breaking news
Pest
-
జ్యూస్ అనుకుని విషం తాగాడు..!
సాక్షి, పళ్లిపట్టు : కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసి తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. బిహార్‌లో జరిగిన ఈ సంఘటన మరువక ముందే తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జ్యూస్ అనుకుని ఓ బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలివి.. పళ్లిపట్టు మండలం కొళత్తూరు గ్రామ పంచాయతిలోని జయంతి కాలనీలో కార్మికుడు బాబు, లావణ్యలు నివశిస్తున్నారు. ఈ దంపతులకు భాను(7), కదిర్‌వేల్ అలియాస్ అఖిల్(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖిల్ శుక్రవారం ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో సమీపంలోని చెత్త కుప్పలో ఉన్న బాటిళ్లను చూశాడు. అందులో జ్యూస్ ఉంటుందని అనుకుని ఆ పురుగుల మందును తాగాడు. కాసేపటి తరువాత ఆ బాలుడు స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే పళ్లిపట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పంటల్లో తెగుళ్ల నివారణకు కృషి
నంద్యాలరూరల్: జిల్లాలో వివిధ పంటల్లో పురుగులు, తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా కృషి చేయాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ బి.గోపాల్‌రెడ్డి కోరారు. శనివారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ట్రైనింగ్ అండ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ జిల్లాలో కంది, శనగ, పత్తి, వరి, జొన్న, మినుము, పొద్దుతిరుగుడు పంటల్లో తెగుళ్లు సోకాయని వివరించారు. రైతులను అప్రమత్తం చేసి సస్యరక్షణ చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. వర్షం లేనందున అక్కడక్కడ మినుము, పొగాకు, కంది, జొన్న పంటలు ఎండుదశకు చేరుకున్నాయని, చలిమంచు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమన్నారు. అందుబాటులో నీటి వసతి ఉంటే ఒక తడి పెట్టేందుకు ప్రోత్సహించాలని ఏడీఏలను కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరక్టర్ మల్లికార్జునరావు, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ మోహన్‌విష్ణు, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని పత్తి పంటను డాక్టర్ రామారెడ్డి, వరిపంటను డాక్టర్ మోహన్విష్ణులు క్షేత్రస్థాయికి అధికారులను తీసుకెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చారు. -
చీడపీడల గుట్టు తెలిసింది!
సాక్షి, హైదరాబాద్: ఒకేరకమైన పంటలను అధిక విస్తీర్ణంలో పండిస్తే వాటికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుందని చాలా కాలం నుంచి తెలిసిందే. అయితే దీనికి కారణం ఇప్పటివరకు తెలియదు. తాజాగా కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనికి గల కారణాలను కనుక్కున్నారు. వేర్వేరు మొక్కలున్న పంటపొలాల్లో కీటకాల పోషకావసరాలు పూర్తిగా తీరవని, ఒకే తీరు పంటలు (మోనోకల్చర్) మాత్రం కీటకాలకు మంచి ఆహారంగా ఉంటాయని శాస్త్రవేత్త విలియం వెట్జెల్ తెలిపారు. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండటం వల్ల కీటకాలు మోనోకల్చర్ పంటలను ఇష్టపడతాయని చెప్పారు. దాదాపు 53 రకాల కీటకాలను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. ఒక పంటకు సంబంధించిన వేర్వేరు జాతుల మొక్కలను కలిపి పండించడం ద్వారా ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు. కొన్నిచోట్ల వరి, గోధుమ పంటల్లో ఇప్పటికే ఈ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారని తెలిపారు. అధ్యయన వివరాలు నేచర్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఖరీఫ్‌లో చీడపీడల నివారణకు పిచికారి
కంగ్టి:ఖరీఫ్ పంటలైన పెసర, మినుము, సోయా పంటలకు చీడపీడల బెడద ఎక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో గత ఇరవై రోజులుగా వర్షాలు లేకపోగా ఎండలకు పంటలు వాడిపోతుండడంతో పూత రాలే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న సమయంలో పెసర, మినుము, సోయా, మొక్కజొన్న, పత్తి పంటలు వాడుముఖం పడుతున్నాయి. దీనికి తోడు పంటలపై చీడపీడలు ఆశించడంతో రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రసాయన క్రిమిసంహారకాలు పిచికారి చేయడంతో భూమిలో తేమలేక పూత రాలుతోందని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీడపీడల బెడదతో పెట్టుబడి వ్యయం అదనంగా పడుతోంది. పంటల ప్రారంభంలో వర్షాలు సంతృప్తికరంగా కురిసినా పూత, కాత దశలో వర్షాభావం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
పసుపు పంట..తెగుళ్లను నివారిస్తే సిరులే రైతు ఇంట
