breaking news
pslv c 25 rocket
-
పాశుపతాస్త్రం.. పీఎస్ఎల్వీ
1975లో ఆర్యభట్ట ఉపగ్రహంతో మొదలైన ‘ఇస్రో’ అంతరిక్ష ప్రయోగాల పరంపర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 1963 నవంబర్ 21న భారత్ అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టినా, 1979 నాటికి శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగింది. అప్పటి వరకు వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసిన ‘ఇస్రో’, 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ-3 ఈ1 పేరుతో చిన్నపాటి ఉపగ్రహాలను పంపేందుకు రాకెట్ ప్రయోగాలు ప్రారంభించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎల్వీ), ఆగ్యుమెంట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఏఎస్ఎల్వీ), పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) అనే నాలుగు రకాల ఉపగ్రహ వాహకనౌకలను రూపొందించారు. వీటిలో పీఎస్ఎల్వీ రాకెట్‌దే అగ్రస్థానం. 1993 సెప్టెంబర్ 20న తొలిసారిగా పీఎస్ఎల్వీ డీ1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటికి 25 ప్రయోగాలు చేయగా, మొదటి ప్రయోగం తప్ప మిగిలిన 24 ప్రయోగాలూ విజయవంతమయ్యాయి. 1993 చేసిన మొదటి ప్రయోగం విఫలమవడంతో 1994 అక్టోబర్ 15న పీఎస్ఎల్వీ డీ2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను కక్ష్యలోకి విజయవంతంగా పంపారు. 1996 మార్చి 21న పీఎస్ఎల్వీ డీ3లో కూడా ఐఆర్ఎస్ శాటిలైట్‌ను పంపారు. అక్కడి నుంచి పీఎస్ఎల్వీ సీ సీరీస్‌ను ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ1 నుంచి సీ 25 వరకు అన్ని ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-1ను పీఎస్ఎల్వీ సీ11 రాకెట్ ద్వారానే ప్రయోగించారు. ఇస్రో మార్స్ మిషన్ ముఖ్యాంశాలు.. రాకెట్: మార్స్ ఆర్బిటర్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన పోలార్ శాటిలైట్ వెహికల్-సీ25 (పీఎస్ఎల్వీ-సీ25) భారత్ దేశీయంగా అభివృద్ధి చేసినదే. ఇది 44 మీటర్ల పొడవు, 320 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కసారి మాత్రమే వినియోగించే పీఎస్ఎల్వీ రాకెట్‌కు దాదాపు రూ. 110 కోట్లు వ్యయమయింది. దీనిలో మార్స్ ఆర్బిటర్ ఒక్కదానినే ప్రయోగించారు. దూరం: నవంబర్ 30వ తేదీ వరకూ అంటే 25 రోజుల పాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ప్రయాణం: మార్స్ ఆర్బిటర్‌ను అంగారక గ్రహం వైపు నెట్టేట్లు అందులోని మోటార్లను డిసెంబర్ 1న మండిస్తారు. అనంతరం ఈ ఆర్బిటర్ మోటార్లు ఆగిపోతాయి. అరుణుడి కక్ష్యలోకి: అంగారక గ్రహం సమీపానికి వచ్చినపుడు ఆర్బిటర్‌లోని మోటార్లను మళ్లీ మండించి పనిచేయించి ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది వచ్చే ఏడాది (2014) సెప్టెంబర్ 24న ఇది జరుగుతుంది. లక్ష్యం: అంగారక గ్రహంపై జీవాన్వేషణ, గ్రహం రూపురేఖలు, నిర్మాణం అధ్యయనం, ఖనిజాల అధ్యయనం, వాతావరణ అధ్యయనం మార్స్ మిషన్ లక్ష్యం. ‘ఇస్రో’ ప్రస్థానం... 109 - ఇస్రో మొత్తం అంతరిక్ష ప్రయోగాలు 68 - ఇస్రో సొంతంగా ప్రయోగించిన ఉపగ్రహాలు 40 - శ్రీహరికోట షార్ నుంచి మొత్తం ప్రయోగాలు 25 - పీఎస్ఎల్వీ ప్రయోగాలు (మొదటి మినహా అన్నీ దిగ్విజయం) 19 - షార్ మొదటి ప్రయోగ వేదికపై మొత్తం ప్రయోగాలు ‘మామ్’ విశిష్టతలివీ... 1 - భారత్‌కు మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగం 1 - అరుణగ్రహంపై పరిశోధనలు చేపట్టిన తొలి ఆసియా దేశం భారత్ 4 - అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన ప్రపంచ దేశాల్లో నాలుగోది భారత్ 450 కోట్లు - భారత మార్స్ మిషన్ మొత్తం వ్యయం -
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం
చిత్తూరు: శ్రీకాళహస్తీశ్వరాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణద్వారం వద్ద ఉన్న ఓ షాపులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలార్పేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూటే కారణంగానే మంటలంటుకున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. కాగా, శ్రీకాళహస్తి స్వామివారిని ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహక వాహకనౌకను రేపు ప్రయోగించనున్న నేపథ్యంలో ఆయనిక్కడకు వచ్చారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక మంగళవారం మధ్యాహ్నం 2:38 గంటలకు నింగికి దూసుకుపోనుంది. -
పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ 25 రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎల్లుండి మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ఆ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. అంటే 56.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రూ.450 కోట్లను పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగం కోసం ఇస్రో వెచ్చించింది. ఇప్పటి వరకు 25 పీఎస్ఎల్వీ రాకెట్లను షార్ నుంచి ఇస్రో ప్రయోగించింది. అయితే 23 పీఎస్ఎల్వీలు మాత్రమే విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి పంపనుండటం తెలిసిందే.