రెక్కలు? న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో ఆదాయం తెచ్చిపెడుతుందని భావించిన టెలికం స్పెక్టం వేలం ఎట్టకేలకు ముగిసింది. వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ. 1.10 లక్షల కోట్లు రానున్నాయి. 19 రోజుల పాటు 115 రౌండ్లు సాగిన వేలం బుధవారంతో ముగిసినట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బేస్ ధర ప్రకారం రూ. 82,395 కోట్లు రావాల్సి ఉండగా.. వేలంలో నికరంగా రూ. 1,09,847 కోట్ల మేర బిడ్లు వచ్చినట్లు ఆయన వివరించారు. ‘ఇది దేశ చరిత్రలోనే అత్యధికం. 2010లో రూ. 1,06,000 కోట్లు వచ్చినా అందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నుంచే రూ. 30,000 కోట్లు వచ్చాయి. ఈసారి మాత్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లేకుండానే లక్ష కోట్ల పైచిలుకు బిడ్లు వచ్చాయి’ అని మంత్రి పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వుల కారణంగా స్పెక్ట్రం దక్కించుకున్న సంస్థల పేర్లు వెల్లడించలేదు. వేలం మార్గదర్శకాలు, అర్హతా నిబంధనలను ప్రశ్నిస్తూ దాఖలైన వివిధ కేసులపై సుప్రీం కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం నాలుగు బ్యాండ్‌విడ్త్‌లలో అమ్మకానికి ఉంచిన స్పెక్ట్రంలో 11 శాతం మిగిలిపోయింది. రెండు స్పెక్ట్రం బ్యాండ్లకు సంబంధించి కొన్ని సర్కిళ్లలో రెట్టింపు ధరలకు టెల్కోలు బిడ్లు దాఖలు చేశాయి. వేలం ఎందుకంటే.. పలు టెలికం సంస్థలకు వివిధ సర్కిళ్లలో ఉన్న పర్మిట్ల గడువు 2015-16తో ముగియనుంది. ఐడియా సెల్యులార్వి తొమ్మిది, రిలయన్స్ టెలికం.. వొడాఫోన్వి చెరి ఏడు, భారతీ ఎయిర్‌టెల్‌వి ఆరు పర్మిట్లు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో స్పెక్ట్రం వేలం నిర్వహించాల్సి వచ్చింది. వీటితో పాటు 2013, 2014 వేలంలో మిగిలిపోయిన స్పెక్ట్రంను కూడా కలిపి కేంద్రం వేలం నిర్వహించింది. 2జీ సేవలకు ఉపయోగపడే 9,00, 1,800 మెగాహెర్ట్జ్, సీడీఎంఏ సేవలకు ఉపయోగించే 800 మెగాహెట్జ్, 3జీ సర్వీసుల కోసం ఉపయోగపడే 2,100 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్‌లలో మొత్తం 385.75 మెగాహెర్ట్జ్ మేర స్పెక్ట్రంను 17 సర్కిళ్లలో వేలానికి ఉంచింది. వేలంలో మొత్తం 8 కంపెనీలు బరిలో నిల్చాయి. ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ తమ తమ స్పెక్ట్రం చేజారకుండా చూసుకునేందుకు పోటీపడ్డాయి. రిలయన్స్ జియో, టాటా టెలిసర్వీసెస్, టె లివింగ్స్ (యూనినార్), ఎయిర్‌సెల్ మాత్రం అదనంగా స్పెక్ట్రం దక్కించుకునేందుకు వేలంలో పాల్గొన్నాయి. చెల్లించాల్సిన తీరు ఇదీ .. టెలికం ఆపరేటర్లు వాయిదా చెల్లింపుల పద్ధతినిగానీ ఎంచుకున్న పక్షంలో ముందస్తుగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 2100 మెగాహెర్ట్జ్, 1,800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లకయితే బిడ్ మొత్తంలో 33 శాతం, 900..800 మెగాహెర్ట్జ్ బ్యాండ్విడ్త్కైతే 25 శాతాన్ని వేలం ముగిసిన 10 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని 12 ఏళ్ల వ్యవధిలో చెల్లించాలి. ఇందులో రెండేళ్ల పాటు మారటోరియం వ్యవధి ఉంటుంది. మొత్తం మీద పదేళ్ల పాటు వార్షికంగా వాయిదాలు కట్టాలి. స్పెక్ట్రం పర్మిట్ 20 ఏళ్లు ఉంటుంది. ‘సున్నా నష్టం’ తప్పని తేలింది: జైట్లీ తాజా స్పెక్ట్రం వేలంలో రూ. 1.10 లక్షల కోట్ల మేర బిడ్లు రావడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. 2008లో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వమేమీ నష్టపోలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువైందని ఆయన చెప్పారు. ‘స్పెక్ట్రం విలువ సున్నా అని కొందరికి ఉన్న అభిప్రాయాలను ఈ వేలం పటాపంచలు చేసింది’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు చురకలంటించారు. అత్యంత విలువైన స్పెక్ట్రంను కేటాయించేయడం వల్ల ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తప్పు పట్టడం తెలిసిందే. అయితే, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కాగ్ చేసిన లెక్కలన్నీ తప్పుల తడకలని విమర్శించిన