breaking news
Prepaid card
-
అన్నింటికి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే..
మెట్రో, బస్సు, రైలు, ఏటీఎం, టోల్, పార్కింగ్.. ఇలా ప్రతిదానికి ప్రత్యేకించి కార్డులుంటాయి. వీటన్నింటిని వెంటతీసుకుని వెళ్లడం కొంత చికాకుతో కూడిన వ్యవహారం. అయితే అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ) రూపే రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ‘వన్ నేషన్, వన్ కార్డ్’ చొరవతోనే ఈ కార్డును ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్, పార్కింగ్ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఏటీఎం విత్‌డ్రాతో పాటూ పాయింట్ ఆఫ్ సేల్, ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో ఎన్నికలే ఎన్నికలు!,ఎస్బీఐ కీలక నిర్ణయం ఈ ఎన్సీఎమ్సీ కార్డుతో ఆన్లైన్, ఆఫ్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చని బ్యాంకు పేర్కొంది. ఆన్లైన్ వాలెట్ బ్యాలెన్స్ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్‌లైన్ వాలెట్లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్ ప్రత్యేక పోర్టల్ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్/ రీలోడ్ చేసుకోవచ్చు. -
ఫారిన్ టూర్.. ఫారెక్స్ కార్డ్ బెటర్
భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగార్థులు, పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గతంతో పోలిస్తే విదేశీ ప్రయాణం ఎంతో సౌకర్యంగా మారింది. విమానాశ్రయాలు, విమాన సర్వీసుల నెట్వర్క్ విస్తృతం అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా, సులభంగా ప్రయాణించే వెసులుబాటు దక్కింది. మరి విదేశాలకు వెళ్లే వారు తమ వెంట ఆయా దేశానికి చెందిన కరెన్సీని కూడా తీసుకెళుతుంటారు. ఈ అవసరాన్ని తప్పించేదే ఫారెక్స్ కార్డ్. ఏ దేశానికి వెళితే ఆ దేశ కరెన్సీ రూపంలో ఈ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్ ఉంటే కరెన్సీ నోట్లు పాకెట్లో లేకపోయినా ఇబ్బంది పడే పరిస్థితి రాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇది చెల్లుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ కంటే ఫారెక్స్ కార్డ్ వల్ల ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. ఈ ఫారెక్స్ కార్డుతో ప్రయోజనాలు? ఎలా పనిచేస్తుంది? ఇందులో ఎన్ని రకాలు? చార్జీలు తదితర విషయాలను తెలియజేసే కథనమే ఇది! ఫారెక్స్ కార్డ్ అంటే..? ఇదొక ప్రీపెయిడ్ కార్డ్. మీరు వెళ్లాలనుకునే దేశ కరెన్సీ మారకంలో డిపాజిట్ చేసుకుని, వినియోగించుకునే సాధనం. ఈ కార్డ్‌తో విదేశాల్లో చెల్లింపులు చేయడమే కాకుండా, ఏటీఎం నుంచి ఆ దేశ కరెన్సీని ఉపసంహరించుకోవచ్చు. ఈ కార్డ్ ఉంటే వెంట భౌతిక రూపంలో కరెన్సీని తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫారెక్స్ కార్డుల్లో రకాలు... విదేశాలకు వెళ్లే వారికి క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ ఎంతో ఉపయోగకరం అని చెప్పుకోవాలి. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఈ కార్డుల్లో పలు రకాలు ఉన్నాయి. సింగిల్ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఇందులో ఒకటి. ఏదైనా ఒక దేశ కరెన్సీనే ఇందులో లోడ్ చేసుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ రెండో రకం. ఇందులో ఒకటికి మించిన దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. వివిధ దేశాలకు వెళ్లే వారికి మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉపయోగకరం. దాదాపు ప్రముఖ బ్యాంకులన్నీ కూడా ఫారెక్స్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రయోజనాలు/సదుపాయాలు విదేశాల్లో చెల్లింపులు సురక్షితంగా చేసేందుకు ఫారెక్స్ కార్డ్ అనుకూలం. క్రెడిట్ కార్డ్‌కు మాదిరే అన్ని రకాల సదుపాయాలు కూడా వీటిల్లో ఉంటాయి. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో, ముందుగానే బ్యాంక్ ఖాతా నుంచి లోడ్ చేసుకోవాలి. ఫలితంగా విదేశాల్లో వినియోగంపై స్వీయ నియంత్రణ ఉంటుంది. కావాల్సినంతే లోడ్ చేసుకోవచ్చు. అంతే మేర ఖర్చు చేసుకోవచ్చు. ఫారెక్స్ కార్డ్‌ను దాదాపు అన్ని చోట్లా ఆమోదిస్తారు కనుక సౌకర్యవంతగా ఉంటుంది. దీంతో ఏటీఎంలు లేదంటే ఇతర ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాల కోసం చూసుకోవాల్సిన అవసరం రాదు. ముఖ్యంగా కరెన్సీని తీసుకెళ్లే అవసరాన్ని తప్పిస్తుంది. దీంతో నగదుతో పోలిస్తే సౌకర్యం, సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు కరెన్సీ విలువల్లో అస్థిరతల ప్రభావం కూడా ఉండదు. లోడ్ చేసిన రోజు విలువే స్థిరంగా కొనసాగుతుంది. దాంతో రోజువారీ కరెన్సీ మారకం హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. క్రెడిట్, డెబిట్ కార్డు చార్జీలతో పోలిస్తే ఫారెక్స్ కార్డ్ చౌక ఆప్షన్. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ కరెన్సీ మారకం చార్జీ పడుతుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశ కరెన్సీలోకి రూపాయిలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మారకం చార్జీని కరెన్సీ మార్కప్ చార్జీగా పేర్కొంటారు. కార్డ్, బ్యాంక్ ఆధారంగా ఈ చార్జీ 2–5 శాతం మధ్య ఉంటుంది. ఫారెక్స్ కార్డుల్లో ఎన్నో సదుపాయాలు ఉండడంతో, సంప్రదాయ చెల్లింపు సాధనాలతో పోలిస్తే ఇవి ఆకర్షణీయమైనవని చెప్పుకోవచ్చు. మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఉంటే, ఒకేసారి ఒక దేశం తర్వాత మరో దేశానికి వెళ్లేట్టు అయితే ఉపయోగకరంగా ఉంటుంది. కావాల్సిన ప్రతిసారీ బ్యాంకుల్లో కరెన్సీని మార్చుకోవడం కంటే ఫారెక్స్ కార్డు తీసుకెళ్లడమే సౌకర్యం. బ్యాంకులకు సైతం ఫారెక్స్ కార్డులతో తక్కువ వ్యయం అవుతుంది. దీంతో అవి ఫారెక్స్ కార్డుదారులకు ఆ ప్రయోజనాలను అందిస్తుంటాయి. భౌతిక కరెన్సీతో పోలిస్తే ఫారెక్స్ కార్డులో లోడ్ చేసుకోవడం వల్ల మరింత మెరుగైన మారకం రేటు సాధ్యపడుతుంది. ఈ కార్డ్ పొందేందుకు ఆయా బ్యాంక్ ఖాతాదారు కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రీపెయిడ్ కార్డ్ కనుక, బ్యాంక్‌లు