breaking news
Peaceful demonstration
-
అణ్వాయుధాలను నిర్మూలిద్దాం
గొయాంగ్ (దక్షిణ కొరియా): ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. గత 70 ఏళ్లుగా వైరంతో రగిలిపోయిన ఆ రెండు దాయాది దేశాలు శుక్రవారం శాశ్వత శాంతి దిశగా ముందడుగు వేశాయి. ఆ మేరకు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఇన్ల మధ్య అంగీకారం కుదిరింది. శుక్రవారం రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరువురు దేశాధి నేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగు పెట్టారు.ముందుగా కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్ ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. తర్వాత కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. అనంతరం కిమ్, మూన్‌ల మధ్య చరిత్రాత్మక సమావేశం జరిగింది. ఇరువురు ఒప్పందం చేసుకుని, సంతకాలు చేశారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పాన్మున్జోమ్లోని మూడంతస్తుల భవనం ‘పీస్ హౌస్’లో వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా కిమ్ సుమారు గంటా 40 నిమిషాలు దక్షిణ కొరియాలో గడిపారు. కాగా కొరియా యుద్ధం అనంతరం 65 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఇది చారిత్రక సమావేశమని ఐరాస ప్రధాన కార్యదర్శి కొనియాడారు. కీలక ఒప్పందాలు కుదిరేందుకు ఇరువురు నేతలు చూపిన ధైర్యానికి, నాయకత్వ పటిమకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు. ఒప్పందంలో అంశాలివీ.. ఇరు దేశాల ఒప్పందంలో దశల వారీగా ఆయుధాల తగ్గింపు, ప్రతీకార చర్యలను నిలిపివేయడం, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడం, అమెరికా తదితర దేశాలతో చర్చలు వంటి అంశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చ సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్తో అన్నారు. కొత్త చరిత్ర ప్రారంభానికి ముందు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి.. నిజాయితీతో, స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉత్తర కొరియాలో పెద్ద మొత్తంలో ఉన్న అణ్వాయుధ సంపత్తి గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా సదస్సుకు హాజరయ్యారు. మూన్తో పాటు ఆయన నిఘా విభాగం చీఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హాజరయ్యారు. పాన్‌మున్‌జోమ్‌లో కలయికకు గుర్తుగా ఇరువురు దేశాధ్యక్షులు విభజన రేఖ వద్ద మొక్కలను నాటారు. అనంతరం వారిరువురు భార్యలతో కలసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూన్ మాట్లాడుతూ తాము భవిష్యత్తులోనూ సరిహద్దుకు ఇరువైపులా సమావేశాలు పెట్టుకుని కలసి చర్చిస్తామన్నారు. కాగా వచ్చే నెలలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. ఉభయ కొరియాల మధ్య మూడోసారి చర్చలు యుద్ధం తర్వాత ఉభయ కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. గతంలో 2000లో ఒకసారి, 2007లో మరోసారి ఇరు దేశాల మధ్య ప్యాంగ్యాంగ్లో ఇదే తరహాలో సమావేశాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందాలేవీ ఆచరణకు నోచుకోలేదు. కాగా మే లేదా జూన్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. 70 ఏళ్ల వైరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ ఒకే దేశంగా కొనసాగిన కొరియా ద్వీపకల్పం అమెరికా, రష్యాల ప్రయోజనాల నేపథ్యంలో 1945లో రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి గతేడాది వరకూ ఇరు కొరియాల మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరు దేశాల మధ్య దశాబ్దాల వైరాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 1945: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో ఆ దేశ దురాక్రమణ నుంచి కొరియాకు విముక్తి. కొరియా ద్వీపకల్పాన్ని పంచుకున్న రష్యా, అమెరికా. కొద్దికాలం ఉత్తర కొరి యా రష్యా పర్యవేక్షణలో, దక్షిణ కొరియాలో అమెరికా పర్యవేక్షణలో పరిపాలన కొనసాగింది. 1948: డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తర కొరియా), సదరన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(దక్షిణ కొరియా)ల్లో ఎన్నికలు 1950: దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణ.. ద.కొరియాకు మద్దతుగా అమెరికా, ఉ.కొరియాకు మద్దతుగా చైనా రంగ ప్రవేశం.. దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిన కొరియా యుద్ధం.. 1953: ముగిసిన కొరియా యుద్ధం. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం. 1961: చైనా, రష్యాలతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న ఉత్తర కొరియా. 1998: ఉత్తర కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు ద.కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ప్రయత్నాలు. 2000: 1948 అనంతరం ఇరు దేశాల మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక సదస్సు 2006: మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా 2010: దక్షిణ కొరియా నౌకను టార్పెడోతో కూల్చిన ఉ.కొరియా.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్న ద.కొరియా 2018: ఇరుదేశాధినేతల శిఖరాగ్ర సదస్సు. పజులో ‘ఒక్కటే కొరియా’ జెండాలతో స్థానికులు -
మార్చ్‌పై ఉక్కుపాదం
* వైఎస్సార్సీపీ ర్యాలీపై పోలీసుల ప్రతాపం * విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత * శాంతియుత ప్రదర్శన కూడా నేరమా? * ప్రజాప్రతినిధుల ఆవేదన సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా కోసం ఏడు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించ తలపెట్టిన మార్చ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వందలాదిగా పాల్గొన్న ఈ కార్యక్రమంపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడి దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేసి వ్యానుల్లో పడేశారు. ఎమ్మెల్యేలు, నాయకులను పక్కకు ఈడ్చేశారు. ప్రజాప్రతినిధులు, మహిళలన్న విచక్షణ కూడా చూపించలేదు. అందరినీ జుట్లుపట్టి ఈడ్చేశారు. జగన్ దీక్షను భగ్నం చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక హోదా పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా బుధవారంనాడు విజయవాడలోని బందరు రోడ్డులోగల పీడబ్ల్యుడీ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఈ మార్చ్‌ను కొనసాగించాలని వైఎస్ఆర్కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ పిలుపునందుకుని బుధవారం మద్యాహ్నం పీడబ్ల్యుడీ గ్రౌండ్‌కు నాయకులు, శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారంతా ప్రదర్శనగా బయల్దేరగానే అక్కడే పెద్ద ఎత్తున మోహరించి ఉన్న పోలీసులు ఒక్క ఉదుటున దాడి చేశారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమను అడ్డుకోవడం తగదంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతిఘటించడంతో పోలీసులు అందరినీ పక్కకు ఈడ్చేడం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను దౌర్జన్యంగా ఈడ్చేసి వ్యాన్‌లోకి విసిరేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. మార్చ్‌ను కవర్ చేసేందుకు సమీపంలో ఉంచిన సాక్షి టీవీ లైవ్ వాహనాన్ని కూడా పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. మిగిలిన మీడియా వెహికల్స్ ఉన్నప్పటికీ పనిగట్టుకుని సాక్షి టీవీ వాహనాన్ని అక్కడ్నుంచి తీసివేసే వరకు పోలీసులు పట్టుబట్టడం గమనార్హం. హోదా సాధించేవరకూ పోరాటం ఆగదు.. ప్రత్యేక హోదా విషయంలో రాష్ర్టప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, హోదా సాధించేవరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదని మాజీ మంత్రి, పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోవడం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం దురుదృష్టకరమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాష్ర్టం మేలు కోరాల్సింది పోయి ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేదిలా ఉందని పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.జగన్ దీక్షను అపహాస్యం చేయడం ద్వారా చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షం గొంతు నొక్కేలా, ప్రజల ఆశలను నీరుగార్చేలా రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు జ్యోతుల నెహ్రూ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కొలుసు పార్థసారథి, కొడాలి నాని, వంగవీటి రాధా, పి.గౌతంరెడ్డి,అంబటి రాంబాబు , సామినేని ఉదయభాను, జోగి రమేష్, మేరుగ నాగార్జున, వాసిరెడ్డి పద్మ, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వారేమన్నా విద్రోహులా..? వాళ్లంతా ప్రజా ప్రతినిధులు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బాధ్యత గలిగిన ప్రతిపక్ష పార్టీలో కీలకమైన నాయకులు.... వారు శాంతియుతంగా ప్రదర్శన చేస్తుంటే ఇలా దుర్మార్గంగా వ్యవహరించడమేమిటి? పోలీసులు పక్కకు ఈడ్చేయడమేమిటి? మహిళలను జుట్టుపట్టి లాగడమేమిటి? వ్యానుల్లోకి విసిరేయడమేమిటి? వారేమన్నా సంఘ విద్రోహ శక్తులా..? లేక వారు చేస్తున్నది ఏమైనా విద్రోహచర్యా? రాష్ర్ట ప్రజల భవితవ్యానికి సంబంధించిన ప్రత్యేక హోదా అనే ఒక మహోన్నతమైన లక్ష్యం కోసం వారు పోరాడుతున్నారు.. శాంతియుతంగా ప్రదర్శన చేయడానికి ఉపక్రమించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేయడానికి బయల్దేరితే వారిపై పోలీసులు ఆ స్థాయిలో దాడి చేయడమేమిటి? ఇపుడు అన్ని వర్గాలలోనూ తలెత్తిన ప్రశ్నలివి. పోలీసులు ఈ స్థాయిలో స్పందిస్తున్నారంటే పై స్థాయి నుంచి ఆదేశాలే కారణమన్నది బహిరంగ రహస్యమే. రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది అంటూ ఇపుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదా సంజీవని కాదు అంటూ వ్యాఖ్యలు.. ప్రతిపక్ష నేత ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం స్పందించకపోవడం, మంత్రులతో దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయించడం, దీక్షను అపహాస్యం చేయడం, వైద్యులను తప్పుడు నివేదికలను ఆసరాగా చేసుకుని జగన్ దీక్షపై బురదజల్లే ప్రయత్నం చేయడం, చివరకు జగన్ దీక్షను పోలీసుల చేత బలవంతంగా భగ్నం చేయించడం, ఇపుడు శాంతియుత ప్రదర్శనపైనా దుర్మార్గంగా దాడి జరిపించడం ఇవన్నీ దేనికి సంకేతాలు? అసలు ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి ఏమిటి? రాజధాని శంకుస్థాపన కోసం ఢిల్లీలో ఆహ్వానపత్రికలు పట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి రేఖామాత్రంగానైనా ఎందుకు వివరించడంలేదు? ప్రత్యేక హోదా ఇస్తేనే మా బిడ్డల భవిష్యత్ బాగుపడుతుందని ఎందుకు చెప్పడం లేదు? అదీ బహిరంగ రహస్యమే. ఆ రహస్యాన్ని ఛేదించే పనిలోనే ఇపుడు రాష్ర్ట ప్రజలు ఉన్నారు. దాని గురించే అంతా చర్చించుకుంటున్నారు...