సిబల్, అసలు ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టం ‘సున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. దీనిపైనే తాజాగా జైట్లీ వ్యాఖ్యానించారు. రేట్లు పెంచాల్సి రావొచ్చు: సీవోఏఐ స్పెక్ట్రం కోసం టెలికం కంపెనీలు భారీగా కట్టాల్సి రావడం వల్ల టారిఫ్‌లు కూడా పెంచాల్సి రావొచ్చని సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ సీవోఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘ఆపరేటర్ల నుంచి గరిష్టంగా రాబట్టే విధంగా వేలం ప్రక్రియ ఉంది. లేకపోతే స్పెక్ట్రం కొరత ఎందుకు సృష్టిస్తారు. దీని వల్ల పోటాపోటీగా బిడ్లు వేసిన ఆపరేటర్లు ఆ భారాన్ని వినియోగదారులకి బదలాయించే అవకాశముంది. ఫలితంగా కాల్, ఎస్ఎంఎస్, డేటా చార్జీలు పెరగవచ్చు’ అని ఆయన తెలిపారు. ఇప్పటికే పెద్ద టెల్కోలు రుణభారంలో ఉన్నాయని, తాజాగా స్పెక్ట్రం ధర మరింత పెరిగినందున రేట్లు పెంచడం మినహా వాటికి మరో మార్గం లేదని టెలికం సేవల సంస్థల అసోసియేషన్ ఏయూఎస్‌పీఐ మాజీ సెక్రటరీ జనరల్ ఎస్సీ ఖన్నా చెప్పారు. -
హవాలా గుట్టు రట్టు
చాంద్రాయణగుట్ట: ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ... హవాలా రూట్లో * 1.10 కోట్ల నగదును తరలిస్తున్న ఇద్దరు యువకులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...ముంబై ప్రాంతానికి చెందిన హీరాలాల్ చౌదరి అనే వ్యక్తి ముంబైలోని జువేరియా బజార్లో బంగారం, మొబైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చి ముంబై, హైదరాబాద్ నగరాలలోని బంగారు వ్యాపారులకు విక్రయిస్తుంటాడు. బంగారాన్ని తీసుకున్న వ్యాపారులు ఇచ్చే భారీ నగదును బినామీ అకౌంట్ల ద్వారా తిరిగి తన అకౌంట్‌కు వేయించుకుంటాడు. దీనికోసం తనకు తెలిసిన మోతీ సింగ్ రాజ్‌పురోహిత్ (27) అనే యువకుడిని ఏజెంట్‌గా నియమించుకున్నాడు. బేగంబజార్‌లోని శ్రీ రేణుకా మాత కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మేనేజర్ అనిల్ మాండలిక్(29)ను కూడా మచ్చిక చేసుకున్నాడు. ఇదిలా ఉండగా మోతీసింగ్ రాజ్‌పురోహిత్, అనిల్ మాండలిక్లు గురువారం పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌కు చెందిన సోని అగర్వాల్ అనే బంగారు వ్యాపారి వద్ద * 1.10 కోట్ల నగదు తీసుకొని బ్యాంక్‌లో వేసేందుకు బయలుదేరారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.వి.సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని ఎస్సైల బృందం జె.రాజశేఖర్, బి.మధుసూదన్, గౌస్ ఖాన్, డి.వెంకటేశ్వర్లు షాయినాయత్ గం జ్‌లోని సాబూ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద మోతీసింగ్ , అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 80 కట్టలతో రూ.వెయ్యి నోట్లు, 60 కట్టలతో రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. వారిని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. నిందితుల నుంచి నగదుతో పాటు హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వారిని షాయినాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్నిపోలీసుల ద్వారా ఐటీ, కస్టమ్స్ అధికారులకు అప్పగించనున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. బినామీ అకౌంట్లలో జమ చేస్తూ... అక్రమంగా కిలోల్లో బంగారాన్ని దిగుమతి చేసి, కోట్లలో డబ్బులు తీసుకునే హీరాలాల్ చౌదరి రిజర్వ్ బ్యాంక్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడేవాడు. బేగంబజార్‌లోని శ్రీ రేణుకా మాత కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌తో కుమ్మకై బినామీ అకౌంట్లలో * 5, * 6, *8, * 9 లక్షల చొప్పున జమ చేయించి....తిరిగి ఆ మొత్తాన్ని హీరాలాల్ అకౌంట్‌కు వేర్వేరుగా పంపించేవారు. బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలతోనే మేనేజర్ అనిల్ ఆ మొత్తాన్ని తీసుకెళ్లడానికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నా రు. ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్‌తో పాటు మరి కొన్ని అకౌంట్లలో మొత్తాన్ని జమ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.