సులభంగా మంజూరు చేస్తుంటాయి. మార్కెట్లో వివిధ బ్యాంకులు ఎన్నో ఫీచర్లతో వీటిని ఆఫర్ చేస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత, తమకు అనుకూలమైనది తీసుకోవచ్చు. ఒకవేళ ఫారెక్స్ కార్డ్‌ను ఎక్కడైనా కోల్పోతే, వెంటనే బ్యాంక్ లేదా ఎన్బీ ఎఫ్సీకి కాల్ చేసి చెబితే మిగిలిన బ్యాలన్స్ దురి్వనియోగం కాకుండా ఫ్రీజ్ చేసేస్తారు. విదేశాల్లోని పీవోఎస్ మెషీన్ల వద్ద ఫారెక్స్ కార్డులను స్వైప్ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. కానీ అదే డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసిన ప్రతిసారీ ఎంతో కొంత చార్జీ పడుతుంది. పైగా ఇతర సాధనాలతో పోలిస్తే ఫారెక్స్ కార్డులకు అంతర్జాతీయంగా ఎక్కువ ఆమోదం ఉంటుంది. అంతేకాదు విదేశాల్లో ఆన్లైన్ కొనుగోళ్లకు సైతం ఫారెక్స్ కార్డులతో చెల్లింపులు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌పై విదేశాల్లో ఖర్చు చేస్తే సకాలంలో చెల్లింపులు చేయకపోతే, భారీ వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజులు పడతాయి. ఫారెక్స్ కార్డ్ ప్రీపెయిడ్ కార్డ్ కావడంతో ఈ సమస్య ఉండదు. ► ఒకేసారి ఒకటికి మించిన దేశాలను పర్యటించే వారు, ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా, మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఎంపిక చేసుకోవడం నయం. ► కార్డ్‌లో బ్యాలన్స్ మిగిలి ఉంటే, స్వదేశానికి వచి్చన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి నగదుగా మార్చుకోవచ్చు. ► విదేశీ పర్యటన ముగించి స్వదేశానికి వచ్చిన తర్వాత.. తిరిగి విదేశానికి వెళ్లేంత వరకు కార్డ్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్లీ విదేశీ యాత్రకు ముందు యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో వినియోగం లేకపోయినా చార్జీలు, పెనాలీ్టలు పడవు. మెయింటెనెన్స్ చార్జీలు కూడా ఉండవు. ► ఫారెక్స్ కార్డ్‌లపై డీల్స్, డిస్కౌంట్లు వస్తుంటాయి. ► ఫారెక్స్ కార్డుల్లో చాలా వరకు లాక్డ్ ఇన్ ఎక్సే్ఛంజ్ రేట్ అనే ఫీచర్‌తో వస్తాయి. అంటే కరెన్సీ రేటులో అస్థిరతలను ఈ సదుపాయంతో అధిగమించొచ్చు. ఉదాహరణకు కార్డులో డాలర్లు లోడ్ చేసుకుంటే, ఆ రోజు ఉన్న విలువ ప్రకారమే లాక్ అవుతుంది. దాని విలువ బ్యాలన్స్ ముగిసే వరకు స్థిరంగా కొనసాగుతుంది. ► ఫారెక్స్ కార్డ్ లేకుండా వెళితే, విదేశాల్లో అవసరమైన చోట కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం శ్రమపడాల్సి రావచ్చు. ఫారెక్స్ కార్డ్ అయితే ఉన్న చోట నుంచే కోరుకున్న మారకం రేటులో లోడ్ చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టళ్లపై ఫారెక్స్ కార్డ్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వర్తకులు ఈ కార్డ్‌ను ఆమోదిస్తారు. విమాన టికెట్ బుకింగ్‌లు, హోటల్ బుకింగ్, డైనింగ్, ఆఫ్‌లైన్, ఆన్లైన్ షాపింగ్‌కు వాడుకోవచ్చు. ► ఫారెక్స్ కార్డ్‌తో ఏ దేశంలో ఏటీఎం నుంచి అయినా ఆ దేశ కరెన్సీని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం లొకేషన్ ఆధారంగా ఏ దేశంలో ఉన్నారనేది కార్డ్ నెట్వర్క్ గుర్తిస్తుంది. సంబంధిత దేశ కరెన్సీని అందిస్తుంది. ► ఫారెక్స్ కార్డ్‌లలో ఎంబెడెడ్ చిప్ టెక్నాలజీ ఉంటుంది. సున్నితమైన సమాచారం ఎన్క్రిపె్టడ్గా ఉండటంతో మోసాల రిస్క్ చాలా తక్కువ. ► ఇవి కనీసం ఐదేళ్ల ఎక్స్పైరీ తేదీతో వస్తాయి. ► ఒక దేశానికి వెళుతూ కొంత బ్యాలన్స్‌ను లోడ్ చేసుకున్న తర్వాత, చివరికి మిగులు ఉందనుకోండి.. ఆ తర్వాత ఆ బ్యాలన్స్‌ను ఏ దేశంలో అయినా వినియోగించుకోవచ్చు. ► మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్‌ల్లో 16–22 దేశాల కరెన్సీలను లోడ్ చేసుకోవచ్చు. ఫీజులు/చార్జీలు.. కార్డ్ జారీ చేసే సంస్థ ఆధారంగా ఫీజులు, చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. సింగిల్ కరెన్సీ కార్డ్‌తో పోలిస్తే మల్టీ కరెన్సీ కార్డ్ చార్జీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇష్యూయన్స్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది రూ.100–500 మధ్య ఉంటుంది. రీలోడ్, రెన్యువల్ చార్జీలు కూడా చెల్లించుకోవాలి. కార్డులో కరెన్సీని లోడ్ చేసిన ప్రతిసారీ రీలోడ్ చార్జీ పడుతుంది. అదనపు కార్డ్ కావాలంటే యాడాన్ కార్డ్ తీసుకోవచ్చు. దీనికి విడిగా ఫీజు పడుతుంది. కార్డులో బ్యాలన్స్‌ను నగదు రూపంలో తీసుకున్న సందర్భంలోనూ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో కార్డ్ నుంచి నగదు తీసుకున్న ప్రతి సారీ చార్జీ విధిస్తారు. కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకున్నా కూడా చార్జీ పడుతుంది. మీరు చెల్లింపులు చేసిన కరెన్సీ, కార్డ్‌లో లోడ్ అయి ఉన్న కరెన్సీ వేర్వేరు అయితే అప్పుడు క్రాస్ కరెన్సీ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇది 3.5 శాతం వరకు ఉంటుంది. అదే మలి్టపుల్ కరెన్సీ కార్డులో ఈ సమస్య ఉండదు. కార్డ్‌ను కోల్పోయి, తిరిగి తీసుకుంటే అప్పుడు కూడా చార్జీ పడుతుంది. వీటిని గుర్తు పెట్టుకోవాలి.. ► ప్రతి లావాదేవీ అనంతరం కార్డ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్ ఎక్కడైనా పొగొట్టుకుంటే లేదా చోరీకి గురైనా వెంటనే బ్యాకప్ కార్డ్ తీసుకోవాలి. ► ప్రతీ పర్యటనకు ముందు ఏటీఎంకు వెళ్లి పిన్ మార్చుకోవాలి. ► ఫారెక్స్ కార్డ్‌ను విదేశాల్లో ఇల్లు, కారు, రూమ్ రెంటల్స్‌కు వినియోగించుకోవద్దు. ► కార్డ్‌లో లోడ్ చేసిన కరెన్సీ కాకుండా, మరో కరెన్సీలో చెల్లింపులు చేయకుండా ఉండడమే మంచిది. దీనివల్ల అనవసర వ్యయాలను నివారించుకోవచ్చు. ► టోల్ చార్జీలు చెల్లించేందుకు సైతం ఫారెక్స్ కార్డ్‌ను వాడుకోవద్దు. ► కొన్ని బ్యాంక్‌లు తక్కువ మార్కప్, లోడింగ్ చార్జీతో క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిపై రివార్డులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇవి కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ, అన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దరఖాస్తుకు ముందు.. ఫారెక్స్ కార్డ్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న పలు రకాల కార్డ్‌లు, వాటిల్లోని ఫీచర్లను పూర్తిగా తెలుసుకోవాలి. చార్జీల గురించి అడిగి తెలుసుకోవాలి. బ్యాంక్‌లు, పెద్ద ఆరి్థక సంస్థలు, ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీల నుంచి ఈ కార్డ్ తీసుకోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లి లేదంటే ఆన్లైన్ నుంచి అయినా కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలు ఒకటికి మించిన కార్డ్‌లను వివిధ రకాల ఫీచర్లతో ఆఫర్ చేస్తున్నాయి. కార్డ్ తీసుకునేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ కాపీ (స్వయంగా అటెస్ట్ చేసింది), వీసా కాపీ, ఎయిర్‌లైన్ టికెట్ కాపీ, పాన్ కార్డ్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ మాదిరే ఫారెక్స్ కార్డుకు అనుబంధంగా పిన్ వస్తుంది. దీన్ని మొదటిసారి మార్చుకోవాలి. కార్డు జారీ చేసిన బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా ఈ సదుపాయం ఉంది. ప్రతి లావాదేవీ అనంతరం వచ్చే ఎస్ఎంఎస్ను చూసి తెలుసుకోవచ్చు. -
పెట్టుబడికి ‘ప్రీ పెయిడ్’ కార్డులు
-
జాగ్రత్త పడకుంటే... డేఠా
* వేగంగా పెరుగుతున్న మొబైల్ డేటా వినియోగం * సామాజిక మాధ్యమాల్లో వాడకమే అధికం * ఆటోమేటిగ్గా ఖర్చు చేయించేస్తున్న అదనపు ఫీచర్లు రాహుల్ హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఉండేది హాస్టల్లో. ఇంట్లో వాళ్లు అవసరమవుతుంది కదా అని మొబైల్ కొనిచ్చారు. ప్రీపెయిడ్ కార్డు ఇచ్చి... నెలకు కొంత లిమిట్ పెట్టారు. ఆ మేరకే వాళ్లు రీచార్జ్ చేస్తుంటారు. ఒకవేళ అదనంగా అవసరమై రాహుల్ ఫోన్ చేస్తే... అంతలా ఎవరితో మాట్లాడావని వాళ్ల నాన్న క్లాస్ తీసుకుంటాడు. అందుకే రాహుల్ వాళ్లనెప్పుడూ అదనపు రీచార్జ్ అడగడు. కాకపోతే ఈ మధ్య మొబైల్లో డేటా ఎక్కువగా ఖర్చవుతుండటంతో తరచూ రీచార్జ్ అవసరమవుతోంది. అందుకని తనకు బాగా చనువున్న బంధువుల్ని అడగటం మొదలెట్టాడు. వాళ్లేమో రాహుల్ అడిగినపుడల్లా ఎంతో కొంత రీచార్జ్ చేయటం జరుగుతోంది. కానీ ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి కదా! రాహుల్ విషయం కూడా వాళ్ల నాన్నకు తెలిసింది. ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు.‘‘నేను ఎప్పట్లానే వాడుతున్నాను నాన్నా! కానీ ఈ మధ్య ఎక్కువ ఖర్చయిపోతోంది’’ చెప్పాడు రాహుల్. నిజానికి రాహుల్ ఒక్కడిదే కాదు. ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటా వాడుతున్న చాలా మందికి ఇది అనుభవమే. డేటా కోసం తరచూ రీచార్జ్ చేయటం... మళ్లీ అంతలోనే అయిపోవటం... ఇవన్నీ కొత్త విషయాలేమీ కాదు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావంతో ఈ ట్రెండ్ మరింత పెరిగింది. అందుకే... మొబైల్ ఆపరేటర్లు కూడా సంప్రదాయ వాయిస్ ఆధారిత సేవలకన్నా ఇపుడు డేటా ఆధారిత సేవలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రెవెన్యూ వృద్ధి కూడా వాయిస్‌తో పోలిస్తే డేటా నుంచే ఎక్కువగా ఉండటం మారుతున్న ధోరణికి నిదర్శనం. అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ టీఎన్ఎస్ ఇటీవల ‘కనెక్టెడ్ లైఫ్’ పేరిట అంతర్జాతీయంగా ఓ సర్వే చేసింది. 50 దేశాల్లో 60,500 మందికి పైగా పాల్గొన్న ఈ సర్వేలో... సామాజిక మాధ్యమాల సత్తా ఏంటో బయటపడింది. ఎందుకంటే సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతం మంది ప్రతి రోజూ వాట్సాప్, వియ్‌చాట్ వంటి ఇన్స్టాంట్ మెసేజింగ్ సేవలు వాడుతున్నారట. ఇక 30 శాతం మంది ప్రతిరోజూ ఫేస్బుక్ చూస్తున్నారట. ఇక ఇండియాలోనైతే ఒక యూజర్ ద్వారా వస్తున్న డేటా ఆదాయం (పర్ యూజర్) రూ.176గా ఉంది. డేటా ద్వారా వచ్చే రెవెన్యూ ఏడాదికి 33 శాతం చొప్పున వృద్ధి అవుతుండగా... వాయిస్ ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం చొప్పున మాత్రమే పెరుగుతుండటం గమనార్హం. ఇవన్నీ చూస్తే... డేటా ఎందుకు ఖర్చవుతోందో అర్థమయిపోతుంది. రాహుల్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. ఎందుకంటే తను రోజూ ఫేస్బుక్ చూస్తాడు. ఈ మధ్య ఫేస్బుక్లో వచ్చే వీడియోలు తన ప్రమేయం లేకుండానే ఆటోమేటిగ్గా ప్లే అయిపోతున్నాయి. పెపైచ్చు తన స్నేహితులు వాట్సాప్‌లో బోలెడన్ని గ్రూప్‌లు క్రియేట్ చేశారు. అన్నిట్లోనూ తనను చేరుస్తున్నారు. వచ్చే వీడియోలు బాగుంటున్నాయి కదా అని రాహుల్ కూడా వాటిని చూసి ఎంజాయ్ చేయటమే కాక... వివిధ గ్రూపులకు షేర్ చేస్తున్నాడు. అందుకే... డేటా మంచినీళ్లలా ఖర్చయిపోతోంది. నిజానికి రాహుల్‌కు తన కాలేజీలో వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే అందులో ఫేస్బుక్, యూ ట్యూబ్ వంటివి రావు. వాట్సాప్‌లో కూడా ఫొటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు వస్తాయి తప్ప వీడియోలు డౌన్లోడ్ కావు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం కొన్ని పరిమితులతో కూడిన ఇంటర్నెట్ ఇస్తోంది. కాకపోతే ఈ పరిమితులేవీ నచ్చని రాహుల్ లాంటి విద్యార్థులు ఎప్పుడూ డేటాను ఆన్ చేసే ఉంచుతున్నారు. ఫలితం... రీచార్జ్‌ల మీద రీచార్జ్‌లు చేయాల్సి వస్తోంది. అదీ కథ. సింప్లీ వైఫై ఉత్తమం... మొబైల్ డేటా వ్యయాలను తట్టుకోవాలంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవడమే మేలు. చక్కగా వైఫై రూటర్ పెట్టుకుని నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్లో, కార్యాలయంలో ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీ, ల్యాప్‌టాప్‌ను నెట్‌కు అనుసంధానించవచ్చు. ఇక చార్జీలంటారా... ఇప్పుడు చాలా వరకు బ్రాడ్‌బ్యాండ్ కంపెనీల టారిఫ్‌లు దిగొచ్చాయి. రూ.400-500కు 30జీబీ ఆపైన డేటా పొందవచ్చు. తక్కువ స్పీడుతో ఈ ధరకు అన్లిమిటెడ్ ప్యాక్‌లు కూడా దొరుకుతున్నాయి. అధిక నిడివిగల వీడియోలు ఎక్కువ సంఖ్యలో డౌన్లోడ్ చేస్తే తప్ప సాధారణంగా ప్యాక్‌లో భాగంగా ఇచ్చే ఉచిత పరిమితికి మించి డేటా వినియోగం కాదు. వీడియోలు ఆటోమేటిగ్గా డౌన్లోడ్ కాకుండా.. ఫేస్బుక్ ఈ మధ్యే ఆటోమేటిగ్గా వీడియోలు ప్లే అయ్యే ఫీచర్‌ను జోడించింది. అంటే మీరు ఫేస్బుక్ తెరిచారంటే... సదరు వీడియో దగ్గరకు వెళ్లేసరికి అది దానంతట అదే ప్లే అవుతుందన్న మాట. ఈ ఫీచర్ వద్దనుకుంటే సెటింగ్స్‌లోకి వెళ్లి... ఆటోమేటిగ్గా ప్లే అయ్యే ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవాలి. లేదంటే డిఫాల్ట్‌గా అవి ప్లే అవుతూనే ఉంటాయి. దానివల్ల అయ్యే డేటా ఖర్చు కూడా ఎక్కువే. ఇక వాట్సాప్, హైక్ వంటి ఇన్‌స్ట్టంట్ మెసేజింగ్ సర్వీసుల విషయంలో ఎవరైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి... తమ కాంటాక్ట్స్‌లో ఉన్న వారిని ఎవ్వరినైనా అందులో చేర్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు అంగీకరించాల్సిన పనేమీ లేదు. ఇష్టం లేకపోతే ఎగ్జిట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. ఇక ఈ గ్రూపుల్లో ఆసక్తిగా ఉంది కదాని మీరు పంపినట్టే మరో స్నేహితుడు సైతం మీకూ వీడియోలు, ఫొటోలు పంపిస్తే... మీ ప్రమేయం లేకుండానే డేటా ఖర్చవుతున్నట్లు లెక్క. గ్రూప్‌ల సంఖ్య పెరిగేకొద్దీ రోజూ వచ్చే వీడియోలు, ఫొటోల సంఖ్య పెరుగుతుంది. దీనర్థం... సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటే అంత డేటా ఖర్చవుతుంది. కంపెనీలు, కార్యాలయాల్లో ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగులకు అధికారిక ఆదేశాలు ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌ల ద్వారానే అందుతున్నాయి. గ్రూప్‌లో సందేశం పంపితే అందరు సభ్యులకు వెంటనే చేరుతుంది కాబట్టి కార్యాలయాలూ ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లపై ఆధారపడక తప్పటం లేదు. కాకపోతే ఆ మేసేజ్‌ల కోసం ఎల్లప్పుడూ డేటా ఆన్‌చేసే ఉంచాల్సి ఉంటుంది. వీడియోల వంటివి ఆటోమేటిగ్గా డౌన్లోడ్ కాకుండా మీరు స్వయంగా ‘సెట్’ చేసుకుంటే తప్ప... జేబుకు చిల్లు పడటం ఖాయం. డేటా ఇలా ఖర్చవుతుంది... నెట్‌కు అనుసంధానమై వెబ్‌సైట్స్, యాప్స్‌ను తెరవగానే బ్రౌజింగ్ చార్జీలు మొదలైనట్టే. నెట్లో వినియోగించిన సమయం, వెబ్సైట్లు, యాప్స్నుబట్టి చార్జీలు పడతాయి. వీటికితోడు వీడియోల కోసం వాడితే అసలు కథ మొదలైనట్టే. ఎందుకంటే ఉదాహరణకు 5 ఎంబీ వీడియో మీ వాట్సాప్‌లోకి వచ్చిందంటే 5 ఎంబీ డేటా మీరు ఖర్చు చేసినట్టే. 10 మంది స్నేహితులకు వేర్వేరుగా ఈ వీడియోను పంపితే 50 ఎంబీ డేటా ఖర్చు అవుతుంది. ఒక గ్రూప్‌కు మాత్రమే పంపితే 5 ఎంబీ డేటా వాడినట్టు. పిక్చర్స్, సంక్షిప్త సందేశమైనా సరే సైజునుబట్టి డేటా ఖర్చు అయిపోతుంది. ఇక ఫేస్బుక్లో మీరు విహరించినంతసేపూ బ్రౌజింగ్ చార్జీలు ఉంటా యి. వీడియోలు చూస్తే సైజునుబట్టి డేటా వినియోగం అవుతుంది. నిజానికిపుడు 3జీ, 4జీ వాడకం పెరగటంతో డేటా ఖర్చులూ పెరుగుతున్నాయి. 3జీ వినియోగదార్లు 1జీబీ డేటాకు ఆపరేటర్‌ను బట్టి కనీసం రూ.200 వెచ్చించాల్సి వస్తోంది. అందుకని అవసరానికి మాత్రమే మొబైల్ డేటా వాడటం... వాట్సాప్, మెసెంజర్ తదితర యాప్స్ సెట్టింగ్స్‌ను మార్చుకోవటం... అనుమతి ఉంటేనే వీడియోలు డౌన్లోడ్ అయ్యేట్టు సరిచేసుకోవటం ఉత్తమం. ఇక వాట్సాప్, ఫేస్‌బుక్‌ను విరివిగా వాడేవారు కాస్త స్పీడు తక్కువైనా అన్లిమిటెడ్ ప్యాక్స్‌ను ఎంచుకోవడం బెటర్. - బిజినెస్ బ్యూరో