breaking news
Pollution of rivers
-
వ్యర్థ జలాలతో మృత్యువాత పడుతున్న చేపలు
సాక్షి, పటాన్చెరు: వర్షాకాలం మొదలైంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల యాజమన్యాలు యద్దేచ్ఛగా కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు , కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. చేపలు పెంచి వాటిని విక్రయిచి జీవనాన్ని సాగిస్తున్న మత్య్సకారులకు మాత్రం కాలుష్య జలాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కాలుష్య జలాల ప్రభావంతో చెరువుల్లోని చేపలు మృత్యువాత పడుతు¯న్నాయి. ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతున్నా యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. పీసీబీ అధికారులకు మాత్రం ఎప్పటిలాగే చెరువుల్లోని చేపలు మృతి చెందటంతో పరిశీలనలు చేసి, కాలుష్య జలాల నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో సుమారు 150రసాయన పరిశ్రమలు ఉన్నాయి. పారిశ్రామిక వాడలకు ఆనుకోని చెరువులు, కుంటలు ఉన్నాయి. గడ్డపోతారంలోని అయ్యమ్మ చెరువులో ప్రతి ఏటా మత్య్సకారులు చేప పిల్లను వేసి వాటిని పెంచి విక్రయించి ఉపాధిని పొందుతుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సుమారు రూ. 5లక్షల విలువైన చేప పిల్లలను మత్య్సకారులు చెరువులో వదిలారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీటితో కలిసి చెరువు పైబాగంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థ జలాలు స్థానికంగా ఉన్న అయ్యమ్మచెరువులో కలిశాయి. దీంతో చెరువులో ఉన్న నాలుగు లక్షల చేపపిల్లలు మృతి చెందాయి. మత్య్సకారులు హుటాహుటీన పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో ఎప్పలాగే పీసీబీ అధికారులు ఆయా పరిశ్రమల్లో పర్యటించి నమూనాలను సేకరించి, మృతి చెందిన చేపలను పరిశీలించారు. ఏళ్ల కాలం నుంచి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. కాలుష్య జలాల కారణంగా చెరువులోని చేపలు మృతి చెందినా తగిన నష్టపరిహారాన్ని అందించేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు. నామమాత్రంగా అధికారుల చర్యలు.. వర్షాకాలంలో కాలుష్య జలాలను నియంత్రించటంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. పరిశ్రమలతో ïపీసీబీ అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్య జలాల ప్రవాహం వల్ల చెరువుల్లోని చేపలు మృత్యువాత పడ్డ సంఘటనలు చాలా జరిగాయి. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గడ్డపోతారం చెరువులోకి వస్తున్న కాలుష్య జలాలు -
కాలుష్య కారక నదుల్లో జాతీయ స్థాయిలో మూసీ స్థానం 4
స్వచ్ఛమైన జలంతో నగరవాసుల దాహార్తి తీర్చిన జలాశయం నేడు అత్యంత విషతుల్యమైంది. గతమెంతో ఘన చరిత్ర ఉన్న మూసీనది నేడు కాలుష్య కాసారంగా మారింది. గరళ సాగరాలుగా మారిన నదుల్లో జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకోవడం సిటీజనులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ నీటిని తాగితే పశుపక్ష్యాదులు, చేపలు మత్యువాత పడడం తథ్యం. పొరపాటున ఎవరైన ఈ నీటిని తాకిన భయంకరమైన చర్మవ్యాధులు రావడం ఖాయం. ఈ జలాలతోఉప్పల్, పీర్జాదీగూడ, ప్రతాప సింగారం,పిల్లాయిపల్లి తదితర ప్రాంతాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయల్లోనూ కాలుష్య ఆనవాళ్లు కనిపించడం భయాందోళనకు గురి చేస్తోంది. పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లోనూ కాలుష్య వ్యర్థాలు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మూసీలో బీఓడీ(బయలాజికల్ ఆక్సిజన్ డివూండ్) ప్రమాదకర స్థారుుకి చేరింది. దీంతో సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యర్థ రసాయనాలు అత్యధికంగా కలవడం వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) కూడా బాగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా సీఓడీ నీటిలో ఉండరాదు. కానీ పరిస్థితి ఇప్పటికే చేయిదాటింది. ఇక నీటి క్షారత(పీహెచ్) అనూహ్యంగా ఏడు యూనిట్లను మించడం కలవరపెడుతోంది. గత కొన్ని నెలలుగా ఈ నదిలో కాలుష్య కారకాల పరిమితి ప్రమాదకర స్థాయిలో పెరిగిందని పీసీబీ నివేదిక నిగ్గు తేల్చింది. నగరంలో మూసీ నది సుమారు 25 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. రోజూ 1400 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఈ నదిలోకి ప్రవేశిస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో