breaking news
PoK projects
-
చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది. ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు. వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. (చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!) -
పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెట్టుబడులకు నో దారుణంగా దెబ్బతిన్న దౌత్యసంబంధాలు సియోల్: అంతర్జాతీయ సంస్థలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు దేశంలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి తాజాగా దక్షిణకొరియా నిరాకరించింది. ఈ ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడానికి గతంలో ఆసక్తిచూపిన కొరియా.. వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టలేమంటూ ఇప్పుడు చేతులెత్తేసింది. గిల్గిట్-బాల్టిస్తాన్, ఆజాద్ కశ్మీర్ వివాదాస్పద ప్రాంతాలు కావడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేక చట్టపరమైన సంక్లిష్టతలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలు వివాదాస్పదమే కాకుండా.. ఇవి అధికారికంగా పాకిస్థాన్ రాజ్యంలో చేరలేదు. దీంతో ఇక్కడ నివసించే ప్రజల పౌరసత్వం మొదలు అనేక విషయాల్లో సంక్లిష్టతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతాలు తమవేనని భారత్ స్పష్టం చేస్తూ వస్తున్నది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)పై సైతం భారత్ చాలా విస్పష్టంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీపీఈసీకి భారత్ అభ్యంతరంతో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ఇన్వెస్టర్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ముజఫరాబాద్‌లోని జీలం నదిపై 500 మెగావాట్ల చకోతి హతియన్ హైడ్రో ప్రాజెక్టు అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేయడానికి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ అయిన డీలిమ్ ఇండస్ట్రీయల్ కంపెనీ లిమిటెడ్ గతంలో ముందుకొచ్చినప్పటికీ.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంపై పునరాలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, కొరియా ఎగ్జిమ్ బ్యాంకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో డీలిమ్ సైతం వెనుకాడుతోంది. కొరియా ఆర్థిక సహకారంతో పీవోకేలో చేపట్టిన కోహలా జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల నుంచి దక్షిణ కొరియా వెనుకకు తగ్గడంతో ఆ దేశంతో పాక్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌లో ఉన్న దక్షిణ కొరియా వాసులపై వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో దక్షిణకొరియా ఏమాత్రం తగ్గడం లేదు.