దుంప, వేరుకుళ్లు తెగులు దీనిని కొమ్ముకుళ్లు, అడుగు రోగం అనికూడా అంటారు. దీనివల్ల దిగుబడి 50 నుంచి 60 శాతం తగ్గుతుంది జులైలో మొదలై అక్టోబర్, నవంబర్‌లో తీవ్రమవుతుంది. తెగులు సోకడానికి కారణాలు. తెగులు ఆశించిన పొలం నుంచి విత్తనం వాడటం. విత్తన శుద్ధి చేయకపోవడం. విత్తన పసుపును లోతుగా నాటడం. మురుగునీరు పోయే సౌకర్యం లేని నేలల్లో సాగుచేయటం. ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండటం. పొటాష్, వేప పిండి ఎరువులను సక్రమంగా వాడకపోవడం. తెగులు లక్షణాలు పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక, ఆకులు పసుపు రంగుకు మారి వాడిపోయినట్లు ఉంటాయి. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు(పైనుంచి 3వ ఆకు) వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తర్వాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది. మొక్క కాండంపై నీటితో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు, కొమ్ములు మళ్లీ పుట్టవు. దుంపలు, కొమ్ములు కుళ్లి మెత్తబడతాయి. లోపల పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుంచి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది. పసుపు దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తాయి. తెగులు నివారణ తెగులను తట్టుకునే రకాలను(సుగుణ, సుదర్శణ, ప్రతిభ) మాత్రమే సాగుచేసుకోవాలి. చీడపీడలు, తెగులు సోకని పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడాలి. విత్తనశుద్ధి ముందుగా లీటరు నీటికి 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్+2 మిల్లీలీటర్ల మెనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని మార్చి లీటరు నీటికి 5 గ్రాముల ట్రైకోదర్మా విరిడి కలిపి, ఆ ద్రావణంలో 30 నిమిషాలపాటు కొమ్ములను నానబెట్టాలి. తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కి లోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్థితు ల్లో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదా విత్తిన నెల రోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి. ఏటా ఒకే నేలలో పసుపు వేయరాదు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి పసుపు విత్తిన తర్వాత నేలపై పచ్చి ఆకులతో లేదా ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తేగులు ఉధృతి కొంత వరకు తగ్గించవచ్చు వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి పైరుపై తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటరు నీటికి 1 గ్రాము మేటాలాక్సిల్+మాంకోజెబ్ లేదా 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను కలిపి తెగులు సోకిన మొక్కలు, వాటి చుట్టూ ఉన్న మొక్కల మొదళ్లు తడిచేలా పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరానికి 10 కిలోల ఫోరేట్ 10జీ గుళికలను 1 కిలో సైమాక్సోనిల్+మాంకోజెబ్ పొడి, తగినంత యూరియా(10 నుంచి 20 కిలోలు)లో కలుపుకొని పొలం అంతటా చల్లుకోవాలి. తాటాకు మచ్చ తెగులు దీనిని పక్షి, బెబ్బల, మర్రి ఆకు తేగులు అని కూడా అంటారు. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు కనిపిస్తుంది. తెగులు సోకడానికి కారణాలు ఈ తెగులు విత్తనం, గాలి, వర్షం, పంట అవశేషాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండడం తెగులు సోకిన పొలం నుంచి విత్తనం వాడటం, విత్తన శుద్ధి చేయకపోవడం పంట అవశేషాలు పొలంలో, పొలం చుట్టు ఉండటం. తెగులు లక్షణాలు ఆకులపై అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడుతాయి. మచ్చలు ముదురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టు పసుపు రంగు వలయం ఉంటుంది. తర్వాత ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కలిసిపోయి ఆకు మొత్తం వ్యాపించి ఎండిపోతాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి ఆకు కిందికి వాలుతుంది. తెగులు తీవ్రమైతే మొక్కల్లో ఎదుగుదల, దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. నివారణ తెగులు సోకని పొలం నుంచి మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలి విత్తన శుద్ధి లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 3 గ్రాముల మెటలీక్సిల్+మాంకోజెబ్ మందు కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి, తర్వాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. తెగులతో మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి వెంటనే లీటరు నీటికి 1 గ్రాము కార్బెండజిమ్ లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ లేదా 2 గ్రాముల కార్బెండజిమ్+మాంకోజెబ్ కలిపి ఉన్న మందు లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్, 0.5 మి.లీ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధితో సెప్టెంబర్ నుంచి 3 నుంచి నాలుగు సార్లు పిచికారి చేయాలి.