breaking news
pharma industries
-
ఔషధాల రక్షణ కీలకం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమలు కేవలం ఔషద ఉత్పత్తులపైనే కాకుండా... వాటి రక్షణ, నిల్వలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ పాలసీ అడ్వైజర్ బ్రూకీ హెగిన్స్ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏయూ ఫార్మశీ కళాశాల, యూఎస్ ఎఫ్‌డీఏ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్‌షాప్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బ్రూకీ హెగిన్స్... ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫార్మా రంగానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.... నిరంతర పరిశీలన ► ఆహార ఉత్పత్తులే కాదు, ఔషధాల తయారీ, నిల్వల విషయంలో సరైన పద్ధతుల్లో నాణ్యత, భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్నాం. ► మందులు, వైద్య పరికరాల పరిరక్షణకు ఎఫ్‌డీఏ గైడ్‌లైన్స్ పాటించాల్సిందే. ► ఫార్మా పరిశ్రమలు క్లీన్ రూమ్ ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా స్టెరైల్గా భావించే ఔషధాలను ఉత్పత్తి చేసిన అనంతరం సూక్ష్మజీవుల బారినపడకుండా భద్రపరచాలి. లేదంటే వాటిని వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ►అసెప్టిక్ ప్రాసెసింగ్ (సూక్ష్మ కణాలు చేరకుండా భద్రపరచడం) అనేది ఫార్మా ఉత్పత్తుల కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైనది. ప్రమాదకరమైనది కూడా. ► సాధారణంగా ఒక మనిషి శరీరం నుంచి రోజూ లక్షలాది బ్యాక్టీరియాలు విడుదలవుతుంటాయి. వీటి ద్వారా మందులు తయారుచేసే సమయంలోనే కొన్నిసార్లు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్ తయారీలో గ్లోవ్ లెస్ రోబోటిక్స్ అసలైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ► డ్రగ్స్ తయారీ, భద్రత విషయంలో భారత్‌లోని ఫార్మా పరిశ్రమలు అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి. ► జనరిక్ ఔషధాల తయారీ, సరఫరాలో భారత్ నంబర్ వన్‌గా ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద డ్రగ్ పరిశ్రమగా, విలువ ప్రకారం పదో స్థానంలో భారత్ ఉంది. ఫార్మారంగంలో అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. -
ఫార్మా కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ!
ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం తెలిపారు. కొత్త శాఖ ఫార్మా పరిశ్రమ బాగోగులు చూడటంతో పాటు నియంత్రణ సంస్థగా కూడా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లే ఫార్మా కోసం కూడా ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశీ ఫార్మా రంగం విలువ దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. కొత్త ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్, ఫార్మా దిగుమతులు మొదలైన వాటిని ఆమోదించడం తదితర అంశాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్యవేక్షిస్తున్నాయి. ఇవి రెండూ ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఉంది. ఈ మూడింటిని కూడా కొత్త శాఖ కిందకు చేర్చే అవకాశం ఉందని, వైద్య పరికరాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పర్చిన పక్షంలో దాన్ని కూడా ఇందులోకే తేవొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఔషధాలపై యాప్..: ఔషధాల ధరలు, లభ్యత తదితర అంశాల గురించి సమాచారం అందించడానికి, అలాగే కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అనంత్ కుమార్ వివరించారు. ఔషధ కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘ఫార్మా జన సమాధాన్’ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.